ఏపీలో కూటమి అధికారంలోకి వచ్చిన నాలుగు నెలలు కూడా పూర్తి కాలేదు. ఈలోపే విబేధాలు తలెత్తే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. నిన్నటి వరకు వైసీపీలో పదవులు అనుభవించిన నేతలు ఇప్పుడు ఒక్కొక్కరుగా జగన్‌కు గుడ్ బై చెప్పేసి జనసేనలో చేరుతున్నారు. ఇప్పటికే బాలినేని శ్రీనివాసరెడ్డి, సామినేని ఉదయభాను, కిలారి రోశయ్య జనసేన కండువాలు కప్పుకున్నారు. త్వరలో మరి కొందరు నేతలు కూడా పార్టీ మారుతారనే పుకార్లు షికారు చేస్తున్నాయి. అయితే ఇక్కడే అసలు సమస్య తలెత్తింది. నిన్నటి వరకు ఒక లెక్క… ఇప్పటి నుంచి ఒక లెక్క అన్నట్లుగా పరిస్థితి మారిపోయింది. పదవులపై ఎలాంటి ప్రకటన చేయనప్పటికీ… జనసేనలో చేరిన నేతలు మాత్రం పదవులు తమకే అనే ప్రచారం చేయడం ఇప్పుడు షాక్ ఇస్తోంది.
ఒప్పందంలో భాగంగా సీట్లు త్యాగం చేసిన నేతలకు తగిన ప్రాధాన్యత ఇస్తామని చంద్రబాబు హామీ ఇచ్చారు. అందులో భాగంగానే ఇప్పటికే కొనకళ్ల నారాయణ, మంతెన రామరాజు, పీలా గోవింద్‌లకు కార్పొరేషన్ ఛైర్మన్ పదవులిచ్చారు. అలాగే పిఠాపురం వర్మ, తెనాలి ఆలపాటి రాజాలకు ఎమ్మెల్సీ టికెట్ ఇస్తామని హామీ ఇచ్చారు. అన్నట్లుగానే కృష్ణా, గుంటూరు జిల్లాల పట్టభద్రుల నియోజకవర్గం ఎమ్మెల్సీ అభ్యర్థిగా ఆలపాటి రాజాను ప్రకటించారు కూడా. మంత్రివర్గ సమావేశం అనంతరం పవన్ కల్యాణ్, పురందేశ్వరితో చర్చించిన చంద్రబాబు… అధికారికంగా రాజా పేరు ప్రకటించారు.
Also Read : ఐపిఎస్ కు గురి పెట్టిన బాబు సర్కార్… సునీల్ కుమార్ కు సెట్ చేసారా…?
చంద్రబాబు ఆదేశాలతో ఇప్పటికే ఆలపాటి రాజా నియోజకవర్గాల్లో ప్రచారం కూడా చేసుకుంటున్నారు. అయితే ఇటీవల జనసేన పార్టీలో చేరిన సామినేని ఉదయభాను సోషల్ మీడియాలో పెట్టిన పోస్ట్ ఇప్పుడు వైరల్‌గా మారింది. ఉమ్మడి కృష్ణ, గుంటూరు జిల్లాల పట్టభద్రుల ఎన్నికల్లో జనసేన పార్టీ అభ్యర్థిగా ఉదయభాను పోటీ చేస్తున్నారని… కాబట్టి తమ ఓటును నమోదు చేసుకోవాలంటూ విజ్ఞప్తి చేశారు. అలాగే ఎన్నికల్లో ఉదయభానును బలపరచి, గెలిపిద్దాం అనే పోస్ట్‌ను అన్ని వాట్సప్, టెలిగ్రామ్, సోషల్ మీడియా ప్లాట్‌ఫామ్‌లలో వైరల్ చేస్తున్నారు.
వాస్తవానికి ఉదయభానును అభ్యర్థిగా ప్రకటిస్తూ జనసేన పార్టీ నుంచి ఎలాంటి ప్రకటన రాలేదు. పైగా పట్టభద్రుల ఎన్నికల్లో అభ్యర్థి అంటూ ఇప్పటికే ఆలపాటి రాజా ప్రచారం చేసుకుంటున్నారు కూడా. మరి సామినేని ఉదయభాను ఎందుకు ఈ తరహా ప్రచారం చేసుకుంటున్నారో అర్థం కావటం లేదనేది టీడీపీ నేతల మాట. ఈ తరహా ప్రచారం వల్ల కూటమిలో విబేధాలు ఖాయమంటున్నారు. దీనిపై అధిష్ఠానం తక్షణమే స్పందించాలని కోరుతున్నారు.