తెలంగాణాలో కాంగ్రెస్ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసి సంవత్సరం కావొస్తోంది. కాంగ్రెస్ ఏడాది పాలనలో మెట్రోకు అత్యంత ప్రాధాన్యత ఇచ్చారు. మెట్రోపై ప్రత్యేక దృష్టి సారించిన సీఎం రేవంత్‌రెడ్డి… రెండో దశ విస్తరణకు వేగంగా అడుగులు వేశారు. అధికారంలోకి వచ్చిన రెండు నెలల్లోనే పాతబస్తీ పనులకు మోక్షం కల్పించారు. 5 కారిడార్ల మెట్రో పనులకు సంబంధించి డీపీఆర్ ఇప్పటికే కేంద్రానికి చేరగా.. అనుమతి వచ్చిన వెంటనే పనులు ప్రారంభించేందుకు రేవంత్ సర్కార్ సిద్ధంగా ఉంది.
Also Read: ఊగిపోయిన తెలుగు రాష్ట్రాలు… 1969 తర్వాత భారీ భూకంపం
హైదరాబాద్ రవాణాలో కీలకంగా మారిన మెట్రోరైలు రెండోదశ విస్తరణపై కాంగ్రెస్ ప్రభుత్వం ప్రత్యేక దృష్టి సారించింది. గత ప్రభుత్వం రెండో దశపై నిర్లక్ష్యం వహిస్తే.. కేవలం పది నెలల కాలంలోనే కాంగ్రెస్ ప్రభుత్వం ఆ పనులకు శ్రీకారం చుట్టింది. 5 కారిడార్లలో 76.4 కిలోమీటర్ల మేరకు రూ.24,269 కోట్లతో నిర్మాణం చేసేలా ముందుకు సాగుతోంది. రెండోదశ పనులకు సంబంధించిన డిటైల్ ప్రాజెక్టు రిపోర్ట్‌ను నవంబర్ 4న కేంద్ర ప్రభుత్వానికి సమర్పించిన ప్రభుత్వం.. అనుమతి కోసం ఎదురుచూస్తోంది. కేంద్రం నుంచి అనుమతి రాగానే మెట్రో ప్రాజెక్ట్ పనులు ప్రారంభం కానున్నాయి.
ముఖ్యమంత్రిగా రేవంత్ రెడ్డి బాధ్యతలు స్వీకరించిన తర్వాత హైదరాబాద్ నగరాభివృద్ధిలో భాగంగా.. మెట్రో రైలు విస్తరణపై స్పెషల్ ఫోకస్ పెట్టారు. కేసీఆర్ ప్రభుత్వం రెండోదశలో ప్రతిపాదించిన మూడు కారిడార్లను రద్దు చేసి నగరంలోని అన్ని ప్రాంతాలకూ మెట్రోరైలును నడిపించాలని భావించారు. ఇందులో భాగంగా హైదరాబాద్ ఎయిర్‌పోర్ట్ మెట్రోరైల్ లిమిటెడ్ అధికారులతో వరుస సమీక్షలు చేపట్టారు. తమ ప్రభుత్వ హయాంలోనే నగరవాసులకు మెట్రోను మరింతగా అందుబాటులోకి తీసుకురావాలని ముఖ్యమంత్రి భావిస్తున్నారు.
Also Read: వివేకా కేసు తేలేనా… పోలీసులతో ఆడుకుంటున్న అవినాష్ అండ్ గ్యాంగ్
మొదటిదశ ప్రాజెక్టును 2012లో ప్రారంభించి 2017లో పూర్తిచేశారు. ప్రైవేట్, పబ్లిక్ పార్టనర్షిప్ మోడల్లో ఎల్ అండ్ టీ ఈ ప్రాజెక్టును చేపట్టింది. రెండోదశ పనులను కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు జాయింట్ వెంచర్ చేపట్టేందుకు నిర్ణయించాయి. 30శాతం నిధులు రాష్ట్ర ప్రభుత్వ వాటాగా, 18శాతం కేంద్రం, 4శాతం పీపీపీ మోడల్‌లో, మిగతా 48శాతం నిధులను కేంద్రం సావరీన్ గ్యారంటీతో అంతర్జాతీయ బ్యాంకుల నుంచి నిధులు సమకూర్చుకోవాలని చూస్తున్నారు. ఇలా చేయడం ద్వారా పనులు సకాలంలో పూర్తయ్యే అవకాశం కనిపిస్తోందని భావిస్తున్నారు. మొదటి దశలో చేపట్టిన రెండో కారిడార్ జేబీఎస్-ఫలక్‌నుమాలో ఎంజీబీఎస్ దాటిన తర్వాత.. ప్రార్ధనా మందిరాలు అడ్డురావడంతో పెద్ద ఎత్తున అభ్యంతరాలు వచ్చాయి.
Also Read: మా అన్నను ఎందుకు క్షమిస్తున్నావ్ చంద్రబాబు…?
దీంతో ప్రతిపాదించిన 15.5 కిలోమీటర్ల పనుల్లో 5.5 కిలోమీటర్లను నిలిపివేసి ఎంజీబీఎస్ వరకు మాత్రమే మెట్రోను పూర్తిచేశారు. దీంతో అప్పటినుంచి పాతబస్తీ వాసులు మెట్రో కోసం ఎదురుచూస్తున్నారు. గత ముఖ్యమంత్రి కేసీఆర్ ఈ పనులను పూర్తిచేస్తానని అసెంబ్లీ సాక్షిగా పలుమార్లు చెప్పినప్పటికీ అమలుకు నోచుకోలేదు. అయితే కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన రెండు నెలల్లోనే పాతబస్తీ పనులకు మోక్షం కల్పించారు. ఈ ఏడాది మార్చిలోనే ఫలక్‌నుమా వద్ద సీఎం రేవంత్‌రెడ్డి పనులకు శంకుస్థాపన చేశారు. వచ్చే ఎన్నికల్లోపు ఓల్డ్‌సిటీకి మెట్రో తీసుకొస్తామని చెప్పడంతో సంతోషంగా ఎదురుచూస్తున్నారు. మొత్తంగా కాంగ్రెస్ ప్రభుత్వం ఏడాది పాలనలో నగరంలో మెట్రో విస్తరణపై స్పెషల్ ఫోకస్ పెట్టడంతో పనులు చకాచకా జరుగుతున్నాయి.