Friday, September 12, 2025 11:23 PM
Friday, September 12, 2025 11:23 PM
roots

ఎగిరెగిరిపడ్డ సునీతకు ఎంత కష్టం వచ్చిందో…!

తొందరపాటు చర్య పనికిరాదు… ఏ పనైనా సరే చేసే ముందు ఒకటికి రెండు సార్లు ఆలోచించాలి అని పెద్దలు చెప్తారు. ఆ మాట రాజకీయాల్లో అయితే సరిగ్గా సరిపోతుంది. ఒక తొందరపాటు నిర్ణయం రాజకీయ భవిష్యత్తునే మార్చేస్తుంది అనేది ఇప్పటికే చాలాసార్లు రుజువైంది కూడా. అనకాపల్లికి చెందిన దాడి వీరభద్రరావు తన ఎమ్మెల్సీ పదవిని కొనసాగించలేదనే కోపంతో టీడీపీకి రాజీనామా చేసి వైసీపీలో చేరారు. అక్కడ సరైన గుర్తింపు రాకపోవడంతో తిరిగి టీడీపీలో చేరారు. ఇలా అటూ ఇటూ మారడంతో ఎటూ కాకుండా పోయారు. ఇప్పుడు ఇదే పరిస్థితి పోతుల సునీతది కూడా.

తెలుగుదేశం పార్టీలో పోతుల సునీత కీలక నేతగా ఎదిగారు. పరిటాల కుటుంబం అండతో ఎమ్మెల్సీ పదవి దక్కించుకున్నారు. అయితే 2019లో అనూహ్యంగా జై జగన్ అన్నారు. ప్రభుత్వంలో చక్రం తిప్పారు. ఏకంగా వైసీపీ రాష్ట్ర మహిళా అధ్యక్షురాలి పదవి దక్కింది. చివరికి అధికారులు కూడా ఆమె మాటకు విలువిచ్చారు. అటు చీరాల నియోజకవర్గంలో గ్రూప్ రాజకీయాలున్నప్పటికీ.. ఆమె చెప్పిన పనులు ఏవీ ఆగలేదు. అయితే ఇదంతా నాలుగు నెలల క్రితం పరిస్థితి. ఇప్పుడు పూర్తిగా మారిపోయింది. టీడీపీలో తిరిగి ఛాన్స్ వస్తుందనే ఆశతో వైసీపీకి, ఎమ్మెల్సీ పదవికి రాజీనామా చేశారు.

ప్రకాశం జిల్లాకు చెందిన ఓ మంత్రి హామీ ఇచ్చారనే పుకార్లు అప్పట్లో పెద్ద ఎత్తున షికారు చేశాయి. అందుకే పోతుల సునీత కనీసం కార్యకర్తలకు ఓ మాట కూడా చెప్పకుండా సడన్‌గా రాజీనామా చేసేశారు. కానీ ఇప్పుడు పరిస్థితి అగమ్యగోచరంగా మారిపోయింది. టీడీపీ నేతల అపాయింట్‌మెంట్ కూడా దొరకడం లేదు అనే మాట వినిపిస్తోంది. సదరు మాటిచ్చిన మంత్రి గారిని కలిసేందుకు ప్రయత్నిస్తే… తర్వాత కలుద్దామంటూ అమాత్యుల వారు బదులిచ్చారట.

Also Read : దీపావళి లోపే జోరందుకోనున్న తెలంగాణ టిడిపి

వాస్తవానికి టీడీపీ నుంచి వైసీపీలో చేరిన తర్వాత సైలెంట్‌గా ఉంటే పరిస్థితి మరోలా ఉండేదేమో. కానీ మేడం గారు మాత్రం టీడీపీ అధినేత చంద్రబాబుతో పాటు లోకేష్, పవన్ కల్యాణ్ పై నోటీకి వచ్చినట్లు మాట్లాడేశారు. చంద్రబాబును సారా బాబు అనేశారు. ఇక మండలిలో అయితే టీడీపీ సభ్యులపై దాడికి కూడా యత్నించారు. ప్రెస్ మీట్ పెట్టి మరీ టీడీపీ నేతలను దుమ్మెత్తి పోశారు. దీంతో సునీత వైసీపీకి రాజీనామా చేసిన వెంటనే… పాత వీడియోలను వెలికి తీశారు టీడీపీ అభిమానులు. ఇలాంటి వారికి మళ్లీ పార్టీలో అవకాశం ఇవ్వకూడదు అంటూ ట్రోలింగ్ చేశారు. దీంతో పోతుల సునీత పరిస్థితి మరింత దిగజారిపోయింది.

పోతుల సునీత ప్రస్తుతం చీరాల నుంచి తన మకాం హైదరాబాద్ మార్చినట్లు తెలుస్తోంది. సొంత నియోజకవర్గానికి రాలేక… పరాయి రాష్ట్రంలో ఉండలేక… ఏం చేయాలో తెలియక సతమతమవుతున్నట్లు తెలుస్తోంది. వైసీపీకి రాజీనామా చేయడంతో తిరిగి జగన్‌కు జై కొట్టే పరిస్థితి లేదు. వైసీపీ వెనక్కి పిలిచే చాన్స్ లేదు. టీడీపీలోకి దారులు మూసుకుపోయాయనే మాట వినిపిస్తోంది. దీంతో పోతుల సునీత కష్టాలపై రాజకీయ వర్గాల్లో జోరుగా చర్చ నడుస్తోంది. పరిటాల కుటుంబ అండతో పదవి దక్కించుకున్న పోతుల సునీత.. తొందరపాటు నిర్ణయం కారణంగా రాజకీయ భవిష్యత్తే ప్రశ్నార్థకంగా మారింది.

సంబంధిత కథనాలు

ADspot_img

తాజా కథనాలు

మళ్ళీ మోడినే పీఎం.....

వే2న్యూస్ సంస్థ నిర్వహించిన కాంక్లేవ్ లో...

లిక్కర్ కేసులో కీలక...

ఆంధ్రప్రదేశ్ మద్యం కుంభకోణం దర్యాప్తు మరింత...

వారసులు.. ఎవరు అసలు.....

తెలుగు రాష్ట్రాల్లో వారసత్వం చుట్టూనే రాజకీయాలు...

ఒక్కటే రాజధాని.. సజ్జల...

ఆంధ్రప్రదేశ్ లో వైసీపీ అధికారంలో ఉన్న...

మెడికల్ కాలేజీల వార్.....

ఏపీలో మెడికల్ కాలేజీల పోరు తారాస్థాయికి...

పోల్స్