ఆ నియోజకవర్గం టీడీపీ ఇంఛార్జ్‌గా కొత్త నేతను నియమించారా.. సిట్టింగ్ ఎమ్మెల్యేను కాదని సీనియర్ బెటర్ అనుకున్నారా.. ఇవే ఇప్పుడు ఆ నియోజకవర్గంలో హాట్ టాపిక్. ఎవరితో పని చేయాలో అర్థం కాక క్యాడర్ కంగారు పడుతోంది. ఇంకా చెప్పాలంటే.. ఎవరితో తిరిగితే ఏమవుతుందో అని భయపడుతున్నారు కూడా. ఇంతకీ అది ఏ నియోజకవర్గం.. ఏమిటా కథ..
శ్రీకాకుళం అసెంబ్లీ నియోజకవర్గంలో రాజకీయాలు హాట్ హాట్‌గా ఉన్నాయి. ఓ వైపు మాజీ మంత్రి ధర్మాన ప్రసాదరావు ఇప్పటికే వైసీపీ కార్యక్రమాలకు దూరంగా ఉన్నారు. ఇటు టీడీపీలో కూడా గ్రూప్ రాజకీయాలు తారాస్థాయికి చేరుకున్నాయి. సిట్టింగ్ ఎమ్మెల్యే గొండు శంకర్, మాజీ ఎమ్మెల్యే గుండ లక్ష్మిదేవి మధ్య పచ్చగడ్డి వేస్తే భగ్గుమంటోంది. ఎన్నికల్లో గొండు శంకర్‌కు టికెట్ ఇవ్వడంపై గుండ లక్ష్మిదేవి తీవ్ర అసహనం వ్యక్తం చేశారు. చివరికి పార్టీ అధినేత చంద్రబాబు హామీతో లక్ష్మిదేవి మెత్తబడ్డారు. కానీ ఎన్నికల్లో మాత్రం గొండూ శంకర్‌తో కలిసి పని చేయలేదు. కొద్ది నెలల పాటు వైజాగ్‌కు మకాం మార్చేశారు. ఇక మాజీ మంత్రి అప్పల సూర్యనారాయణ అయితే తాను ఓటే వేయలేదని బహిరంగంగానే ప్రకటించారు. అలాగే కొందరు వైసీపీ నేతలతో ఉన్న ఫోటోలు సోషల్ మీడియాలో హల్ చల్ చేశాయి కూడా. దీనిపై పార్టీ పెద్దలు కూడా అప్పల సూర్యనారాయణను వివరణ అడిగినట్లు తెలుస్తోంది.
Also Read : ఈ నాయుడు మామూలోడు కాదుగా..!
తాజాగా రాష్ట్ర హోంమంత్రి వంగలపూడి అనిత అరసవల్లి సూర్యనారాయణస్వామిని దర్శించుకున్నారు. ఈ విషయం తెలుసుకున్న మాజీ ఎమ్మెల్యే గుండ లక్ష్మిదేవి నేరుగా గుడికి వెళ్లారు. అనితకు ఆత్మీయ స్వాగతం అందించారు ఓ చీర పెట్టారు. దగ్గరుండి మరీ స్వామి దర్శనం చేయించారు గుండ లక్ష్మిదేవి. అటు హోమ్ మంత్రి అనిత కూడా.. మాటకు ముందు, తర్వాత లక్ష్మమ్మ అంటూ సంబోధించారు. 2014-19 మధ్య కాలంలో గుండ లక్ష్మిదేవి తను ఎమ్మెల్యలుగా ఉన్నప్పటి విషయాలు గుర్తు చేసుకున్నారు కూడా. అయితే ఇక్కడే అసలు సమస్య మొదలైంది. అనిత పర్యటనకు వచ్చిన సమయంలో స్థానిక ఎమ్మెల్యే గొండు శంకర్ అందుబాటులో లేరు. కుటుంబంతో కలిసి తిరుపతి వెళ్లారు. దీంతో అనితకు సాదర స్వాగతం ఇవ్వాలని క్యాడర్‌ను ఆదేశించారు.
Also Read : మరో 10 రోజులే సమయం..!
ఎమ్మెల్యే మాటతో పెద్ద ఎత్తున దేవస్థానం దగ్గరకు వచ్చిన క్యాడర్.. అక్కడ గుండ లక్ష్మిదేవిని చూసి ఒక్కసారిగా అవాక్కయ్యారు. ఆ దరిదాపుల్లో కూడా లేకుండా వెళ్లిపోయారు. దీంతో అంతా నియోజకవర్గం ఇంఛార్జ్ బాధ్యతలను గుండ లక్ష్మీదేవికి అప్పగించారా అని అనిపించేలా… గుండ వర్గం వ్యవహరించింది. ఎన్నికల ముందు వరకు గుండ లక్ష్మిదేవి వెనుక తిరిగిన నేతలంతా.. జాబితాలో గొండు శంకర్ పేరు రావడంతో.. సైలెంట్‌గా షిఫ్ట్ అయిపోయారు. ఎన్నికల్లో టీడీపీ అభ్యర్థి శంకర్ తరఫున ప్రచారం చేసిన నేతలకే ఇప్పుడు పదవులు వస్తున్నాయి. అయితే వీరంతా గతంలో లక్ష్మిదేవితో ఉన్న వాళ్లే. వీళ్లంతా హోమ్ మంత్రి వస్తున్నారనే సమాచారంతోనే అరసవల్లి దేవస్థానం దగ్గరకు వచ్చారు.
