రాష్ట్ర విభజన తర్వాత ఆయా రాష్ట్రాలకు కేటాయించిన అధికారులు డిప్యూటేషన్ పై పక్క రాష్ట్రాల్లోనే కొనసాగుతున్నారు. దీనిపై విచారణ జరిపిన కేంద్రం… ఎవరికి కేటాయించిన రాష్ట్రాలకు వాళ్లు వెళ్లాల్సిందే అని ఆదేశించింది. దీంతో తెలంగాణలో కీలక బాధ్యతలు నిర్వహిస్తున్న ఐదుగురు ఐఏఎస్‌లు, ముగ్గురు ఐపీఎస్‌లు క్యాట్‌ను ఆశ్రయించారు. పదేళ్లుగా తమ విధులను పరిగణలోని తీసుకోవాలని కోరారు. దీనిపై విచారణ జరిపిన క్యాట్ అధికారుల పిటిషన్‌ను కొట్టేసింది. దీంతో ఆయా అధికారులు సొంత రాష్ట్రాలకు వెళ్లడం ఖరారైంది.
ఐదుగురు ఐఏఎస్ అధికారుల్లో వాణీప్రసాద్, వాకాటి కరుణ, రోనాల్డ్ రాస్, ప్రశాంతి, ఆమ్రపాలి ఉన్నారు. ఇక ఐపీఎస్ అధికారుల్లో అంజన్ కుమార్, అభిలాష బిస్త్, అభిషేక్ మహంతి ఉన్నారు. వీరిలో ఈ ఏడాది నవంబర్ నెలాఖరులో ప్రశాంతి రిటైర్ అవుతున్నారు. వీరిలో అందరి దృష్టి ఆమ్రపాలి పైనే ఉంది. మేడం వస్తారా… రారా… వస్తే… ఏ శాఖ కేటాయిస్తారు అనేది ఇప్పుడు హాట్ టాపిక్‌గా మారింది. వాస్తవానికి విధి నిర్వహణలో ముక్కుసుటిగా ఉంటారని ఆమ్రపాలికి పేరు. అలాగే ప్రభుత్వ విధానాల అమలులో కూడా మంచి పేరే తెచ్చుకున్నారు. దీంతో అందరు ఆమ్రపాలి గురించే చర్చించుకుంటున్నారు.
క్యాట్ తీర్పు రావడంతో ఏపీలో రిపోర్ట్ చేసేందుకు ఆమ్రపాలి రెడీ అయ్యారు. అమరావతి వస్తున్న ఆమ్రపాలిని అత్యంత కీలకమైన శాఖలో ఉంచే అవకాశాలున్నాయనేది ఏపీ సర్కార్‌లో టాక్. చంద్రబాబు ప్రతిష్ఠాత్మకంగా భావిస్తున్న అమరావతి నిర్మాణంలో ఫస్ట్ ఫేజ్ 2027 జూన్ నాటికి పూర్తి చేయాలని లక్ష్యంగా పెట్టుకున్నారు. ఇందుకోసం ఇప్పటికే ప్రణాళికలు సిద్ధం చేశారు కూడా. అమరావతి బాధ్యతలను మంత్రి నారాయణకు అప్పగించారు చంద్రబాబు. అలాగే సీనియర్ ఐఏఎస్ అధికారి కాటమనేని భాస్కర్‌ను సీఆర్‌డీఏ కమిషనర్‌గా నియమించారు. తొలి రోజుల్లో ఈ ఇద్దరు బాగానే ఉన్నప్పటికీ… నెల రోజుల తర్వాత ఇద్దరి మధ్య బంధం చెడింది. చివరికి అది ఇద్దరు ఎదురుపడేందుకు కూడా ఇష్టపడని పరిస్థితికి చేరుకుంది. కమిషనర్‌ను మార్చాలని మంత్రి నారాయణ ఇప్పటికే ముఖ్యమంత్రి చంద్రబాబును కోరినట్లు తెలుస్తోంది.
Also Read : మొండికేసిన ఐఏఎస్ అధికారులకి షాక్ ఇచ్చిన క్యాట్
మంత్రి నారాయణ నిర్ణయంపై చంద్రబాబు పునరాలోచనలో పడినట్లు తెలుస్తోంది. సరైన అధికారికి సీఆర్‌డీఏ బాధ్యతలు అప్పగించాలని భావిస్తున్నారు. ఈ సమయంలో అందుకు ఆమ్రపాలిని సరైన అధికారిగా భావిస్తున్నట్లు తెలుస్తోంది. గ్రేటర్ హైదరాబాద్ కమిషనర్‌గా ప్రస్తుతం ఆమ్రపాలి బాధ్యతలు నిర్వహిస్తున్నారు. గ్రేటర్ కమిషనర్ గా మంచి మార్కులు సాధించిన ఆమ్రపాలికి సీఆర్‌డీఏ కమిషనర్‌గా నియమించే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది.