ఎన్నికల్లో ఇచ్చిన హామీల అమలు దిశగా కూటమి ప్రభుత్వం అడుగులు వేస్తోంది. అధికారంలోకి వచ్చిన ఏడాదిలోగానే అన్ని హామీలు అమలు చేస్తామని ఎన్నికల సమయంలో చంద్రబాబు సహా నేతలంతా ప్రజలకు హామీ ఇచ్చారు. అందులో భాగంగానే దీపం పథకం -2లో భాగంగా ఏడాదికి 3 ఉచిత గ్యాస్ సిలెండర్లను అందిస్తున్నారు. అయితే కీలకమైన రెండు పథకాల అమలు ఎప్పుడని ఇప్పటికే వైసీపీ నేతలు ప్రశ్నిస్తున్నారు కూడా. దీంతో తల్లికి వందనం, అన్నదాత సుఖీభవ పథకాల అమలుపైన కూటమి ప్రభుత్వం దృష్టి పెట్టింది. తల్లికి వందనం డబ్బులను ఈ విద్యా ఏడాది ముగింపు లోపు ఇస్తామని మంత్రి నారా లోకేష్ ఇప్పటికే ప్రకటించారు. అటు అన్నదాత సుఖీభవ డబ్బులను కూడా ఖరీఫ్ లోపే చెల్లిస్తామన్నారు వ్యవసాయ శాఖ మంత్రి కింజరాపు అచ్చెన్నాయుడు.
Also Read : అందరూ స్టార్లే.. అఖండ2 పై బోయపాటి బిగ్ స్కెచ్
మరో రెండు రోజుల్లో ఏపీ బడ్జెట్ సమావేశాలు ప్రారంభం కానున్నాయి. ఈ నెల 28న అసెంబ్లీలో బడ్జెట్ ప్రవేశపెట్టనున్నారు. ఈ బడ్జెట్‌లో సూపర్ సిక్స్ పథకాల అమలుకు పెద్ద ఎత్తున కేటాయింపులు ఉంటాయని పార్టీ నేతలు చెబుతున్నారు. అందులో భాగంగానే ఈ రెండు పథకాలకు నిధుల కేటాయింపుతో పాటు అర్హతల మార్గదర్శకాలపైన కూడా కూటమి ప్రభుత్వం విధానపరమైన నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. ఈసారి బడ్జెట్ అంచనా దాదాపు రూ.3 లక్షల కోట్ల వరకు ఉంటుందని అంతా భావిస్తున్నారు. కూటమి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత పూర్తిస్థాయి బడ్జెట్‌ను ప్రవేశపెడుతున్నారు. ఈసారి అభివృద్ధి, సంక్షేమానికి ప్రాధాన్యత ఉండేలా బడ్జెట్ ఉంటుందని ఇప్పటికే ప్రభుత్వ పెద్దలు వెల్లడించారు కూడా.
Also Read : వైసీపీకి మరో షాక్.. పల్నాడు జిల్లా షేకింగ్ న్యూస్
సూపర్ సిక్స్ హామీల్లో భాగంగా తల్లికి వందనం, అన్నదాత సుఖీభవ, ఆర్టీసీ బస్సుల్లో మహిళలకు ఉచిత ప్రయాణం కోసం నిధులు పెద్ద ఎత్తున కేటాయిస్తున్నట్లు తెలుస్తోంది. జూన్ నెలలో తల్లికి వందనం, జులైలో అన్నదాత సుఖీభవ అమలుకు ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. ఇక ఉచిత ఆర్టీసీ బస్సు ప్రయాణం కూడా ఈ ఉగాది నుంచే ప్రారంభం కానున్నట్లు తెలుస్తోంది. తల్లికి వందనం పథకం కింద 69.16 లక్షల మందిని అర్హులుగా గుర్తించారు. అలాగే అన్నదాత సుఖీభవను 53.58 లక్షల మంది రైతులకు అందివ్వాలని అధికారులు నిర్ణయించారు. ఈ రెండు పథకాల కోసం రూ.21,017 కోట్లు కావాల్సి ఉంది. ఇందులో పీఎం కిసాన్ కింద కేంద్రం ఇచ్చే నిధులను మినహాయిస్తే… దాదాపు రూ.5 వేల కోట్ల వరకు ఆదా అవుతుంది. దీని ప్రకారమే నిధుల కేటాయింపు ఉంటుందని అధికారులు చెబుతున్నారు.