వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నేతలంతా ఏమయ్యారు.. పార్టీలో నిన్నటి వరకు చక్రం తిప్పిన నేతలు మొదలు అధినేత వరకు ఎక్కడున్నారు. ఇంత పెద్ద వివాదం నడుస్తుంటే.. కనీసం ఒక్కరు కూడా బయటకు ఎందుకు రావటం లేదు.. అధినేత భార్యనే టార్గెట్ చేసినా కూడా వైసీపీ నుంచి కౌంటర్ ఎందుకు రావటం లేదు.. ఇదే ఇప్పుడు ఏపీ ప్రజల్లో వినిపిస్తున్న ప్రశ్నలు. అయితే వీటికి జవాబు మాత్రం ఒకటే.. అదేమిటింటే.. ఏం జరిగినా సరే.. నేను చెప్పే వరకు ఎవరూ నోరెత్తడానికి వీల్లేదు.. అనే మాట.. ఈ మాట చెప్పింది అధినేత అయితే ఎవరికీ ఎలాంటి అనుమానాలు రావు. కానీ వాస్తవానికి అధినేతను కూడా కంట్రోల్ చేయగల ఓ వ్యక్తి.. శక్తిలా మారి ఇలా పార్టీని, నేతలను కూడా తన గుప్పిట్లో పెట్టుకున్నారనేది బహిరంగ రహస్యం.
Also Read : శత్రువులుగా మారిన మిత్రులు..!
2019 ఎన్నికల్లో వైసీపీ గెలుపు కంటే ముందు అందరికీ తెలిసిన ముఖ్యనేతలు నలుగురు, ఐదుగురు మాత్రమే. వైవీ సుబ్బారెడ్డి, విజయసాయిరెడ్డి, పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి. వీళ్లు మాత్రమే ఎన్నికలకు ముందు పార్టీలోని అన్ని విషయాలను దగ్గరుండి చూసుకున్నారు. పార్టీ ప్రతిపక్షంలో ఉన్నప్పుడు జగన్ వెంటే ఉన్నారు. ఢిల్లీ స్థాయిలో లాబీయింగ్ చేసి కేంద్ర పెద్దలతో ఎలాంటి ఇబ్బందులు రాకుండా జాగ్రత్త పడ్డారు. అలాగే ఏపీలోని ముఖ్య అధికారులు తమకు అనుకూలంగా పని చేసేలా పావులు కదిపారు. నాటి టీడీపీ ప్రభుత్వంపై లెక్క లేనన్ని ఆరోపణలు చేయడంతో పాటు ప్రజలను తప్పుదోవ పట్టించడంలో సఫలం అయ్యారు కూడా. అలాగే వీళ్లు చెప్పినట్లుగానే మీడియాలో వార్తలు కూడా వచ్చాయనేది బహిరంగ రహస్యం. సొంత మీడియాతో పాటు అనుకూల ఛానల్స్, పత్రికల ద్వారా ప్రభుత్వంపై పదే పదే ఆరోపణలు చేశారు. చేయించారు కూడా.
Also Read : చేరికలపై చంద్రబాబు సంచలన నిర్ణయం
అయితే ఇదంతా 2019 ఎన్నికలకు ముందు పరిస్థితి. నాడు జగన్‌తో ప్రతి నాయకుడు మాట్లాడాడు. ప్రతి కార్యకర్త కూడా తమ అధినేతను కలిసే అవకాశం కల్పించారు. అలాగే నాటి అధికార పార్టీకి వ్యతిరేకంగా ప్రతి ఒక్కరు మీడియా ఎదుట నోటికి వచ్చినట్లు ఆరోపణలు కూడా చేశారు. ఇంకా చెప్పాలంటే రెచ్చిపోయారు కూడా. కానీ ఇదంతా 2019 ఎన్నికలకు ముందు. 151 సీట్లతో వైసీపీ అధికారంలోకి వచ్చిన తర్వాత పరిస్థితి పూర్తిగా మారిపోయింది. అప్పటి వరకు ఎవరికీ పరిచయం లేని వ్యక్తి తెరపైకి వచ్చారు. పార్టీని పూర్తిగా తన కంట్రోల్‌లోకి తీసుకున్నారు. చివరికి తానే పార్టీ అనేలా పరిస్థితి మార్చేశారు. ఆయన ఎవరో కాదు.. సజ్జల రామకృష్ణారెడ్డి.. వైసీపీ నేతలు, మీడియా మిత్రులు ముద్దుగా ఎస్ఆర్‌కే అని పిలుస్తారు.
