ఒంగోలు కార్పోరేషన్ రాజకీయాలు ఇప్పుడు ఆసక్తికరంగా మారాయి. కార్పోరేషన్ వేదికగా మాజీ మంత్రి బాలినేని వర్సెస్ టిడిపి ఎమ్మెల్యే దామచర్ల ఎపిసోడ్ నడుస్తోంది. నేడు ఒంగోలు మున్సిపల్ కార్పోరేషన్ అత్యవరసర సమావేశం ఏర్పాటు చేసింది టిడిపి. సమావేశానికి 23 మంది వైసిపి కార్పోరేటర్లు దూరంగా ఉన్నారు. వైసిపికి రాజీనామా చేసేందుకు సిద్దమైన మాజీ మంత్రి బాలినేనితో భేటీ అయ్యేందుకు 20 మంది వైసిపి కార్పోరేటర్లు హైదరాబాద్ చేరుకున్నారు.
ఇటీవల టిడిపిలో చేరిన 19 మంది వైసిపి కార్పోరేటర్లు, టిడిపి 6, జనసేన 1 కార్పోరేటర్లతో కలిపి మొత్తం 26 మంది హజరయ్యే అవకాశం ఉంది. సమావేశం నిర్వహించాలంటే కోరం సభ్యులు 37 మంది ఉండాల్సిందే. కోరం లేకపోవడంతో సమావేశం వాయిదా పడే అవకాశం ఉందని తెలుస్తోంది. ఈ రోజు సమావేశం ఉండటంతో రాత్రికి రాత్రే 20 మంది వైసిపి కార్పోరేటర్లు హైదరాబాద్‌లో బాలినేని శిబిరానికి చేరుకోవడంతో రసవత్తరంగా మారాయి ఒంగోలు కార్పోరేషన్ రాజకీయాలు.
Read Also : జగ్గయ్యపేటలో జగన్ కి షాక్ ఇచ్చిన టిడిపి
ఒంగోలు మున్సిపల్ కార్పోరేషన్ ను ఎలా అయినా తమ వశం చేసుకోవాలని టీడీపీ పట్టుదలగా ఉంది. ఎమ్మెల్యే దామచర్ల జనార్ధన్ ఈ విషయంలో పట్టుధలగానే ఉన్నారు. తాము గెలవాల్సిన స్థానాన్ని వైసీపీ అధికారం అడ్డం పెట్టుకుని లాక్కుందని పలుమార్లు టీడీపీ నేతలు ఆరోపణలు చేసారు. అటు మంత్రి గొట్టిపాటి రవి కుమార్ కూడా ఈ స్థానంపై సీరియస్ గానే ఉన్నారు. ఇక బాలినేని శ్రీనివాసరెడ్డి వైసీపీ ని వీడుతున్నా కార్పోరేషన్ ను వదలకపోవడం వెనుక కారణం ఏంటీ అనేది అర్ధం కాలేదు.
ఒంగోలు కార్పొరేషన్ పై బాలినేని ఎందుకు అంత పట్టుదలగా ఉన్నారనే దానిపై పెద్ద చర్చే జరుగుతోంది. జగన్ వైఖరి కారణంగానే వైసీపీ ఓడిపోయిందని, తనకు గుర్తింపు లేదని చెప్పిన బాలినేని 20 మందిని తీసుకుని ఎందుకు వెళ్ళారో తెలియాల్సి ఉంది. మరి ఈ రాజకీయానికి టిడిపి ముగింపు పలుకుతుందా లేదా అనేది చూడాలి. టిడిపి లోకి తనను తీసుకునే విషయంలో టిడిపి అధిష్టానం పై ఒత్తిడి పెంచడమే లక్ష్యంగా బాలినేని ఈ రాజకీయానికి తెరతీశారని రాజకీయ పరిశీలకులు అంచనా వేస్తున్నారు. మరి ఈ పోరులో ఎవరు పైచేయి సాధిస్తారో చూడాలి.