ఏపీలో జిల్లాల పునర్ విభజన ప్రక్రియ దాదాపు తుది దశకు చేరుకుంది. ఈ ఏడాది డిసెంబర్ నెలాఖరులోపు జిల్లాల పునర్ విభజన పూర్తి చేయాలని ముఖ్యమంత్రి చంద్రబాబు స్పష్టమైన ఆదేశాలు జారీ చేశారు. వచ్చే ఏడాది జనవరి ఒకటి నుంచి కొత్త జిల్లాలు ఏర్పాటు కావాలని సూచించారు. దీంతో రంగంలోకి దిగిన మంత్రివర్గ ఉప సంఘం అధికారులతో వరుస సమావేశాలు నిర్వహించారు. అలాగే అన్ని జిల్లాల నుంచి ప్రజల అభిప్రాయాలు సేకరించారు. ప్రజల నుంచి వచ్చిన సూచనలు, విజ్ఞప్తులను పరిగణనలోకి తీసుకున్న మంత్రివర్గ ఉప సంఘం ఇప్పటికే ఒక నివేదికను రూపొందించింది. ఈ నివేదికను ఈ నెల 28న ముఖ్యమంత్రి చంద్రబాబు సమక్షంలో జరగనున్న సమావేశంలో సమర్పించనున్నట్లు తెలుస్తోంది. దీనిపై ముఖ్యమంత్రి చంద్రబాబు సలహాలు, సూచనలు కూడా తీసుకోనున్నట్లు అధికారులు వెల్లడించారు. వచ్చే నెల 7న చంద్రబాబు అధ్యక్షతన జరగనున్న మంత్రివర్గ సమావేశంలో దీనిపై చర్చించనున్నట్లు తెలుస్తోంది.
Also Read : హైడ్రా కమీషనర్ రంగనాథ్ – పవన్ కళ్యాణ్ భేటీ వెనుక అసలు ఉద్దేశం ఏమిటి?
కొత్త జిల్లాల ఏర్పాటు, జిల్లా పునర్ విభజన ప్రకటన తర్వాత పెద్ద ఎత్తున వినతులు వచ్చినట్లు తెలుస్తోంది. వీటిల్లో చాలా వరకు జిల్లా కేంద్రాల మార్పు, పాత జిల్లాల్లోనే కలిపేయాలనే ప్రతిపాదనలు పెద్ద ఎత్తున వచ్చాయి. శ్రీకాకుళం జిల్లాను రెండుగా విభజించి పలాస కేంద్రంగా మరో జిల్లా ఏర్పాటు చేయాలనే ప్రతిపాదన పెద్ద ఎత్తున వచ్చింది. అలాగే ఏలూరు జిల్లాలో కూడా జంగారెడ్డి గూడెం కేంద్రంగా జిల్లా ఏర్పాటు చేయాలని కోరారు. ఉమ్మడి ప్రకాశం జిల్లా విభజనపై మాత్రం పెద్ద ఎత్తున విమర్శలు వెల్లువెత్తాయి. ప్రస్తుతం అద్దంకి నియోజకవర్గం బాపట్ల జిల్లాలో ఉంది. అలాగే కందుకూరు నియోజకవర్గం నెల్లూరు జిల్లాలో కలిపారు. దీని వల్ల ఈ రెండు ప్రాంతాల ప్రజలు జిల్లా కేంద్రాలకు వెళ్లేందుకు తీవ్రంగా ఇబ్బందులు పడుతున్నారు. అందుకే వీటిని తిరిగి ప్రకాశం జిల్లాలో చేర్చాలని ఆయా నియోజకవర్గాల ప్రజలు కోరారు.
Also Read : బుకింగ్ క్యాన్సిల్.. ప్రయాణికులకు ప్రైవేటు ట్రావెల్స్ సడెన్ షాక్
ఇక కొత్తగా ఏర్పాటు కానున్నది మార్కాపురం కేంద్రంగా జిల్లా. మార్కాపురం, కనిగిరి, గిద్దలూరు, దర్శి, యర్రగొండపాలెం నియోజకవర్గాలతో మార్కాపురం కేంద్రంగా కొత్త జిల్లా ఏర్పాటు చేయనున్నారనే ప్రచారం జోరుగా జరుగుతోంది. అయితే మార్కాపురం పట్టణానికి కేంద్రం 80 కిలోమీటర్ల దూరంలో ఉన్న శ్రీశైలం కూడా మార్కాపురం జిల్లాలో చేర్చాలనే విజ్ఞప్తులు పెద్ద ఎత్తున వచ్చాయి. అయితే ప్రస్తుతం నంద్యాల జిల్లాలో భాగంగా శ్రీశైలం నియోజకవర్గం కొనసాగుతోంది. శ్రీశైలం నియోజకవర్గంలో కేవలం శ్రీశైలం, సుండిపెంట ఊర్లు నంద్యాల జిల్లా కేంద్రానికి దూరం. కలెక్టర్ సహా ఉన్నతాధికారులను కలవాలంటే ఏకంగా 5 గంటలు ప్రయాణం చేయాల్సి ఉంది. అందుకే మార్కాపురం జిల్లాలో శ్రీశైలం కలిపేయాలనే ప్రతిపాదనకు మంత్రివర్గ ఉపసంఘం సానుకూలంగా స్పందించినట్లు తెలుస్తోంది. దీనిపై కొన్ని అభ్యంతరాలు వ్యక్తం అయినప్పటికీ.. ప్రభుత్వం మాత్రం వాటిని పరిగణనలోకి తీసుకోనట్లు తెలుస్తోంది. ఏది ఏమైనా డిసెంబర్ నెలాఖరు నాటికి కొత్త జిల్లాల ఏర్పాటు ప్రక్రియ, జిల్లా కేంద్రాల మార్పు పూర్తి చేసే దిశగా ప్రభుత్వం కసరత్తు చేస్తోంది.




