కొలికపూడి శ్రీనివాస్.. ప్రస్తుతం ఏపీ రాజకీయాల్లో హాట్ టాపిక్. వైసీపీకి వ్యతిరేకంగా పోరాటం చేశారు. రాజధాని అమరావతి కోసం ప్రాణత్యాగానికి సిద్ధమన్నారు. రాజధాని అమరావతి కోసం హైదరాబాద్ నుంచి విజయవాడ వరకు పాదయాత్ర చేశారు. ఆకుపచ్చ కండువా వదలకుండా తిరిగారు. తాను రైతు పక్షపాతిని అని గొప్పగా చెప్పుకున్నారు. చివరికి కులం కార్డు కూడా వాడేశారు. దీంతో బాగా ఇంప్రెస్ అయిన చంద్రబాబు… తిరువూరు ఎమ్మెల్యే టికెట్ కేటాయించారు. కూటమి హవాతో పాటు ఎంపీ కేశినేని చిన్ని అండతో గెలిచిన కొలికపూడి.. చివరికి ఆయనకు వ్యతిరేకంగానే రాజకీయం చేయడం మొదలుపెట్టారు. తిరువూరు నియోజకవర్గంలో అవినీతికి తలుపులెత్తారనే ఆరోపణలకి తోడు గ్రూప్ రాజకీయాలు కట్టారు అన్న అపవాదు మూటగట్టుకున్నారు. చివరికి ఈ ఎమ్మెల్యే మాకు వద్దు… అని ఏడాది లోపే వ్యతిరేకత తెచ్చుకున్న ఏకైక ఎమ్మెల్యే కొలికపూడి. తిరువూరు టీడీపీ నేతలంతా పార్టీ ఆవిర్భావ దినోత్సవం రోజున మంగళగిరిలోని పార్టీ కేంద్ర కార్యాలయానికి వచ్చిన తిరువూరు నియోజకవర్గం నేతలు, కార్యకర్తలు.. మాకీ ఎమ్మెల్యే వద్దు సార్.. అని ఏకంగా పార్టీ అధినేత ఎదురుగానే గగ్గోలు పెట్టారంటే.. కొలికపూడి అక్రమాలు ఏ రేంజ్ లో ఉన్నాయో అర్ధం చేసుకోవచ్చు.
Also Read : కవిత ఒంటరి అయిపోయారా..? గులాబీ మద్దతు ఎక్కడ..?
వాస్తవానికి తిరువూరు రిజర్వ్‌డ్ నియోజకవర్గం కావడం వల్లే కొలికపూడికి అక్కడ అవకాశం ఇచ్చారు చంద్రబాబు. ఎన్నికలకు ముందు వైసీపీ ప్రభుత్వాన్ని తిట్టిన తిట్టు తిట్టకుండా తిట్టిన కొలికపూడి శ్రీనివాస్.. ఎమ్మెల్యేగా గెలిచిన తర్వాత నియోజకవర్గంలో అదే వైసీపీ నేతలతో అంటకాగుతున్నారు అన్న ఆరోపణలు బలంగా వినిపిస్తున్నాయి. కావాల్సినన్ని అవినీతి ఆరోపణలు.. లెక్కలేనన్ని అక్రమాలు.. స్థానిక టీడీపీ నేతలతో వివాదాలు.. దీంతో కొలికపూడిపై తిరువూరు టీడీపీ నేతలు గుర్రుగా ఉన్నారు. ఒకదశలో టీడీపీ నేతపై చర్యలు తీసుకోకపోతే 48 గంటల్లో పదవికి రాజీనామా చేస్తా అంటూ తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబుకే అల్టిమేటం జారీ చేశారు. అయితే అసలు నిజాలు బయటకు రావడంతో కొలికపూడిని చంద్రబాబు దూరం పెట్టారు. నందిగామ నియోజకవర్గంలో పర్యటనకు వెళ్లిన సమయంలో కొలికపూడి తీరుపై చంద్రబాబు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు కూడా. దీంతో అప్పటి నుంచి సైలెంట్‌గానే ఉంటున్నారు కొలికపూడి.
