తెలుగుదేశం పార్టీలో పదవుల కోసం ఎదురు చూస్తున్న వారి కోసమే ఈ వార్త. పార్టీ ప్రతిపక్షంలో ఉన్న సమయంలో పార్టీ గెలుపు కోసం ఎంతో కృషి చేశారు. వైసీపీ అధికారంలో ఉన్న సమయంలో అక్రమ కేసులతో నానా పాట్లు పడిన మహిళ నేతలకు పదవులిస్తోంది టీడీపీ. కూటమి సర్కార్ అధికారంలోకి వచ్చి ఏడాది దాటింది. ఇప్పటికే నామినేటెడ్ పదవుల కోసం ఎంతో మంది మహిళా నేతలు ఆశగా ఎదురు చూస్తున్నారు. కొందరు నేతల్లో అయితే ఇక పదవులు రావు అని పార్టీ పెద్దలపై అసహనం వ్యక్తం చేస్తున్న వారు కూడా ఉన్నారు. ఏడాది దాటినా కూడా పదవులు రాకపోవడంతో.. ఇక రావనుకున్నారు కూడా. కొందరు నేతలైతే.. త్వరలో జరగనున్న స్థానిక సంస్థల్లో అయినా అవకాశం ఉంటుందా అని ఎదురు చూస్తున్నారు. ఇలాంటి సమయంలో పార్టీ కేంద్ర కార్యాలయం నుంచి కొందరికి ఫోన్లు రావడం ఒక్కసారిగా వారి ఆశలు చిగురించినట్లైంది.
Also Read : బిగ్ బాస్ అరెస్టు ఖాయమా..?
టీడీపీ ప్రతిపక్షంలో ఉన్నప్పుడు వైసీపీ ప్రభుత్వాన్ని కొందరు నేతలు విమర్శించారు. అలాంటి వారిని టార్గెట్ చేసిన వైసీపీ సర్కార్.. వారిపై కేసులు పెట్టింది. అలాంటి వారిలో చాలా మందికి నామినేటెడ్ పదవులు దక్కాయి. అయితే కొందరు ద్వితీయ శ్రేణి నేతలకు మాత్రం ఇప్పటికీ పదవులు రాలేదు. దీంతో వారంతా ఎప్పుడు వస్తాయా.. అసలు వస్తాయా అనే ఆందోళనతో ఉన్నారు. ఇలాంటి వారికి పదవులు ఇవ్వాలని పార్టీ అధినాయకత్వం భావిస్తోంది. ముఖ్యంగా తెలుగు మహిళ విభాగానికి చెందిన 20 మంది పేర్లను నామినేటెడ్ పదవుల జాబితా కోసం పరిశీలిస్తున్నారు. ఇప్పటికే ఆయా నేతల పేర్లను పరిశీలించిన పార్టీ పెద్దలు.. నామినేటెడ్ పదవుల కేటాయింపుపై కసరత్తు చేస్తున్నారు.
Also Read : ఆయనకు ఎందుకు కోపం వచ్చిందంటే..?
పార్టీ కార్యక్రమాల్లో చురుగ్గా పాల్గొన్న వారిలో 20 మందితో కూడిన జాబితాను తెలుగు మహిళా అధ్యక్షురాలు, హోమ్ మంత్రి వంగలపూడి అనిత ఇప్పటికే పార్టీ పెద్దలకు ఇచ్చినట్లు తెలుస్తోంది. వారికి ఫోన్ చేసిన కార్యాలయ సిబ్బంది.. బయోడేటా సహా పూర్తి వివరాలు సేకరించారు. వారి విద్యా అర్హతల గురించి వాకబు చేశారు. సామాజిక వర్గం ప్రాతిపదికన ఇప్పటికే జాబితా సిద్దం చేసినట్లు తెలుస్తోంది. దీనిపై పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు పల్లా శ్రీనివాసరావు, జాతీయ ప్రధాన కార్యదర్శి, మంత్రి నారా లోకేష్ కలిసి చర్చించిన తర్వాతే.. ఈ జాబితా సీఎం చంద్రబాబు దగ్గరకి వెళ్తుందని.. ఈ నెల 10వ తేదీలోపు జాబితా విడుదలవుతుందని పార్టీ నేతలు చెబుతున్నారు. దీంతో మరో వారం, పది రోజుల్లోనే పదవులు ఖాయమంటున్నారు పార్టీ నేతలు.