తెలంగాణలో మంత్రివర్గ విస్తరణ పుకార్లు ఊపందుకున్నాయి. తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి రెండు రోజుల ఢిల్లీ పర్యటనలో ప్రధానంగా ఇదే అంశంపై పార్టీ పెద్దలతో తీవ్రంగా చర్చించినట్లు తెలుస్తోంది. మరో నాలుగు రోజుల్లో ఉగాది పండుగ. ఆ రోజే కొత్త మంత్రుల ప్రమాణ స్వీకారోత్సవం నిర్వహించాలని కాంగ్రెస్ పెద్దలు భావిస్తున్నట్లు తెలుస్తోంది. ఈ నేపథ్యంలో ఎవరెవరికి మంత్రి పదవులు వస్తాయనే విషయం ఇప్పుడు తెలంగాణ కాంగ్రెస్‌లో హాట్ టాపిక్‌గా మారింది. 2023 డిసెంబర్‌లో ప్రభుత్వం ఏర్పడినప్పటికీ… నాటి నుంచి మంత్రివర్గ విస్తరణ పుకార్లు వినిపిస్తూనే ఉన్నాయి. వీటికి చెక్ పెట్టేలా ఈ ఉగాదికి పూర్తిస్థాయి మంత్రివర్గ సమావేశం నిర్వహించాలని సీఎం రేవంత్ రెడ్డి గట్టి పట్టుదలతో ఉన్నట్లు తెలుస్తోంది.
Also Read: బాల్ ట్యాంపరింగ్ వివాదంలో చెన్నై..
వాస్తవానికి మంత్రి పదవులు, కార్పొరేషన్ పదవులు ఆశించిన చాలా మంది సీనియర్లు, పార్టీ నేతలు… ప్రభుత్వం ఏర్పడి ఏడాదిన్నర దాటినప్పటికీ.. పదవులు రాకపోవడంతో అంతా గుర్రుగా ఉన్నారు. దీంతో ఆశావహులను కూల్ చేసేందుకు సీఎం రేవంత్ సమాయత్తమవుతున్నారు. తెలంగాణలో మంత్రిపదవులు ఆశిస్తున్న నేతల్లో ముగ్గురి పేర్లు ప్రముఖంగా వినిపిస్తున్నాయి. వారిలో కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి, సుదర్శన్ రెడ్డి, మల్‌రెడ్డి రంగారెడ్డి పేర్లు క్యాబినెట్ రేసులో ఉన్నాయి. కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి సోదరుడు వెంకటరెడ్డి ఇప్పటికే క్యాబినెట్‌లో కీలక శాఖలు నిర్వహిస్తున్నారు. దీంతో రాజగోపాల్ రెడ్డికి వస్తుందో రాదో తెలియని పరిస్థితి.
Also Read: జగన్‌ను అనుకరిస్తున్న కేటీఆర్..!
సీనియర్ కోటాలోనే సుదర్శన్ రెడ్డి, మల్‌రెడ్డి రంగారెడ్డి పేర్లు ఉన్నాయి. ఈ ఇద్దరిలో రంగారెడ్డికి మాత్రం సీఎం రేవంత్ రెడ్డి స్వయంగా హామీ ఇచ్చినట్లు తెలుస్తోంది. మంత్రి పదవి కాకుండా.. చీఫ్ విప్ పదవి ఖాయం చేస్తున్నట్లు రేవంత్ రెడ్డి హామీ ఇచ్చినట్లు సమాచారం. కేబినెట్ హోదా ఉన్న పదవే అని సముదాయించేందుకు కూడా రేవంత్ ప్రయత్నం చేసినట్లు తెలుస్తోంది. అయితే మల్‌రెడ్డి రంగారెడ్డి మాత్రం.. ససేమిరా అన్నట్లు విశ్వసనీయ వర్గాల సమాచారం. ఇస్తే మంత్రిపదవి ఇవ్వాలని.. లేదంటే లేదని తేల్చి చెప్పినట్లు తెలుస్తోంది. వాస్తవానికి రంగారెడ్డి జిల్లాలో గెలిచిన కాంగ్రెస్ పార్టీ తరఫున గెలిచిన ఏకైక కాంగ్రెస్ నేత మల్‌రెడ్డి రంగారెడ్డి. పార్టీలో సీనియర్‌గా ఉన్న తనకు మంత్రిపదవి ఇవ్వకుంటే ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేస్తానని తెగేసి చెప్పినట్లు తెలుస్తోంది.
Also Read: టార్గెట్ గ్రేటర్.. బీజేపీ బీసీ ప్లాన్..!
అగ్రకులాలకు పదవి ఇవ్వకూడదని పార్టీ భావిస్తే.. తన నియోజకవర్గం నుంచి బీసీ అభ్యర్థిని నిలబెట్టి గెలిపిస్తానని కూడా రంగారెడ్డి చెప్పినట్లు పార్టీ నేతల మాట. పదవి లేకపోవడం వల్ల స్థానిక సంస్థల ఎన్నికల్లో ఇబ్బందులు వస్తాయనేది మల్‌రెడ్డి మాట. రంగారెడ్డి జిల్లా పరిధిలో కనీసం ఒక మంత్రిపదవి కూడా లేదని.. కాబట్టి.. ఇవ్వాల్సిందే అని పట్టుబడుతున్నారు. దీంతో మంత్రివర్గ విస్తరణ కత్తిమీద సాములా మారింది. వాస్తవానికి మంత్రి పదవుల కేటాయింపు పూర్తిగా ఢిల్లీ పెద్దల కనుసన్నల్లోనే ఉంది. రేవంత్ ఇచ్చిన జాబితాలో మార్పులు చేర్పులు కూడా పెద్ద ఎత్తున ఢిల్లీ పెద్దలు చేసినట్లు తెలుస్తోంది. మరి కొత్త మంత్రులుగా ఎవరు ప్రమాణం చేస్తారో తెలియాలంటే.. మరో వారం రోజులు ఆగాల్సిందే అంటున్నారు టీ కాంగ్రెస్ నేతలు.