తాజాగా ప్రభుత్వ తీరును తప్పుబట్టేలా కొలికపూడి ప్రకటన చేశారు. రాజధాని అమరావతికి అదనంగా 40 వేలకు పైగా ఎకరాల భూసమీకరణ చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఈ విషయంపై కొలికపూడి శ్రీనివాసరావు తిరుగుబాటు బావుటా ఎగురవేయడానికి సిద్ధమయ్యారు. రాజధాని నిర్మాణం కోసం తొలి విడతలో పదేళ్ల క్రితం భూములు తీసుకుని న్యాయం చేయలేదన్నారు. కానీ ఇప్పుడు ఏకంగా మరో 40 వేల ఎకరాలకు పైగా ల్యాండ్ పూలింగ్ విధానంలో తీసుకోవడాన్ని తీవ్రంగా వ్యతిరేకిస్తున్నట్లు ప్రకటించారు. ఈ నెల 16న రాజధాని రైతులకు మద్దతుగా అమరావతి రాజధాని గ్రామాల్లో పర్యటించడానికి సిద్ధమైనట్లు ప్రకటించారు. అమరావతి జేఏసీ నాయకుడిగా కొలికపూడి శ్రీనివాసరావుకు గుర్తింపు. ఇప్పుడు ప్రభుత్వంలో భాగస్వామిగా వుంటూ, రాజధాని రైతులకు అన్యాయం జరుగుతోందని కొలికపూడి వ్యాఖ్యలు చేయడం పెద్ద దుమారం రేపుతోంది. రైతులకు మద్దతుగా నోరెత్తకుండా మౌనంగా ఉంటే.. వారికి ద్రోహం చేసినట్లు అవుతుందని కూడా ప్రకటించారు. అందుకే రాజధాని రైతులకు మద్దతుగా ఊరూరూ తిరిగి.. ల్యాండ్ పూలింగ్ పద్ధతిలో అదనంగా భూములు ఇవ్వొద్దని ప్రచారం చేయనున్నట్టు వెల్లడించారు.
Also Read : ఆ విషయంలో ఒంటరైన నాని..!
కొలికపూడి వ్యవహారంపై పార్టీలో తీవ్ర స్థాయిలో చర్చ జరుగుతోంది. వైసీపీ నేతలతో కలిసి కూటమి ప్రభుత్వంపై ఇలాంటి తప్పుడు ఆరోపణలు చేస్తున్నారని నియోజకవర్గం నేతలు ఆరోపిస్తున్నారు. ప్రభుత్వానికి భూములు ఇచ్చేందుకు ఎలాంటి ఇబ్బంది లేదని ఇప్పటికే రైతులు వెల్లడించారు కూడా. రెండో విడత భూ సేకరణకు తమకు ఎలాంటి అభ్యంతరం లేదని కూడా అన్నారు. అయినా సరే.. కొలికపూడి మాత్రం.. రైతులకు మద్దతు అనే సాకుతో పర్యటన చేయడం వెనుక పెద్ద ఎత్తున కుట్ర ఉందంటున్నారు. తొలి నుంచి వైసీపీ నేతలకు అనుకూలంగానే నియోజకవర్గంలో గ్రూప్ రాజకీయాలు చేస్తున్నారని ఆరోపిస్తున్నారు. త్వరలోనే కొలికపూడి వైసీపీలో చేరుతారనే ప్రచారం కూడా వినిపిస్తోంది. రాజధానిపై ప్రజల్లో తప్పుడు సంకేతాలు ఇచ్చేందుకే ఈ తరహా పర్యటనలకు కొలికపూడి ప్లాన్ చేస్తున్నట్లు టీడీపీ నేతలు ఆరోపిస్తున్నారు. కొలికపూడిపై క్రమశిక్షణా చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నారు.