వైసీపీ నుంచి కొందరు నేతలు బయటకు రావడం ఈ మధ్య కాలంలో హాట్ టాపిక్ అయింది. ముఖ్యంగా రాజ్యసభ ఎంపీగా ఉన్న… మోపిదేవి వెంకటరమణ తన పదవిని వదులుకుని బయటకు వచ్చేశారు. వైసీపీకి, రాజ్యసభ పదవికి ఒకటే రోజు రాజీనామా చేసారు ఆయన. జగన్ కు అత్యంత నమ్మకమైన నేతగా ఆయనకు గుర్తింపు ఉంది. శాసన మండలి నుంచి ఆయనను మంత్రిగా పంపించారు. ఆ తర్వాత మండలిని రద్దు చేయాలని జగన్ భావించి ఆయనను రాజ్యసభకు పంపడం అప్పట్లో ఒక సంచలనం అయింది. అలాంటి మోపిదేవి ఎందుకు బయటకు వచ్చారా అనే దానిపై ఇప్పటికి కూడా చర్చలు జరుగుతున్నాయి.
అయితే దీని వెనుక బలమైన కారణం ఉందని అంటున్నాయి ఆయన సన్నిహిత వర్గాలు. ఆ కారణం ఏంటీ అనేది ఒకసారి చూస్తే… రాజ్యసభ సభ్యత్వానికి, వైసిపికి రాజీనామా చేసి తొలిసారి రేపల్లె వచ్చిన మాజీ మంత్రి మోపిదేవి వెంకటరమణ… తన సన్నిహితులతో సమావేశం అయ్యారు. తన స్వగృహంలో అభిమానులు, అనుచరులుతో సమావేశం నిర్వహించి వారి యోగ క్షేమాలు అడిగి తెలుసుకుని పలు కీలక అంశాలను వారి వద్ద ప్రస్తావించినట్టు తెలుస్తోంది. వైఎస్ జగన్ కారణంగా తాను అనుభవించిన కష్టాలు, మానసిక క్షోభ గురించి వారికి వివరించినట్లు తెలుస్తుంది. అక్కడ పదవులు లభించినా గౌరవం లభించలేదని, ఇంకా అక్కడ ఉండలేని పరిస్థితుల్లోనే పార్టీకి రాజీనామా చేసినట్లు తెలిపారు.
Read Also : బ్యారేజ్ ను బొట్లు ‘ఢీ కొట్టడం’ కుట్రే.. తేల్చేసిన బెజవాడ పోలీసులు
టిడిపిలోకి వెళ్లేందుకు కార్యచరణ సిద్ధం చేసుకుంటున్నానని, దానికి అందరూ సహకరించాలని ఆయన కోరారు. వైసిపికి రాజీనామా కారణాలు, టిడిపిలో చేరే అంశంపై అనుచరులతో చర్చిస్తున్నారు. అయితే తాను ఎందుకు పార్టీ మారింది వారికి ఆయన వివరించారు. కుమారుడు రాజకీయ భవిష్యత్ కోసం పార్టీ మారుతున్నట్టుగా వారి వద్ద చెప్పారట. తనకు వైసీపీలో రాజకీయ భవిష్యత్తు కనపడటం లేదని, తన కొడుకు వెంట మీరు అంతా నిలవాలని, వచ్చే ఎన్నికల్లో కుమారుడు పోటీ చేస్తాడని వాళ్ళ వద్ద మోపిదేవి చెప్పినట్టు సమాచారం. మరి తమ కుటుంబ స్వార్ధం కోసం పార్టీ మారుతున్న ఆయన్ని స్థానిక ప్రజలు, ఆయన అనుచరులు సమర్ధిస్తారో లేదో చూడాలి.