మహారాష్ట్ర ఎన్నికల ఫలితాలు వెలువడి అప్పుడే వారం గడిచిపోయింది. అయినా సరే… ముఖ్యమంత్రి ఎవరూ అనే విషయం ఇప్పటికీ సస్పెన్స్‌గానే మిగిలిపోయింది. మహాయుతి కూటమి ఘన విజయం సాధించింది. బీజేపీ, శివసేన (షిండే), ఎన్‌సీపీ (అజిత్ పవార్) పార్టీలు కలిసి పోటీ చేస్తే… బీజేపీకి పూర్తిస్థాయి మెజారిటీ వచ్చింది. అయితే ఇక్కడే అసలు సమస్య ఎదురవుతోంది. ముఖ్యమంత్రి స్థానంలో ఎవరిని కూర్చొబెట్టాలనే విషయం ఇప్పుడు పెద్ద మిస్టరీగా మారింది. ఎక్కువ స్థానాలు గెలుచుకున్న బీజేపీకి ముఖ్యమంత్రి కుర్చీ ఇవ్వాలని కమలం పార్టీ నేతలు పట్టుబట్టారు. దీనికి అటు షిండే, ఇటు అజిత్ పవార్ కూడా అంగీకరించారు. ఇందుకు బదులుగా ఇద్దరికీ డిప్యూటీ సీఎం పదవులు ఇచ్చేలా ఒప్పందం జరిగింది. అయితే ఇక్కడే అసలు సమస్య ఎదురవుతోంది.
Also Read : జనసేన… రాజకీయ పునరావాస కేంద్రం…!
బీజేపీ తరఫున ముఖ్యమంత్రి అభ్యర్థిగా దేవేంద్ర ఫడ్నవీస్ పేరును మెజారిటీ సభ్యులు ప్రతిపాదించారు. అయితే ఫడ్నవీస్‌ను సీఎం స్థానంలో కూర్చొబెట్టేందుకు పవార్ వర్గం అంగీకరించడం లేదనే మాట వినిపిస్తోంది. అలాగే బీజేపీలోని ఓ వర్గం నేతలు ఫడ్నవీస్‌కు కాకుండా కొత్తగా మురళీధర్ మెహోల్ పేరును ప్రతిపాదిస్తున్నారు. అదే సమయంలో తమ నేతను సీఎం కుర్చీని తప్పిస్తున్నారు కాబట్టి… కీలకమైన మంత్రి పదవులు తమకే ఇవ్వాలనేది షిండే వర్గం నేతల డిమాండ్. దీంతో పది రోజులుగా ఈ పంచాయతీ హస్తిన నేతలకు తలనొప్పిగా మారింది. సీఎం కుర్చీ తనదే అని ఇప్పటికే ఫడ్నవీస్ ప్రచారం చేసుకుంటున్నారు. అయితే తాజాగా మురళీధర్ పేరు వెలుగులోకి రావడంతో… మహాయుతిలో ముసలం మొదలైందనే ప్రచారం జోరుగా సాగుతోంది.
Also Read : మీతో నాకు పనేంటి…?
మహారాష్ట్ర పంచాయతీపై కాంగ్రెస్, శివసేన (ఉద్ధవ్ థాకరే), ఎన్‌సీపీ (శరద్ పవార్) పార్టీల నేతల విమర్శలు చేస్తున్నారు. ఇప్పటి వరకు కాంగ్రెస్ పార్టీ నేతలను ఢిల్లీ గులాంలంటూ ఆరోపణలు చేసిన బీజేపీ నేతలు… మహారాష్ట్ర పంచాయతీ విషయంలో ఎందుకు నోరెత్తడం లేదని ప్రశ్నిస్తున్నారు. సీఎం ఎంపిక కూడా ఢిల్లీ పెద్దలే చేయాలా అని విమర్శిస్తున్నారు. అలాగే మూడు పార్టీల నేతలు ఇప్పటికే ఒక ఒప్పందానికి వచ్చినట్లు తెలుస్తోంది. ఓ ఒక్క పార్టీకి పూర్తిస్థాయి ప్రతిపక్ష హోదా దక్కలేదు కాబట్టి… మూడు పార్టీలు కలిసి ఉద్ధవ్ థాకరేను ప్రతిపక్ష నేతగా ఎన్నుకోవాలని భావిస్తున్నట్లు తెలుస్తోంది. ఏది ఏమైనా సరే… ప్రస్తుతం మహారాష్ట్ర రాజకీయాలు మాత్రం తెగని పంచాయతీగా మారాయనే మాట బలంగా వినిపిస్తోంది.