తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యే కొలికపూడి శ్రీనివాసరావు వ్యవహారం రోజు రోజుకూ వివాదాస్పదమవుతోంది. అమరావతి ఉద్యమ నేతగా గుర్తింపు తెచ్చుకున్న కొలికపూడి.. అనూహ్యంగా తిరువూరు నియోజకవర్గం నుంచి తెలుగుదేశం పార్టీ తరఫున ఎన్నికల్లో పోటీ చేశారు. వైసీపీ కంచుకోట అనే నియోజకవర్గంలో కొలికపూడి విజయం సాధించారు. గెలిచిన నాటి నుంచి కొలికపూడి తీరు పూర్తిగా మారిపోయింది. ఎన్నికల ముందు వరకు మీరే నా దేవుళ్లు అంటూ తెలుగుదేశం, జనసేన పార్టీ నేతలను వెంటేసుకుని తిరిగారు. విజయవాడ పార్లమెంట్ సభ్యులు కేశినేని చిన్ని చెప్పిందే వేదం అన్నట్లుగా వ్యవహరించారు. నియోజకవర్గం నేతలతో పాటు జిల్లాలో సీనియర్ నేతలతో సన్నిహితంగా మెలిగారు. తిరువూరు నియోజకవర్గంలో అన్ని వర్గాల టీడీపీ నేతలతో మీ వల్లే నా గెలుపు సాధ్యం అన్నారు కొలికపూడి. ఇదంతా 2024 ఎన్నికల ముందు మాట.
Also Read : బ్రేకింగ్: ఫోన్ ట్యాపింగ్ విచారణ సిబిఐ చేతికే..?
ఎన్నికల్లో గెలిచిన తర్వాత కొలికపూడి తీరు పూర్తిగా మారిపోయింది. తన గెలుపునకు సహకరించిన వారిని దూరం పెట్టారు. నియోజకవర్గంలో పెత్తనం చెలాయించారు. అంతా నా ఇష్టం అన్నట్లు వ్యవహరించారు. వైసీపీ నేతలతో అక్రమ లావాదేవీలకు తెర లేపారు. సొంత పార్టీ నేతలనే పార్టీ నుంచి సస్పెండ్ చేయాలని అధిష్టానాన్ని డిమాండ్ చేశారు. తన మాట వినకపోతే రాజీనామా చేస్తానంటూ అల్టిమేటం జారీ చేశారు కొలికపూడి. అయితే పార్టీ పెద్దల నుంచి ఎలాంటి స్పందన రాకపోవడంతో సైలెంట్‌గా తోక ముడిచారు. ఆ తర్వాత నందిగామ నియోజకవర్గంలో జరిగిన కార్యక్రమంలో కొలికపూడికి చంద్రబాబు షాక్ ఇచ్చారు. ఆయన వైపు కన్నెత్తి కూడా చూడలేదు. దీంతో అటు పార్టీలో, ఇటు ప్రజల్లో కూడా తన పరువు పోయిందని భావించిన కొలికపూడి.. నాటి నుంచి సైలెంట్ అయ్యారు.
అమరావతి కోసం రెండో విడత భూసేకరణ చేయాలని కూటమి ప్రభుత్వం నిర్ణయించింది. దీనిపై కొలికపూడి వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. రెండో విడత భూసేకరణకు వ్యతిరేకంగా అమరావతి ప్రాంతంలోని గ్రామాల్లో పాదయాత్ర చేస్తానంటూ ప్రకటించారు. దీనికి రైతులతో పాటు అమరావతి జేఏసీ నుంచి ఎలాంటి మద్దతు రాలేదు. దీంతో మరోసారి పరువు పోయిందని భావించిన ఎమ్మెల్యే కొలికపూడి శ్రీనివాస్ సైలెంట్ అయ్యారు. గెలిచిన నాటి నుంచి వివాదాస్పద వ్యాఖ్యలతో రచ్చ చేస్తున్న కొలికపూడి ఇప్పటికే 2 సార్లు పార్టీ క్రమశిక్షణా సంఘం ఎదుట వివరణ ఇచ్చుకోవాల్సి వచ్చింది. వాస్తవానికి ఒక్కసారి వెళ్తేనే నేతలు పరువు పోయినట్లు భావిస్తారు. కానీ కొలికపూడి మాత్రం ఏడాది కాలంలోనే రెండుసార్లు పార్టీ నుంచి షోకాజ్ నోటీసులు అందుకుని సరికొత్త రికార్డు సృష్టించారు. అయినా సరే కొలికపూడి తీరులో మాత్రం ఎలాంటి మార్పు రాలేదు.
Also Read : హరిహర వీరమల్లు సినిమా పై మీ అభిప్రాయం చెప్పండి?