కానీ అక్కడ లక్ష్మీదేవిని చూసి అవాక్కయ్యారు. సైలెంట్‌గా సైడ్ అయిపోయారు.
Also Read : గల్లా రాజకీయ రీఎంట్రీ కి రంగం సిద్ధం..!
శ్రీకాకుళం టౌన్ టీడీపీ అధ్యక్షుడు మాదారపు వెంకటేష్ వంటి నేతలు కూడా ఒక్కసారిగా గుండకు ముఖం చాటేశారు. నిన్నటి వరకు లక్ష్మీదేవితో ఉన్న నేతలే… హోమ్ మంత్రి పర్యటనలో ఆమె ఏ హోదాలో పాల్గొన్నారని ప్రశ్నిస్తున్నారు. పార్టీ ఇంఛార్జ్ బాధ్యతల కోసమే గుండ లక్ష్మీదేవి తీవ్రంగా ప్రయత్నం చేస్తున్నారని.. అందుకే అనితను దగ్గరుండి మరీ గుడిలోకి తీసుకెళ్లారని… తర్వాత చీర పెట్టి ఆత్మీయంగా పలకరించారన్నారు. గొండు శంకర్ పార్టీ టిక్కెట్ ఎలా తెచ్చుకున్నారో, ఇప్పుడు కూడా లక్ష్మీదేవి పార్టీలో ఉంటూనే వచ్చే ఎన్నికల్లో శంకర్‌ను తప్పించే యోచనలో పని చేస్తున్నారనేది కార్యకర్తల భావన. అందుకే ఆమె వెళ్లే కార్యక్రమాలకు కేడర్ దూరం ఉంటోంది. 2024 ఎన్నికలకు ముందు నగరంలో గొండు శంకర్ పర్యటిస్తున్న సందర్భంలో రెల్లివీధి వద్ద నగర పార్టీ అధ్యక్షుడు మాదారపు వెంకటేష్ అడ్డుకున్నారు.
Also Read: మెరిసిపోతున్న శోభిత ధూళిపాళ
నియోజకవర్గ ఇన్‌ఛార్జిగా లక్ష్మీదేవి ఉన్నప్పుడు ఏ హోదాలో నగరంలో పర్యటిస్తున్నారంటూ కొంతమంది కేడర్‌తో కలిసి నిలదీశారు. ఆ తర్వాత శంకర్‌కే టిక్కెట్ దక్కడంతో వెంకటేష్ సైలెంట్‌గా శంకర్ వైపు తిరిగారు. ఇప్పుడు లక్ష్మీదేవితో అలాంటి ఇబ్బందులు రాకుండా ఉండేందుకు శంకర్ జాగ్రత్తలు తీసుకుంటున్నారు. అటు లక్ష్మీదేవి కూడా పార్టీ తరఫున కాకుండా మాజీ ఎమ్మెల్యే హోదాలో పరామర్శలు చేస్తున్నారు. శ్రీకాకుళంలో ధర్మాన ప్రసాదరావు మీద గెలవడం గుండ కుటుంబం తప్ప మరొకరికి సాధ్యం కాదనే రీతిలో ప్రచారం ఉండేది. శంకర్ కేవలం సర్పంచ్ మాత్రమేనని ఆయనకు ఆ స్థాయి లేదని పోలింగ్ రోజు వరకు ప్రచారం చేసింది గుండ వర్గం. కానీ భారీ మెజార్టీతో శంకర్ గెలిచారు. దీంతో తెలుగుదేశం తరఫున ఎవరు నిల్చున్నా గెలుస్తారని, విజయం గుండ కుటుంబం సొత్తు కాదని తేలిపోయింది.
ఎన్నికల్లో గుండ వర్గం శంకర్‌కు అనుకూలంగా పని చేసి ఉంటే.. ఈ గెలుపును తమ ఖాతాలో వేసుకోవచ్చు. కానీ అలా చేయలేదు. దీంతో పార్టీ పెద్దల దృష్టిలో గుండ దంపతులు చులకన అయ్యారనేది వాస్తవం. ఇప్పుడు గుండ లక్ష్మిదేవి తీరుతో కేడర్ ఇబ్బంది పడుతోంది. వాస్తవానికి అప్పల సూర్యనారాయణ తీరుపై కేడర్‌లో మంచి మార్కులే ఉన్నాయి. 2014 ఎన్నికల్లో తనను కాదని లక్ష్మీదేవికి టికెట్ ఇవ్వడంపై కినుక వహించిన సూర్యనారాయణ.. చంద్రబాబుకు ముఖం చాటేశారు. అయితే ఈ విషయం తెలుసుకున్న అప్పటి పార్టీ రాష్ట్ర అధ్యక్షులు కళా వెంకట్రావు.. చంద్రబాబు అరసవల్లి పర్యటన తర్వాత నేరుగా సూర్యనారాయణ ఇంటికి తీసుకెళ్లారు. కానీ ప్రస్తుతం లక్ష్మీదేవి తీరు చూస్తే.. ఆమె స్థాయి, వయసుకు తగినట్లుగా రాజకీయాలు చేయడం లేదనే విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.