వైసీపీ ఘోర పరాజయానికి అసలు కారణం ఎవరు.. వై నాట్ 175 అని గొప్పగా చెప్పుకున్న జగన్‌కు కనీసం ప్రతిపక్ష హోదా కూడా ఎందుకు రాలేదు.. ప్రజలకు నేరుగా డబ్బులిచ్చామని గొప్పగా చెప్పుకున్న జగన్‌కు ఎందుకు ఓట్లు రాలేదు.. తాడేపల్లి ప్యాలెస్ పెద్దల నుంచి కిందిస్థాయి కార్యకర్తల వరకు ఎవరికీ అంతుచిక్కని ప్రశ్న. వేల కోట్ల రూపాయలను నేరుగా జనం ఖాతాలో వేశాం కాబట్టి.. మనకే ఓట్లు అన్నీ వచ్చేస్తాయని భ్రమ పడ్డారు వైసీపీ నేతలు. అధినేత కూడా మనమే గెలుస్తున్నామంటూ గొప్పలు చెప్పుకున్నారు. అయితే ఎన్నికల తర్వాత బొమ్మ తిరగబడింది. గెలుపు విషయం పక్కన పెడితే.. కనీసం ప్రతిపక్ష హోదా కూడా రాలేదు. జగన్ సర్కార్‌లో అధికారం అనుభవించిన మంత్రులు, ముఖ్య నేతలంతా ఓడారు. మంత్రివర్గంలో ఒక్క పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి తప్ప.. మిగిలిన వారంతా ఘోరంగా ఓడిన వారే. నియోజకవర్గాలు మార్చినా సరే.. కొందరు నేతలను ప్రజలు విశ్వసించలేదు. వై నాట్ 175 అని చెప్పుకున్న వైసీపీ నేతలకు చివరికి 11 స్థానాలు వచ్చాయి.
Also Read : గంటా సమస్యకు దొరికిన పరిష్కారం..!
పార్టీ ఓడిన తర్వాత ఎందుకు ఓడాం అనే విషయంపై ఇప్పటి వరకు వైసీపీ నేతలు ఒక్కరు కూడా నోరు మెదపలేదు. పైగా మేము డబ్బులిచ్చాం… మేము మంచి పాలన అందించాం.. మా వల్ల రాష్ట్ర ప్రజలకు మేలు జరిగింది.. రాష్ట్రం అన్ని విధాలుగా అభివృద్ధి పథంలో నడిపించాం.. అంటూ పెద్ద కబుర్లు చెప్పారు. అదే సమయంలో ఓటర్లు మమ్మల్ని మోసం చేశారని ఒకరంటే.. ఈవీఎంలు ట్యాంపరింగ్ చేశారని మరికొందరన్నారు. ఇక జగన్ అయితే.. 11 సీట్లు మాత్రమే వచ్చాయనే విషయాన్ని పూర్తిగా మర్చిపోయారు. పైగా వైసీపీకి 40 శాతం ఓట్లు పోలయ్యాయని.. కాబట్టి ప్రతిపక్ష హోదా ఇవ్వాలని విచిత్రమైన వాదనను తెరపైకి తీసుకువచ్చారు. అంతే తప్ప.. ఓటమికి కారణాలను ఏ మాత్రం విశ్లేషించలేదు. ఎన్నికలు జరిగిన ఏడాది తర్వాత ఇప్పుడు అసలు కారణం గుర్తించినట్లున్నారు వైసీపీ నేతలు.
Also Read : పచ్చి తులసి ఆకులు తింటే ఇన్ని లాభాలా..?
వైసీపీ ఓటమికి వలంటీర్లే కారణమని మాజీ మంత్రి గుడివాడ అమర్నాథ్ వ్యాఖ్యానించారు. వలంటీర్ల వల్ల వైసీపీ ఎలా ఓడిందో కూడా అనకాపల్లి నేతలతో జరిగిన విస్తృతస్థాయి సమావేశంలో గుడివాడ క్లారిటీ ఇచ్చారు. ప్రభుత్వం అమలు చేసిన ఎన్నో సంక్షేమ పథకాలను వలంటీర్ల ద్వారానే అమలు చేశామన్నారు. అయితే చాలా మంది వలంటీర్లు మాత్రం గెజిటెడ్ ఆఫీసర్లు మాదిరిగా వ్యవహరించారని ఘాటు వ్యాఖ్యలు చేశారు. ఎన్నికలకు ముందు అందరినీ రాజీనామా చేయాలని కోరామని… గెలిచిన తర్వాత మళ్లీ ఉద్యోగంలోకి తీసుకుంటామని కూడా హామీ ఇచ్చామన్నారు. అయితే చాలా మంది రాజీనామా చేయకుండా ఉండిపోయారని గుర్తు చేశారు. అయితే ఏపీలో వలంటీర్ వ్యవస్థను అమలు చేసిందే వైసీపీ. ప్రతి 50 ఇళ్లకు ఒక వలంటీర్‌ను నాటి ప్రభుత్వం నియమించింది. వారంతా లబ్దిదారులను ఎంపిక చేయడం.. వారికి ప్రభుత్వ పథకాలను వివరించడం చేశారు. అలాగే ప్రతి ఎన్నికలో కూడా ఓటర్లకు సంక్షేమ పథకాలు రావు అని భయపెట్టి ఓట్లు వేయించారు. కానీ ఇదే వలంటీర్లు గత ఎన్నికల్లో మాత్రం వైసీపీకి హ్యాండ్ ఇచ్చేశారు. వలంటీర్లపై మొదటి నుంచి వల్లమాలిన ప్రేమ చూపించిన వైసీపీ నేతలు.. ఏడాది తర్వాత మాత్రం.. ఓటమికి వలంటీర్లే కారణం అని నెపం వాళ్ల నెత్తిన వేసేస్తున్నారు.