Monday, October 27, 2025 07:16 PM
Monday, October 27, 2025 07:16 PM
roots

అసలు.. వాళ్లిద్దరు ఎందుకు కలిశారు.. కారణాలేమిటీ..?

ఏపీ మంత్రి నారా లోకేష్‌ను తెలంగాణ మాజీ మంత్రి కల్వకుంట్ల తారక రామారావు కలిశారా.. అసలు లోకేష్‌ను కేటీఆర్ ఎందుకు కలవాల్సి వచ్చింది.. ఇప్పుడు తెలుగు రాష్ట్రాల్లో ఇదే హాట్ టాపిక్. వాస్తవానికి రాజకీయాల్లో ఒక పార్టీ నేత.. మరో పార్టీ నేతతో మర్యాద పూర్వక కలయిక సర్వసాధారణం. 2019 వరకు ఈ సంప్రదాయం తెలుగు రాష్ట్రాల్లో కొనసాగింది కూడా. బద్ధ శత్రువులైన చంద్రబాబు, వైఎస్ రాజశేఖర్ రెడ్డి కూడా పలు సందర్భాల్లో కలిశారు. సరదాగా నవ్వుకున్నారు. పాత జ్ఞాపకాలను నెమరేసుకున్నారు. తమ మధ్య విరోధం కేవలం రాజకీయాలకు మాత్రమే పరిమితమని.. వ్యక్తిగతంగా తామిద్దరం మంచి స్నేహితులమని ఎన్నో సందర్భాల్లో ఇద్దరు నేతలు వెల్లడించారు. కానీ 2019 నుంచి ఈ సంప్రదాయానికి బ్రేక్ పడింది.

Also Read : చేతులెత్తేసిన రేవంత్.. చలి కాచుకుంటున్న బిఆర్ఎస్

2019లో ఏపీలో వైసీపీ అధికారంలోకి వచ్చిన తర్వాత పరిస్థితి పూర్తిగా మారిపోయింది. ఒక పార్టీ నేత మరో నేతను కలవటమే కాదు.. కనీసం ఫోన్‌లో మాట్లాడుకున్నట్లు తెలిసినా సరే.. అదో పెద్ద తప్పు. ఒకరికొకరు ఎదురుపడితే పలకరింపుల మాట పక్కన పెడితే తన్నుకోవటమే. రాజకీయ విమర్శలు కాస్తా వ్యక్తిగత దూషణలకు కారణమయ్యాయి కూడా. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో చంద్రబాబు మంత్రివర్గంలో మంత్రిగా పని చేసిన కేసీఆర్… సీఎంగా రెండోసారి ప్రమాణ స్వీకారం చేసిన తర్వాత అదే చంద్రబాబుపై నోటికి వచ్చినట్లు వ్యాఖ్యలు చేశారు. హైదరాబాద్‌లోనే మొదలైన తెలుగుదేశం పార్టీని పూర్తిగా ఆంధ్ర పార్టీ అని ప్రచారం చేశారు కేసీఆర్. ఇక 2023 అసెంబ్లీ ఎన్నికల సమయంలో అయితే మళ్లీ ఆంధ్ర పాలకుల పెత్తనం అంటూ పదేళ్ల తర్వాత కూడా ప్రాంతీయ విద్వేషాలు రెచ్చగొట్టే ప్రయత్నం చేశారు కేసీఆర్.

తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత భారతీయ రాష్ట్ర సమితి పరిస్థితి దారుణంగా తయారైంది. కుటుంబ పోరు తారాస్థాయికి చేరింది. అన్న చెల్లెళ్ల మధ్య కుర్చీ కుమ్ములాట జరుగుతోంది. పార్టీ కార్యక్రమాలకు కేసీఆర్ పూర్తిగా దూరమయ్యారు. దీంతో పలువురు బీఆర్ఎస్ నేతలు సైలెంట్‌గా పార్టీకి దూరమయ్యారు. వరుసగా రెండుసార్లు అధికారం అనుభవించిన బీఆర్ఎస్.. ఇప్పుడు అత్యంత క్లిష్టపరిస్థితుల్లో ఉంది. పార్లమెంట్ ఎన్నికల్లో కనీసం ఒక్క సీటు కూడా రాలేదు. ఎమ్మెల్సీ ఎన్నికలకు దూరంగా ఉంది బీఆర్ఎస్. ఇలాంటి విపత్కర పరిస్థితుల్లో త్వరలో స్థానిక సంస్థల ఎన్నికలు తెలంగాణలో జరగాల్సి ఉంది. తెలంగాణలో పట్టు కోసం కాంగ్రెస్, బీజేపీ, బీఆర్ఎస్ తీవ్రంగా పోటీ పడుతున్నాయి. పథకాల అమలు ద్వారా ప్రజల్లో తమకు మంచి పేరు వచ్చిందని.. ఇవే స్థానిక సంస్థల్లో కాంగ్రెస్‌ను గెలిపిస్తాయనేది ఆ పార్టీ నేతల మాట. ఇక బీజేపీ కూడా కొత్త సారధి నేతృత్వంలో స్థానిక సంస్థల్లో పోటీకి సిద్ధమవుతోంది.

Also Read : సింగరేణిలో కవితకు షాక్ ఇవ్వడానికి కారణం ఇదేనా..?

పదేళ్ల పాటు అధికారంలో ఉన్న బీఆర్ఎస్ కూడా ప్రజల్లో ఇప్పటికీ తమకు బలం ఉందని నిరూపించుకునేందుకు మెగా ప్లాన్ వేసినట్లు తెలుస్తోంది. నిన్న మొన్నటి వరకు టీడీపీ అధినేతపై నిప్పులు చెరిగిన బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్.. ఇప్పుడు టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి, మంత్రి నారా లోకేష్‌తో రహస్యంగా సమావేశమయ్యారనే మాట పొలిటికల్ సర్కిల్‌లో హాట్ టాపిక్‌గా మారింది. లోకేష్‌తో కేటీఆర్ రహస్యంగా భేటీ అయ్యారనే ప్రచారం తెలుగు రాష్ట్రాల్లో కీలక మలుపుగా మారింది. లోకేష్‌తో కేటీఆర్ రహస్యంగా భేటీ అయ్యారని వారం రోజుల క్రితం కాంగ్రెస్ సీనియర్ నేత సామా రామ్మోహన్ రెడ్డి ఆరోపించారు. అయితే ఈ ఆరోపణలను అప్పట్లో ఎవరు పెద్దగా పట్టించుకోలేదు. కానీ తాజాగా ఇవే ఆరోపణలను తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కూడా చేయడంతో నిజంగానే భేటీ అయ్యారా అనే చర్చ జోరుగా జరుగుతోంది.

