ఏపీలో వైసీపీ అధికారంలో ఉన్నప్పుడు హడావుడి చేసిన వాళ్ళల్లో సజ్జల భార్గవ రెడ్డి ఒకరు. తండ్రి సలహాదారుగా, కొడుకు సోషల్ మీడియా ఇంచార్జ్ గా ఉంటూ చేసిన సందడి, హడావిడి అంతా ఇంతా కాదు. వైసీపీ నాయకుల సోషల్ మీడియా ఖాతాలను కూడా భార్గవ్ రెడ్డి చూసుకుంటూ.. వాటి ద్వారా టిడిపి నాయకుల పై తప్పుడు ప్రచారాలు చేస్తూ రెచ్చగొట్టే కార్యక్రమాలను పెద్ద ఎత్తున చేసిన సంగతి తెలిసిందే. ఇప్పటికి కూడా దాదాపుగా అదే కార్యక్రమం జరుగుతోంది. ఇక వైసీపీ సోషల్ మీడియా ద్వారా టీడీపీకి సంబంధించిన మహిళా నాయకుల పై, మహిళా కార్యకర్తల పై ఏ స్థాయిలో నీచంగా ప్రచారం చేసే వాళ్ళు అనేది కూడా తెలిసిందే.
ఏకంగా పార్టీ అధినేత చంద్రబాబు, నారా లోకేష్ పై తప్పుడు ప్రచారం చేసి పబ్బం గడపుకోవడంలో జూనియర్ సజ్జల కీలక పాత్ర పోషించారు. ప్రత్యేక టీంని ఏర్పాటు చేసుకుని వారి ద్వారా ఎప్పటికప్పుడు ఫోటో మార్ఫింగ్ చేయడం, విమర్శలు చేయడం, తప్పుడు ఆరోపణలు చేయడం వంటివి చేసేవారు. ఇది క్రమంగా వైసీపీ నేతలకు కూడా చికాకు తెప్పించిన విషయం. కొందరు వైసీపీ నేతలు విసిగిపోవడానికి కారణం ఇదే అనే టాక్ కూడా ఉంది. ఇదిలా ఉంచితే… సజ్జల భార్గవ్ రెడ్డిపై ఎప్పుడు కేసు నమోదు చేస్తారు, ఆయన్ను ఎప్పుడు అరెస్ట్ చేస్తారనే దానిపై టిడిపి కార్యకర్తలు ఎదురు చూస్తున్న సంగతి తెలిసిందే.
ఇప్పుడు ఆ సమయం దాదాపుగా వచ్చేసినట్టే కనపడుతోంది. సజ్జల భార్గవరెడ్డిపై కేసు నమోదు చేసారు సీఐడీ అధికారులు. టీడీపీ నేత వర్ల రామయ్య ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసారు. సజ్జల భార్గవరెడ్డిపై ఈసీకి టీడీపీ నేత వర్ల రామయ్య ఫిర్యాదు చేసారు. సోషల్ మీడియాలో చంద్రబాబుపై అసత్య ప్రచారం చేస్తున్నారని ఫిర్యాదు చేశారు ఆయన. ఈసీ ఆదేశాలతో భార్గవరెడ్డిపై కేసు నమోదు చేసిన సీఐడీ అధికారులు దీనిపై దర్యాప్తు చేపడుతున్నారు. త్వరలోనే ఆయన్ను అదుపులోకి తీసుకునే అవకాశం ఉంది. మరి ఇప్పటికైనా తప్పుడు ప్రచారం ఆపుతారో లేక తనని అరెస్ట్ చేసే ధైర్యం టిడిపి ప్రభుత్వానికి లేదంటూ ఇంకా రెచ్చిపోతారా చూడాలి.