ఏపీ ఐటి శాఖా మంత్రి నారా లోకేష్ అమెరికా పర్యటనలో బిజీ బిజీగా గడుపుతున్నారు. అట్లాంటాలో ఎన్టీఆర్ విగ్రహం ఆవిష్కరించిన సందర్భంగా లోకేష్ చేసిన కొన్ని కీలక వ్యాఖ్యలు ఏపీ రాజకీయాల్లో సంచనలం సృష్టిస్తున్నాయి. అయిదేళ్లలో రాష్ట్రం నాశనమైనందన్నారు. ఎన్ఆర్ఐలు కూడా సైకో బాధితులే అన్న ఆయన… కాలిఫోర్నియాలో ఒక వ్యక్తి 500 కోట్లు అమరావతిలో పెట్టుబడి పెట్టారని… వైసిపి వచ్చాక విజిలెన్స్ వాళ్లను పంపి ఇబ్బందులు పెట్టారు. అడుగడుగునా అవమానించారు.. అయినా ఆయన ధైర్యంగా నిలబడ్డారన్నారు. నేనుకూడా గత ప్రభుత్వంలో బాధితుడ్నే అని నేను యువగళం పాదయాత్ర చేస్తుంటే జిఓ1 తెచ్చి అడ్డుకోవాలని చూశారని లోకేష్ గుర్తు చేసుకున్నారు.
రెడ్ బుక్ లో ఒక చాప్టర్ అయిపోయింది.. రెండోది ఓపెన్ అయింది.. మూడో చాప్టర్ గురించి రాము, వెంకట్రావుని అడగండి చెబుతారు అంటూ కీలక వ్యాఖ్యలు చేశారు. పాదయాత్రలో ఇచ్చిన హామీ మేరకు త్వరలో మూడో చాప్టర్ తెరవబోతున్నా అని తెలిపారు. ఎన్నికల్లో ప్రజలే వైసీపీ వారి కుర్చీలు మడతపెట్టారన్నారు. బాబు గారు తలుచుకుంటే వాళ్లను లోపల వేయడం 2 నిమిషాల పని అని… చేయని తప్పుకు 53రోజులు జైలుశిక్ష అనుభవించిన ఆయనకు బాధ ఉండదా? ప్రజలు మనకు అఖండ విజయాన్ని ఇచ్చినందుకు హుందాతనంగా, గౌరవంగా ఉండి ప్రజల కోసం పనిచేయాలని పిలుపునిచ్చారు.
Also Read : కేంద్రంలో ఏపి ఎంపిల దూకుడు..!
గాడితప్పిన రాష్ట్రాన్ని సరైన దారిలో పెట్టాల్సిన గురుతర బాధ్యత మాపై ఉందని లోకేష్ తెలిపారు. పద్ధతి ప్రకారం రెడ్ బుక్ అమలుచేస్తామన్నారు. నేను తగ్గేదే లేదు, పార్టీ కేడర్ ను ఇబ్బంది పెట్టిన వారికి సినిమా చూపే బాధ్యత లోకేష్ ది అని స్పష్టం చేసారు. మేం కూడా మనుషులమే అన్నారు. విశాలమైన వ్యవస్థలో కొన్ని పొరపాట్లు జరుగుతుంటాయి, అంతమాత్రాన అలిగి పడుకోవద్దన్నారు. మా దృష్టికి తెస్తే సరిచేసుకుంటామని తెలిపారు. మీకు ఉన్న సమస్యలు కొన్ని నా దృష్టికి తీసుకొచ్చారు. వాటిని వీలైనంత త్వరగా పరిష్కరిస్తా అని హామీ ఇచ్చారు. మరి రెడ్ బుక్ లో మూడో చాప్టర్ ఏంటి అన్న విషయం పై రాష్ట్ర రాజకీయ వర్గాల్లో తీవ్ర చర్చ నడుస్తుంది.




