తెలంగాణాలో తెలుగుదేశం పార్టీ బలం పుంజుకోనుందా…? పార్టీకి గుడ్ బై చెప్పిన కీలక నాయకత్వం మళ్ళీ ఎన్టీఆర్ భవన్ లో అడుగు పెట్టేందుకు సిద్దమవుతుందా…? అంటే అవుననే సమాధానం వినపడుతోంది. తెలుగుదేశం పార్టీ 2014 తర్వాత క్రమంగా బలహీనపడుతూ వచ్చింది. ఓటుకు నోటు వ్యవహారం తర్వాత మరింతగా బలహీనపడింది. 2018 తెలంగాణా ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీతో పొత్తు పెట్టుకున్నా పెద్దగా టీడీపీ ప్రభావం కనపడలేదు. 2019 తర్వాత ఏపీలో కూడా పార్టీ బలహీనపడింది అనే మాట వాస్తవం.
ఇప్పుడు ఏపీలో బలం పుంజుకుని అధికారం చేపట్టిన టీడీపీ తెలంగాణా మీద కూడా గురి పెడుతోంది. రాబోయే స్థానిక సంస్థల ఎన్నికలు గ్రేటర్ ఎన్నికల్లో టీడీపీ పట్టు కోసం వ్యూహం సిద్దం చేస్తోంది. బిజెపితో కలిసి వెళ్లేందుకు తెలంగాణాలో ఇప్పటికే రోడ్ మ్యాప్ సిద్దమైంది. ఈ క్రమంలో ప్రతిపక్ష బీఆర్ఎస్ పార్టీని బలహీన పరిచేందుకు టీడీపీ సిద్దమవుతోంది అనే వార్తలు వస్తున్నాయి. బీఆర్ఎస్ పార్టీకి కేసీఆర్ తర్వాత బలమైన నాయకత్వం లేదనేది చాలా మంది భావన. కేటిఆర్ దూకుడు స్వభావం చాలా మందికి నచ్చడం లేదనే ఆరోపణలు ఉన్నాయి.
ఈ నేపధ్యంలో బిజెపికి వెళ్ళలేని చాలా మంది నేతలు ఎన్టీఆర్ భవన్ లో అడుగు పెట్టేందుకు సిద్దమవుతున్నారు. ఢిల్లీ వెళ్లేందుకు సిద్దంగా ఉన్న ముఖ్యమంత్రి చంద్రబాబుని బిఆర్ఎస్ ఎమ్మెల్యేలు కలిసారు. మల్లారెడ్డి, మర్రి రాజశేఖర్ రెడ్డి, కూకట్పల్లి ఎమ్మెల్యే కృష్ణారావు, మాజీ ఎమ్మెల్యే తీగల కృష్ణారెడ్డి కలిసారు. మర్రి రాజశేఖర్ రెడ్డి కుమార్తె వివాహ శుభలేఖ అందించేందుకు కలిసారాన్ని వార్తలు వస్తున్నా… కారణం వేరే అంటున్నాయి రాజకీయ వర్గాలు. గత కొన్నాళ్ళుగా మల్లన్న పార్టీ మారే అవకాశం ఉందనే కథనాలు వస్తున్నాయి. ఇక మాధవరం కూడా ఇటీవల చంద్రబాబుతో భేటీ అయ్యారు. ఆయనపై కూడా కథనాలు వస్తున్నాయి. కారణం ఎలా ఉన్నా టీడీపీ గూటికి ఎమ్మెల్యేలు రావాలనుకుంటున్నారు అనే వార్త మాత్రం తెలంగాణాలో హాట్ టాపిక్ అవుతోంది.