అధికారాన్ని అడ్డం పెట్టుకొని ఇష్టానుసారం దోపిడీ చేసిన మాజీ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, అతని అనచరుల పాపాలు తప్పక పండుతాయని రాష్ట్ర రెవిన్యూ, రిజిస్ర్టేషన్ అండ్ స్టాంప్స్ శాఖా మంత్రి అనగాని సత్యప్రసాద్ పేర్కొన్నారు. తాను చేసిన పాపాలను కప్పిపుచ్చుకోవడానికి ఫైళ్లను తగుల బెట్టి, ఇప్పుడు అమాయకపు ముఖం పెడితే ప్రజలు నమ్మే స్థితిలో లేరన్నారు. పెద్దిరెడ్డి, అతని అనచరులు ఎన్ని అక్రమాలకు పాల్పడ్డారనే దానికి… వారికి వ్యతిరేకంగా ఉమ్మడి చిత్తూరు జిల్లాలో భూ వివాదాలకు సంబంధించి తమకు అందిన వేల కొలది ఫిర్యాదులే పెద్ద ఉదాహరణ అని అన్నారు.
వారి కుటుంబాన్ని తమ ప్రభుత్వం వేధిస్తోందని పెద్ది రెడ్డి చెప్పడం విచిత్రంగా ఉందని, పెద్ది రెడ్డి కుటుంబమే తమను వేధించిందంటూ వేలాది మంది ప్రజలు ప్రభుత్వానికి ఫిర్యాదులు ఇచ్చారని చెప్పారు. మదనపల్లె ఫైళ్ల దగ్ఢం ఘటన కుట్ర కోణంలోనే జరిగిందని, సీ ఐ డీ విచారణలో దోషులను ఖచ్చితంగా తేలుస్తామని చెప్పారు. ప్రాధమిక సమాచారం మేరకు ఈ ఘటనలో పెద్దిరెడ్డి అనుచరుల పాత్ర ఉందన్నారు. మదన పల్లె ఘటనకు సంబంధించి దోషులు ఎంతటి వారున్నా వదలి పెట్టే ప్రసక్తే లేదన్నారు. పాపాలు చేయడం..ఫైళ్లను తగల బెట్టడం వైసీపీ నేతలు ముఖ్యంగా పెద్దిరెడ్డి అలవాటుగా చేసుకున్నారని విమర్శించారు. మదనపల్లె ఘటనకు ముందు… రాష్ట్ర కాలుష్య నియంత్రణ మండలి ఫైళ్లను కూడా తగులబెట్టారని మంత్రి అనగాని గుర్తు చేశారు.