తెలంగాణాలో ఆంధ్రప్రదేశ్ ఎన్డియే కూటమి అడుగు పెట్టే విషయంలో రాజకీయంగా పెద్ద చర్చే జరుగుతోంది. ఆరు నెలల నుంచి దీని గురించి ఎన్నో వార్తలు సోషల్ మీడియాలో చూస్తూనే ఉన్నాం. ఇక ఎలక్ట్రానిక్ మీడియాలో కూడా కొందరు ఎమ్మెల్యేలు పార్టీ మారుతున్నారని, బిఆర్ఎస్ నుంచి టీడీపీలోకి వచ్చే అవకాశం ఉందని అంచనాలు వేశారు. కానీ ఇప్పటి వరకు ఆ దిశగా ఎలాంటి అడుగు పడలేదు. 2018 తర్వాత తెలంగాణాలో ఇప్పటివరకు టీడీపీ పోటీ చేయలేదు. గత ఎన్నికల్లో పోటీ చేసే అవకాశం ఉందని భావించినా వివిధ రాజకీయ సమీకరణాల కారణంగా చివరి నిమిషంలో ఎన్నికల నుంచి తప్పుకున్నట్లు ప్రకటించింది. అదే సమయంలో చంద్రబాబు అరెస్ట్ అవ్వడం కూడా ఒక కారణంగా పేర్కొంది టిడిపి అధిష్టానం.
Also Read : తెలుగు రాష్ట్రాలను షేక్ చేస్తున్న మెడికల్ కాలేజ్ స్కాం
టిడిపి ఎన్నికల బరిలో లేకపోవడంతో టీడీపీ కార్యకర్తలు అందరూ ఆ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ గెలుపు కోసం పని చేశారు. బిఆర్ఎస్ అధినేత కేసిఆర్ వ్యాఖ్యలు, కేటిఆర్ చంద్రబాబు పై వేసిన సెటైర్లు ఇందుకు ప్రధాన కారణం. వారిద్దరి పై ఉన్న ఆగ్రహాన్ని టిడిపి కార్యకర్తలు ఈ విధంగా తీర్చుకున్నారు అని భావించవచ్చు. ఇప్పుడు మరోసారి తెలంగాణాలో ఎన్నికల సందడి కనపడుతోంది. టీడీపీ తెలంగాణా ఎన్నికల్లో పోటీ చేసే అవకాశం ఉందనే ప్రచారం గట్టిగా జరుగుతోంది. జుబ్లీ హిల్స్ ఎమ్మెల్యే, బిఆర్ఎస్ నాయకుడు మాగంటి గోపీనాథ్ మరణంతో ఏర్పడిన ఖాళీతో ఈ స్థానానికి ఉపఎన్నిక జరగనుంది. అక్కడ ఆంధ్రా ఓటర్లు ఎక్కువగా ఉండటం, ఐటీ ఉద్యోగులు కూడా భారీగా ఉండటంతో టీడీపీకి ప్లస్ అవుతుందని భావిస్తున్నారు. మాగంటి గోపీనాథ్ గతంలో టిడిపి నుంచి గెలిచి బిఆర్ఎస్ పార్టీలో చేరిన సంగతి తెలిసిందే.
Also Read : తిరుపతిలో భయపెడుతున్న గంజాయి గ్యాంగ్ లు..
అయితే ఈ స్థానం నుంచి బరిలోకి ఎవరిని దించాలి అనే విషయంలోనే టిడిపిలో సందిగ్ధత కొనసాగుతున్నట్లు తెలుస్తుంది. ఇక్కడ నుంచి నందమూరి హరికృష్ణ కుమార్తె సుహాసినిని బరిలోకి దించాలని భావిస్తున్నట్టు సమాచారం. ఈ విషయంలో బీజేపి కూడా అంగీకారానికి వచ్చినట్టు వార్తలు వస్తున్నాయి. అయితే సుహాసిని గతంలో కూకట్‌పల్లి నుంచి పోటీ చేసి ఉన్న నేపధ్యంలో ఇప్పుడు స్థానం మార్చితే గెలుపు అవకాశాలు ఎలా ఉంటాయి అనే విషయంలో టిడిపిలో ఆందోళన ఉన్నట్లు తెలుస్తుంది. ఒకవేళ టీడీపీ పోటీలో ఉంటే మాత్రం అది ఖచ్చితంగా కాంగ్రెస్ ను ఇబ్బంది పెట్టే అవకాశం ఉండవచ్చు. ఇక్కడ టీడీపీ క్యాడర్ కాస్త బలంగానే ఉంది. వాళ్ళు గత ఎన్నికల్లో కాంగ్రెస్ కోసం పని చేసారు. ఇక బీఆర్ఎస్ లో కూడా కొందరు టీడీపీ కార్యకర్తలు ఉన్నారు. వారు కూడా ఈసారి టీడీపీ కోసం తమ వంతు కృషి చేయవచ్చని భావిస్తున్నారు. మొత్తం మీద ఇక్కడ టిడిపి పోటీ చేస్తే కాంగ్రెస్ కి ఇబ్బందులు తప్పవు.