తొలి నుంచి వివాదాస్పదంగా వ్యవహరిస్తున్న కొలికపూడి శ్రీనివాస్.. వైసీపీలో చేరుతారనే ప్రచారం జోరుగా సాగుతోంది. ఈ పుకార్లు చాలా రోజులుగా అటు పార్టీలో ఇటు తిరువూరు నియోజకవర్గంలో షికారు చేస్తున్నాయి. ఇందుకు ప్రధాన కారణం.. వైసీపీ నేతలతో కొలికపూడి వ్యాపార లావాదేవీలు నిర్వహిస్తున్నారనే ప్రచారమే. దీనికి ఎలాంటి వ్యాఖ్యలు చేయలేదు. కానీ పార్టీ మారేది లేదు అంటూ కొలికపూడి వర్గం మాత్రం ప్రచారం చేసింది. కానీ తాజాగా ఓ వీడియో సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది. మాజీ మంత్రి, వైసీపీలో నంబర్ టూ స్థానంలో ఉన్న పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డితో కొలికపూడి శ్రీనివాసరావు మాట్లాడుతున్న వీడియో ఇప్పుడు పొలిటికల్ సర్కిల్‌లో హాట్ టాపిక్. ఈ వీడియో నిడివి కేవలం 5 సెకన్లు మాత్రమే. కానీ ఇదే ఇప్పుడు పెద్ద దుమారం రేపుతోంది. ఎయిర్‌పోర్టు నుంచి బయటకు వస్తున్న పెద్దిరెడ్డ్డి రామచంద్రారెడ్డిని కొలికపూడి శ్రీనివాసరావు అనుసరించారు. పక్కనే నడుస్తూ ఏదో మాట్లాడారు. ఆ తర్వాత ఆయనకు షేక్ హ్యాండ్ ఇచ్చి వీడ్కోలు పలికారు. ఈ వీడియో సోషల్ మీడియాలో సర్క్యూలేట్ అవుతోంది. కొలికపూడి త్వరలో మారటం ఖాయమనే ప్రచారం కోడూ జోరుగా జరుగుతోంది.
అయితే ఈ వీడియోపై కొలికపూడి వివరణ ఇచ్చుకున్నారు. ఈ నెల 19న కుటుంబ సభ్యులతో కలిసి హైదరాబాద్ నుంచి తిరుపతికి విమానంలో వెళ్లానని.. అదే విమానంలో పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి కుటుంబ సభ్యులు కూడా ప్రయాణం చేశారన్నారు. పెద్దిరెడ్డిని “సార్.. బాగున్నారా..” అని పలకరించానని… ఆయన కూడా బాగున్నాను అని చెప్పి వెళ్లిపోయారని.. మొత్తం 8 సెకన్లలోపే జరిగిందన్నారు కొలికపూడి. తిరుపతిలో ఉన్నప్పుడు సీఎంఓ నుంచి ఫోన్ వచ్చిందని.. అదే రోజు మధ్యాహ్నం 3 గంటల నుంచి రాత్రి 10 గంటల 40 నిమిషాల వరకు సీఎం కార్యాలయంలోనే ఉన్నట్లు తెలిపారు. 40 నిమిషాల పాటు చంద్రబాబుతో సమావేశం జరిగిందని.. ఆ తర్వాత తన నియోజకవర్గం తిరువూరు వెళ్లిపోయానన్నారు. రెండు రోజుల పాటు నియోజకవర్గంలోనే పర్యటించినట్లు కూడా కొలికపూడి వివరణ ఇచ్చుకున్నారు. రాజమండ్రి ఎయిర్‌పోర్టులో కలిసినట్లు తనపై తప్పుడు ప్రచారం చేస్తున్నారని.. ఏడాది నుంచి తనపై దుష్ప్రచారం చేస్తూనే ఉన్నారన్నారు. స్పీకర్ అయ్యన్నపాత్రడు, బొత్స సత్యనారాయణ నవ్వుతూ మాట్లాడిన వీడియోపైన ఎవరూ మాట్లాడలేదు ఎందుకని ప్రశ్నించారు. తనపై ఎన్ని అబద్ధపు ప్రచారాలు చేసినా సరే.. తిరువూరు నియోజకవర్గం ప్రజలకు వాస్తవాలు తెలుసన్నారు.
Also Read : ఓన్లీ క్యాష్.. నో యూపీఐ ప్లీజ్.. వ్యాపారులకు షాక్..!
ఎమ్మెల్యేగా తన పనితీరుపై సీఎం చంద్రబాబు ప్రోగ్రెస్ రిపోర్ట్ ఇచ్చారని.. తన పనితీరుకు 66.4 శాతం మార్కులు ఇచ్చారన్నారు. తాను ఏం చేస్తోంది, ఎలా పని చేస్తోందనే విషయం తిరువూరు ప్రజలకు, సీఎం చంద్రబాబుకు తెలుసన్నారు. గాలి వార్తలను పట్టించుకోవద్దన్నారు కొలికపూడి. అయితే చంద్రబాబు ప్రధాన శత్రువుగా భావించే పెద్దిరెడ్డితో కొలికపూడి కలవడం రాజకీయంగా పెద్ద చర్చ నడుస్తోంది. దీని వెనుక రాజకీయ కోణం ఉందా.. అనే కోణంపై టీడీపీ నేతలు ఆరా తీస్తున్నారు. వైసీపీలో చేరేందుకే పెద్దిరెడ్డితో కొలికపూడి మంతనాలు జరిపినట్లు ప్రచారం జోరుగా జరుగుతోంది. కొలికపూడిపై పార్టీ కఠిన చర్యలు తీసుకోవాలని కొందరు కోరుతున్నారు. మరి పెద్దిరెడ్డితో కొలికపూడి భేటీ.. రాజకీయంగా ఎలాంటి పరిణామాలకు దారి తీస్తుందో వేచి చూడాల్సి ఉంది.