కాస్త కంట్రోల్‌గా ఉండు చాలు.. అన్నీ జరిగిపోతాయన్నారు.. కానీ బేడా అన్నాడు.. చివరికి రాజకీయాలకే గుడ్ బై చెప్పాల్సిన పరిస్థితిని కోరి తెచ్చుకున్నట్లు అయ్యింది. ఆయనెవరో కాదు.. విజయవాడ మాజీ ఎంపీ కేశినేని శ్రీనివాస్ అలియాస్ కేశినేని నాని. వరుసగా రెండుసార్లు విజయవాడ పార్లమెంట్ స్థానం నుంచి తెలుగుదేశం పార్టీ తరఫున పోటీ చేసి ఎంపీగా ఎన్నికయ్యారు. వైసీపీ హవా కూడా తట్టుకుని నిలబడ్డారు. అయితే ఏదో జరిగిందంటూ గగ్గోలు పెట్టి.. ఏకంగా అధినేతనే టార్గెట్ చేశారు. సొంత పార్టీ నేతలపైనే విమర్శలు చేశారు. వద్దు అని ఎంత చెప్పినా వినలేదు.. అందరినీ ఆశ్చర్యానికి గురి చేస్తూ వైసీపీలో చేరిపోయారు. చంద్రబాబుపై విమర్శలు చేశారు. నోరు జారారు కూడా.
Also Read: కాంగ్రెస్‌తో గొంతు కలిపిన జగన్
ఎన్నికల్లో నాదే గెలుుపు అని ధీమా వ్యక్తం చేశారు. కానీ చివరికి ఘోరంగా ఓడిపోయారు. ఇక అంతే… ఒక్కసారిగా సైలెంట్ అయ్యారు. నాకెందుకీ పాలిట్రిక్స్ అని వ్యాఖ్యలు చేశారు. విజయవాడ పార్లమెంట్ పరిధిలో తనకంటూ ఓ ప్రత్యేక ముద్ర వేసుకున్నారు కేశినేని నాని. తెలుగుదేశం పార్టీ అధికారంలో ఉన్న సమయంలో విజయవాడ సిటీ పరిధిలో ఎన్నో అభివృద్ధి కార్యక్రమాలు చేశారు. కేంద్ర ప్రభుత్వ సహకారంతో దుర్గ గుడి ఫ్లై ఓవర్, బెంజి సర్కిల్ ఫ్లై ఓవర్ సహా.. పలు అభివృద్ధి కార్యక్రమాలకు నిధులు రాబట్టడంలో సక్సెస్ అయ్యారు. అయితే కార్పొరేషన్ ఎన్నికల్లో టీడీపీ గెలిస్తే.. తమ కుమార్తె శ్వేత మేయర్ అంటూ నాని ముందే ప్రకటించారు. దీనిపై కొందరు పార్టీ నేతలు తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేశారు. పార్టీ ఆదేశాలు లేకుండా ఎలా నిర్ణయం తీసుకుంటారని ప్రశ్నించారు.
Also Read: ఏపీ కొత్త పోలీస్ బాస్ పై వడపోత పూర్తి..!
దీంతో విజయవాడ టీడీపీలో గ్రూప్ రాజకీయాలు తలెత్తాయి. వీఎంసీపై వైసీపీ జెండా ఎగిరింది. దీంతో తన కుమార్తెను మేయర్ కాకుండా కొంతమంది అడ్డుకున్నారంటూ బహిరంగంగానే విమర్శలు చేశారు. ఆ తర్వాత విజయవాడ పశ్చిమ టికెట్ తన కుమార్తె శ్వేతకు ఇవ్వాలని కూడా నాని డిమాండ్ చేశారు. ఈ విషయంపై కూడా అభ్యంతరాలు వెల్లువెత్తాయి. ఇదే సమయంలో టీడీపీ అధిష్ఠానం కూడా నాని సోదరుడు శివనాథ్‌కు ఎక్కువ ప్రాముఖ్యత ఇవ్వడం పట్ల నాని తీవ్ర అసహనం వ్యక్తం చేశారు. చివరికి టీడీపీకి రాజీనామా చేసి వైసీపీలో చేరారు. కేవలం ఈగో కారణంగానే వైసీపీలో చేరిన నాని.. ఎన్నికల్లో సొంత తమ్ముడి చేతుల్లోనే ఓడిపోయారు. దీంతో తీవ్ర మనస్థాపంతో రాజకీయాలకు గుడ్ బై చెప్పేశారు. అయితే తన కుమార్తె శ్వేతను చట్టసభకు పంపాలనే కోరిక మాత్రం నానికి తీరలేదు. అటు శ్వేత అత్త గారి కుటుంబం ఇప్పటికీ తెలుగుదేశం పార్టీలోనే కొనసాగుతోంది.
Also Read: ఏదో అనుకుంటే.. ఇంకేదో అయ్యిందే..!
దీంతో మరోసారి తన ప్రయత్నాలు ప్రారంభించారు. ఎన్నికల సమయంలో చంద్రబాబు, లోకేష్‌పై ఘాటు వ్యాఖ్యలు చేయడంతో.. టీడీపీలోకి నానికి నో ఎంట్రీ బోర్డు పెట్టేశారు. అటు 2009 ఎన్నికలప్పుడు కూడా ప్రజారాజ్యం పార్టీ టికెట్ ఇవ్వలేదనే కారణంతో చిరంజీవి, పవన్‌పై విమర్శలు చేశాడు నాని. దీంతో జనసేన కూడా నో చెప్పేసింది. దీంతో ఇక మిగిలిన బీజేపీ వైపు అడుగులు వేయాలని నాని తీవ్రంగా ప్రయత్నం చేస్తున్నట్లు తెలుస్తోంది. తాను ఎంపీగా ఉన్న సమయంలో పలువురు కేంద్ర పెద్దలతో సత్సంబంధాలు నడిపారు. ఇప్పుడు అవే ఆయన బీజేపీలో చేరేందుకు సహకరిస్తున్నాయంటున్నారు రాజకీయ విశ్లేషకులు. త్వరలోనే కుమార్తె శ్వేతతో కలిసి కేశినేని నాని బీజేపీ తీర్థం పుచ్చుకుంటారనే మాట ఇప్పుడు బెజవాడ పాలిటిక్స్‌లో హాట్ టాపిక్‌గా మారింది.