Also Read : ఫ్యాన్స్‌కు ఎన్టీఆర్ మాస్ సర్ప్రైజ్
ప్రభుత్వ ప్రధాన సలహాదారుగా సజ్జలను జగన్ నియమించారు. అలాగే సజ్జల కుమారుడు భార్గవ్ రెడ్డికి పార్టీ సోషల్ మీడియా బాధ్యతలు అప్పగించారు. ఈ ఇద్దరు చెప్పినట్లుగానే ప్రభుత్వ అధికారులు, పార్టీ నేతలు, మీడియా కూడా నడుచుకున్నాయనేది బహిరంగ రహస్యం. ఎలాంటి వివాదం అయినా సరే.. ఎస్ఆర్‌కే మాత్రమే పరిష్కరించాలి. చివరికి మంత్రివర్గంలో స్థానం కావాలన్నా సరే.. ఆయన మాటే ఫైనల్. ఇక 2024 ఎన్నికల్లో టికెట్ల కేటాయింపులో కూడా సజ్జల చెప్పినట్లుగానే మార్పులు చేర్పులు చేశారనేది పార్టీ పెద్దల మాట. అసలు పార్టీ ఓటమికి సజ్జల ప్రధాన కారణమని కొందరు నేతలు బహిరంగంగానే వ్యాఖ్యలు చేశారు. అయినా సరే జగన్ మాత్రం మరోసారి సజ్జలకే పార్టీ కో ఆర్డినేటర్ బాధ్యతలు అప్పగించారు.
Also Read : విషం చిమ్ముతున్న వారి కోరలు పీకుతారా..?
ఎన్ని విమర్శలు వచ్చినా సరే.. సజ్జల తీరులో మాత్రం ఎలాంటి మార్పు రాలేదనేది వైసీపీ నేతల మాట. పార్టీ అధినేతపైన ఎన్ని విమర్శలు వస్తున్నా సరే.. దానికి కౌంటర్ ఇచ్చే విషయంలో సజ్జల చెప్పిందే ఫైనల్. ఇంకా చెప్పాలంటే.. వైసీపీ నేతలకు సజ్జల ఆంక్షలు విధించినట్లు తెలుస్తోంది. చివరికి మీడియా ముందుకు వచ్చేందుకు, ఇంటర్వ్యూలు ఇచ్చేందుకు కూడా సజ్జల అనుమతి తప్పనిసరి అనేది పార్టీ నేతల మాట. తాజాగా సాక్షి మీడియాలో అమరావతి ప్రాంతంపైన, మహిళలపైన కించపరిచేలా వ్యాఖ్యలు చేశారు. ఈ వ్యవహారం అటు తిరిగి, ఇటు తిరిగి చివరికి వైసీపీ అధినేత జగన్ సతీమణి భారతీరెడ్డికి కూడా తగులుతోంది. దీంతో ఎదురు దాడి చేసేందుకు ఒకరిద్దరు వైసీపీ నేతలు ముందుకు వచ్చారు. కానీ వీరికి వైసీపీ పెద్దలు బ్రేక్ వేసినట్లు తెలుస్తోంది. మీడియా ముందు కనీసం నోరు ఎత్తడానికి కూడా వీల్లేదని ఆదేశాలు జారీ చేసినట్లు విశ్వసనీయ సమాచారం. అవసరమైతే… మన మీడియా వస్తుంది.. ఏం మాట్లాడాలో కూడా వాళ్లే చెబుతారు.. వాళ్లు చెప్పినట్లు చెబితే చాలు.. అని స్పష్టమైన ఆదేశాలు జారీ చేశారట. ఇక ఇంటర్వ్యూల సంగతి సరే సరి. నేను చెప్పే వరకు ఎవరూ మీడియాకు కనిపించవద్దు అని ఎస్ఆర్‌కే సార్ ఆదేశించారనేది పార్టీ నేతల మాట.
Also Read : వైసీపీకి మరో రాజ్యసభ ఎంపీ రాంరాం
వైసీపీ నేతలు మీడియాకు దూరంగా ఉండటం సొంత పార్టీ కార్యకర్తలకే ఆశ్చర్యం కలిగిస్తోంది. సొంత ఛానల్ డిబేట్ లో మాత్రమే గొంతు చించుకుంటున్నారు తప్ప.. మరెక్కడా వైసీపీ నేతలు కనిపించటం లేదు. అసలు మన టీవీ ఎంత మంది చూస్తున్నారు అనేది సగటు వైసీపీ కార్యకర్త ప్రశ్న. ఓ వైపు టీడీపీ అధినేత మొదలు కిందిస్థాయి నేత వరకు మీడియాకు గౌరవం ఇస్తుంటే.. వైసీపీ నేతలు మాత్రం మీడియా మిత్రులకు కనీసం సమాచారం కూడా ఇవ్వటం లేదు. ఆ పెద్ద మాటే ఫైనల్ అన్నట్లుగా వైసీపీ నేతలు వ్యవహరిస్తున్నారు. దీంతో సగటు వైసీపీ కార్యకర్త కూడా పార్టీ అధినేత తీరుపై గుర్రుగా ఉన్నాడు. ఇలాగే ఉంటే… ఇంక గెలిచినట్లే.. అని వ్యాఖ్యానిస్తున్నారు.