పహల్గాం ఉగ్రదాడి ప్రపంచ వ్యాప్తంగా సంచలనం సృష్టించిన సంగతి తెలిసిందే. పర్యాటక ప్రాంతంలో ఉగ్రదాడి జరగడంతో దేశ ప్రజల్లో తెలియని ఆందోళన నెలకొంది. ఎవరు దాడి చేసారు, ఏ వైపు నుంచి వచ్చారు, అనే దానిపై దర్యాప్తు సంస్థలు విచారణ చేస్తూనే ఉన్నాయి. ఉగ్రవాదుల స్థావరాలపై దాడులు చేసినా సరే పహల్గాం దాడిలో పాల్గొన్న ఉగ్రవాదులు మాత్రం దొరకలేదు. దీనిపై ప్రతిపక్షాలు కేంద్రాన్ని టార్గెట్ చేస్తున్న తరుణంలో భారత ఆర్మీ కీలక అడుగులు వేసింది. జమ్మూ కాశ్మీర్ లోని ఉగ్రవాదుల స్థావరాలపై దాడులకు దిగింది.
Also Read : మార్చుకుంటారా.. లేదా.. లాస్ట్ వార్నింగ్..!
ఆపరేషన్ మహాదేవ్ పేరుతో శ్రీనగర్‌లో జరిగిన ఎన్‌కౌంటర్‌లో ముగ్గురు ఉగ్రవాదులను కాల్చి చంపింది ఆర్మీ. ఈ హతమైన ముగ్గురు పాకిస్తాన్ ఉగ్రవాదులలో పహల్గామ్ దాడి సూత్రధారి కూడా ఉన్నాడని ఆర్మీ వర్గాలు తెలిపాయి. లష్కర్ టాప్ కమాండర్ సులేమాన్ షా, అలియాస్ ముసా ఫౌజీ, 26 మంది పౌరులను బలిగొన్న ఈ దాడికి కుట్రదారుడుగా అలాగే దాడిలో పాల్గొన్న ఉగ్రవాదిగా ఆర్మీ చెప్తోంది. గత ఏడాది శ్రీనగర్-సోన్‌మార్గ్ హైవేపై జడ్-మోర్ సొరంగం నిర్మాణంలో పాల్గొన్న ఏడుగురు కార్మికుల హత్యలో కూడా మూసా పాత్ర ఉందట.
Also Read : గజపతి రాజు సిగరెట్ కష్టాలు.. చంద్రబాబు ఆసక్తికర కామెంట్స్
ఉగ్రవాదుల స్థావరాల నుంచి 17 గ్రెనేడ్లు, పలు ఆయుధాలను స్వాధీనం చేసుకున్నారు. శ్రీనగర్‌లోని డచిగామ్ ప్రాంతంలో మౌంట్ మహాదేవ్ సమీపంలో ఈ ఎన్‌కౌంటర్ జరిగింది. ముగ్గురు విదేశీ ఉగ్రవాదులు ఉన్నట్లు సాయుధ దళాలకు సమాచారం అందడంతో ఈ ఆపరేషన్ నిర్వహించారు. జబర్వాన్, మహాదేవ్ పర్వత శిఖరాల మధ్య ఈ ఆపరేషన్ జరిగడంతో దీనికి ఆపరేషన్ మహాదేవ్ అనే పేరు పెట్టి ఉండవచ్చని జాతీయ మీడియా వర్గాలు తెలిపాయి. సోమవారం ఉదయం 11.30 గంటల ప్రాంతంలో, 24 రాష్ట్రీయ రైఫిల్స్ సహా జమ్మూ కాశ్మీర్ పోలీసులు ఈ దాడి నిర్వహించారు.