ప్రపంచంలోనే అతిపెద్ద రైల్వే వ్యవస్థ… నిత్యం కోట్ల మంది ప్రయాణీకులను గమ్యస్థానాలకు చేరుస్తోంది. ప్రస్తుతం వాయువేగంతో పరుగులు పెట్టే రైళ్లను సొంతం చేసుకున్న రైల్వే శాఖ. గంటకు 130 కిలోమీటర్ల వేగంతో పరుగులు పెడుతున్న వందే భారత్ రైళ్లు ప్రస్తుతం ప్రయాణీకులకు సేవలందిస్తున్నాయి. త్వరలో అత్యాధునిక వసతులున్న వందే భారత్ స్లీపర్ కూడా పట్టాలెక్కనుంది. అయితే ఇదే సమయంలో సామాన్యుల రైళ్లపై మాత్రం రైల్వే శాఖ నిర్లక్ష్యం చూపుతోంది. సామాన్యుల రైళ్లకు రైల్వే శాఖ ఏ మాత్రం ప్రాధాన్యత ఇవ్వటం లేదు. దీంతో సామాన్యులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు.

తెలుగు రాష్ట్రాల్లో ప్రధాన మార్గాల్లో తిరిగే రైళ్లు అన్ని దాదాపు ఆలస్యంగానే నడుస్తున్నాయి. అయితే ఇదే సమయంలో వందే భారత్ రైళ్లు మాత్రం నిమిషం ఆలస్యం కూడా లేకుండా నడుస్తున్నాయి. ఇదే ఇప్పుడు అందరికీ ఆశ్చర్యం కలిగిస్తున్న అంశం. విజయవాడ నుంచి ప్రతిరోజు ఉదయం 6 గంటలకు హైదరాబాద్, విశాఖపట్నం, చెన్నై నగరాలకు మూడు రైళ్లు ఒకేసారి బయలుదేరతాయి. వీటి వల్ల ఆయా మార్గంలో ఎంతో మంది విద్యార్థులు, ఉద్యోగులు, సామాన్యులు, చిరు ఉద్యోగులకు ఎంతో మేలు కూడా జరుగుతుంది. స్లీపర్ రైలులో టికెట్ దొరికే పరిస్థితి ప్రస్తుతం లేదు. పైగా టికెట్ ధర కూడా అధికమే.

ఇదే ఈ రైళ్లల్లో అయితే రూ. వంద లోపే. అందుకే శాతవాహన, రత్నాచల్, పినాకిని రైళ్లకు అంత డిమాండ్ కూడా. వీటితో పాటు జన్మభూమి, పల్నాడు, గోల్కొండ, ఇంటర్ సిటీ (ఎంప్లాయిస్ రైలు) కూడా సామాన్యుల కోసమే నడుస్తున్నాయి. అయితే కొంత కాలంగా ఈ రైళ్ల రాకపోకలపై రైల్వే శాఖ తీవ్ర నిర్లక్ష్యం చూపుతోంది. విజయవాడ – హైదరాబాద్ – విజయవాడ మధ్య నడిచే శాతవాహన రైలు రెండు వైపులా గంటకు పైగా ఆలస్యంగా నడుస్తోంది. ఎందుకిలా అని అంటే ట్రాక్ అప్ గ్రేడ్ అంటున్నారు. మరి అదే ట్రాక్ పైన నడుస్తున్న వందే భారత్ రైళ్లు మాత్రం సరైన సమయానికే ఎలా నడుస్తున్నాయంటే మాత్రం అధికారులు సమాధానం చెప్పటం లేదు.
Also Read: కుందనపు బొమ్మలా తారకరత్న కూతురు
విజయవాడ – లింగంపల్లి ఎంప్లాయిస్ ట్రైన్ అయితే రాత్రి 10.30 గంటలకు గమ్యం చేరుకోవాల్సి ఉండగా… ప్రతిరోజూ అర్థరాత్రి 12 తర్వాతే సికింద్రాబాద్ వస్తోంది. దీంతో ఆ సమయంలో సిటీ బస్సులు, మెట్రోలు అందుబాటులో లేక, ఆటోల్లో డబుల్ రేట్ పెట్టలేక సామాన్యులు ఇబ్బందులు పడుతున్నారు. ఎందుకిలా అంటే.. టెక్నికల్ ప్రాబ్లమ్ అంటున్నారు అధికారులు. మరి అదే సమస్య ఇతర రైళ్లకు రాదా అనేది మిలియన్ డాలర్ల ప్రశ్న. నెమ్మదిగా సామాన్యుల రైళ్ల మీద ప్రజలకు విసుగు పుట్టేలా చేయాలనేది రైల్వే శాఖ ప్లాన్ అనే విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ఇప్పటికైనా రైళ్ల సమయపాలన సరిగ్గా పాటించేలా అధికారులు చర్యలు తీసుకోవాలని కోరుతున్నారు.