కేటీఆర్ అర్థరాత్రి లోకేష్‌ను కలవాల్సిన పని ఏముంది..? ఇప్పటికే మూడుసార్లు లోకేష్‌ను కేటీఆర్ కలిశారు. అసలు లోకేష్‌ను ఎందుకు కలవాల్సి వచ్చిందో బీఆర్ఎస్ నేతలు చెప్పగలరా..? అని రేవంత్ రెడ్డి ప్రశ్నించారు. సీఎం ఈ తరహా వ్యాఖ్యలు చేయడం పెద్ద సంచలనంగా మారింది. స్థానిక సంస్థల ఎన్నికల్లో బీఆర్ఎస్ గెలుపు తప్పనిసరి పరిస్థితులు నెలకోన్నాయి. వాస్తవానికి పార్టీ అధ్యక్షుడు కేసీఆర్ దాదాపు ఏడాదిన్నర కాలంగా ఫామ్ హౌజ్‌కే పరిమితమయ్యారు. ప్రస్తుతం బీఆర్ఎస్ కార్యకలాపాలను పూర్తిగా కేటీఆర్ చూస్తున్నారు. అటు అసెంబ్లీలో కూడా కేటీఆర్, హరీష్ రావు మాత్రమే ప్రతిపక్ష పాత్ర పోషిస్తున్నారు. దీనికి తోడు ఇంటి పోరు తోడైంది. ఇలాంటి పరిస్థితుల్లోనే జూబ్లీహిల్స్ అసెంబ్లీ నియోజకవర్గంలో ఉప ఎన్నిక జరగనుంది. సిట్టింగ్ బీఆర్ఎస్ ఎమ్మెల్యే మాగంటి గోపీనాథ్ ఆకస్మిక మృతితో అక్కడ ఉప ఎన్నిక జరగనుంది. జంట నగరాల్లో తెలుగుదేశం పార్టీకి గట్టి పట్టుంది. అందుకే బీజేపీ, జనసేన పొత్తుతో ఏపీలో ప్రభుత్వం ఏర్పాటు చేసిన తెలుగుదేశం పార్టీ జూబ్లీహిల్స్ ఎన్నికల్లో పోటీకి సిద్ధమవుతోందనే వార్తలు వెలువడుతున్నాయి. అదే జరిగితే.. బీఆర్ఎస్ ఓటమి ఖాయమే.

Also Read : కేసీఆర్ కి ఊహించని షాక్ ఇచ్చిన కవిత

ఇలాంటి పరిస్థితుల్లో ఇప్పుడు లోకేష్‌తో కేటీఆర్ కొత్త ప్రతిపాదన చేసినట్లు పార్టీ నేతల సమాచారం. గోపీనాథ్ 2014లో టీడీపీ తరఫున ఎమ్మెల్యేగా పోటీ చేసి గెలిచారు. గోపీనాథ్ మృతదేహానికి లోకేష్ నివాళి అర్పించారు. గోపీనాథ్ కుటుంబ సభ్యులతో దాదాపు 3 గంటలు పైగా లోకేష్ గడిపారు కూడా. అయితే ఇప్పుడు గోపీనాథ్ కుటుంబసభ్యులకే బీఆర్ఎస్ టికెట్ ఇవ్వనుంది. కాబట్టి ఆ ఎన్నికల్లో టీడీపీ పోటీకి దూరంగా ఉంటే.. బీఆర్ఎస్ అభ్యర్థి గెలుపు సులువు అవుతుందనేది ఆ పార్టీ నేతల మాట. ఈ విషయంపైనే లోకేష్‌తో కేటీఆర్ రహస్యంగా భేటీ అయ్యారనేది కాంగ్రెస్ నేతల విమర్శ. నిజంగానే భేటీ అయ్యారా.. లేదా అనేది తెలియాల్సి ఉంది. కాంగ్రెస్ నేతల ఆరోపణలపై బీఆర్ఎస్ నేతలు ఎవరూ స్పందించటం లేదు.

సంబంధిత కథనాలు

ADspot_img

తాజా కథనాలు

జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక.....

తెలంగాణలో ఇప్పుడు జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక...

ఐసీయూలో శ్రేయస్ అయ్యర్.....

సౌత్ ఆఫ్రికా తో కీలక వన్డే...

చావులోను ఆగని విష...

సాధారణంగా ఏదైనా ప్రమాదం జరిగినప్పుడు మానవత్వంతో...

గట్టిగానే సంక్రాంతి పోటీ.....

సంక్రాంతి పండుగ.. తెలుగు వారికి అతి...

బ్రేకింగ్: పరకామణి కేసులో...

గత కొన్నాళ్లుగా తిరుమలలో పరకామణి వ్యవహారం...

కొత్త జిల్లాలు.. మారనున్న...

ఏపీలో జిల్లాల పునర్‌ విభజన ప్రక్రియ...

పోల్స్