రాజధాని అమరావతి పనులు తిరిగి పట్టాలెక్కనున్నాయి. మే 2వ తేదీన ప్రధాని నరేంద్ర మోదీ అమరావతి పనులను పునఃప్రారంభించనున్నారు. కూటమి సర్కార్ అధికారంలోకి వచ్చిన తర్వాత అమరావతి నిర్మాణ పనులపైనే చంద్రబాబు ప్రధానంగా దృష్టి సారించారు. ఇప్పటికే జగిల్ క్లియరెన్స్ పూర్తైయ్యింది. ఇక దాదాపు అన్ని పనులకు టెండర్లు కూడా ఖరారు చేశారు. వీటిల్లో కొన్ని పనులను ఇప్పటికే టెండర్లు దక్కించుకున్న ఆయా సంస్థలు ప్రారంభించాయి కూడా. అయితే అధికారికంగా మాత్రం మే 2న ప్రధాని నరేంద్ర మోదీ చేతుల మీదుగా పనులు ప్రారంభం కానున్నాయి. అమరావతి పనులు తిరిగి పట్టాలెక్కడంతో రాజధాని ప్రాంత రైతుల ఆనందానికి అవధులు లేకుండా ఉన్నాయి. ఐదేళ్ల పాటు వైసీపీ ప్రభుత్వంలో యుద్ధం చేసి గెలిచిన రైతులు.. తమ ప్రాంతం అభివృద్ధి చెందుతోందని సంబరాలు జరుపుకుంటున్నారు. ఇదే సమయంలో కొంతమంది రైతులు ఆందోళన కూడా వ్యక్తం చేస్తున్నారు.
Also Read : వరుస ప్రమాదాలకు కారణాలేమిటి..?
2014లో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం విడిపోయిన సమయంలో ఏపీకి రాజధాని లేకుండా పోయింది. ఆ సమయంలో ప్రజాభిప్రాయ సేకరణ చేసిన నాటి చంద్రబాబు ప్రభుత్వం… అందరికీ అనుకూలంగా ఉన్న గుంటూరు, విజయవాడ మధ్య ప్రాంతాన్ని రాజధానిగా ఎంపిక చేసింది. రైతులను ఒప్పించి ఏకంగా 33 వేల ఎకరాల భూమిని రాజధాని నిర్మాణం కోసం ఎంపిక చేసింది. రాజధానికి అమరావతి అని నామకరణం కూడా చేసిన నాటి ప్రభుత్వం.. ప్రధాని మోదీ చేతుల మీదుగా పనులకు శంకుస్థాపన జరిపించింది. అయితే శాశ్వత భవనాల నిర్మాణం ప్రారంభమైన ఏడాది లోపే ఎన్నికలు రావడం.. వైసీపీ ప్రభుత్వం కొలువు తీరడంతో అమరావతి నిర్మాణం ఆగిపోయింది. అధికారంలోకి వచ్చిన జగన్.. 6 నెలల తర్వాత 3 రాజధానుల ప్రతిపాదన తీసుకువచ్చారు. పరిపాలన రాజధానిగా విశాఖపట్నం, న్యాయ రాజధానిగా కర్నూలు, శాసన రాజధానిగా అమరావతి ఉంటుందని ప్రకటించారు. ఈ ప్రకటన వెనుక చంద్రబాబు సర్కార్ చేసిన తప్పు ఉందనేది రాజకీయ విశ్లేషకుల ఆరోపణలు. అమరావతిని రాజధానిగా ఎంపిక చేసిన నాటి టీడీపీ ప్రభుత్వం గెజిట్ నోటిఫికేషన్ మాత్రం ఇవ్వలేదు. ఇదే విషయాన్ని వైసీపీ మంత్రులు, ప్రజాప్రతినిధులు పదేపదే ప్రస్తావించారు కూడా. గెజిట్ లేకపోవడం వల్లే గత వైసీపీ ప్రభుత్వం రెండు చట్టాలు చేయగలిగింది. అయితే రైతులు మొక్కవోని దీక్షతో పోరాటం ముందు జగన్ తలవంచక తప్పలేదు. రైతులు పాదయాత్ర, న్యాయ యాత్ర చేయడంతో జగన్ సర్కార్ వెనక్కి తగ్గింది. చివరికి రెండు చట్టాలను కూడా వెనక్కి తీసుకోవాల్సి వచ్చింది.
Also Read : టాప్ మోస్ట్ టెర్రరిస్ట్ ఇల్లు గుర్తించిన నేషనల్ మీడియా
ఇప్పుడు అమరావతి పనులు ప్రారంభమవుతున్న వేళ రైతులు భయపడుతున్నారు. అదే గెజిట్ నోటిఫికేషన్ వస్తుందా.. రాదా అనే విషయంపై కలవరపడుతున్నారు. ఇప్పటికి కొంతమందిలో ఒక రకమైన భయం ఉంది. అదేమిటంటే.. “భవిష్యత్తులో జగన్ మళ్లీ అధికారంలోకి వస్తే..” అనే విషయం. వాస్తవానికి ఈ భయం ఒక్క రైతులదే కాదు.. పారిశ్రామిక వేత్తలు, ఉద్యోగులది కూడా. జగన్ మళ్లీ అధికారంలోకి వస్తే.. మరోసారి రాజధాని గురించి మార్పులు చేయరని గ్యారంటీ ఏమిటీ.. అనేది రైతుల ప్రశ్న. ఇప్పటికే తన కోసం విశాఖలో రుషికొండలో ప్రభుత్వ సొమ్ముతో ప్యాలెస్ కట్టుకున్నాడు జగన్. అది పర్యాటక శాఖ నిధులతో నిర్మించినప్పటికీ.. పర్యాటకులకు ఏ మాత్రం ఉపయోగపడదు. సకల రాజభోగాలతో దానిని అత్యంత విలాసవంతంగా జగన్ నిర్మించుకున్నారు. కాబట్టి మళ్లీ అధికారంలోకి వస్తే.. ఈసారి మకాం విశాఖకు మార్చడం ఖాయమని రైతులు భయపడుతున్నారు.
Also Read : జగన్ మాస్టర్ ప్లాన్ రెడీ.. బీ అలర్ట్..!
జగన్ అధికారంలోకి వస్తే.. తమకు పాత రోజులు మళ్లీ పునరావృతం అవుతాయని రైతులు ఆందోళన చెందుతున్నారు. ఈ విషయంపై కూటమి ప్రభుత్వం ఎంత భరోసా ఇచ్చినా… చంద్రబాబు ఎన్ని హామీలిచ్చినా కూడా రైతులు మాత్రం భయపడుతూనే ఉన్నారు. అదే సమయంలో జగన్ అధికారంలోకి వస్తే.. తెలుగుదేశం పార్టీ నేతలు కూడా ఈసారి తమకు అండగా నిలిచే అవకాశం ఉండదని రైతులు చెబుతున్నారు. ఈ నేపథ్యంలో రైతులు ఒకే విషయంపై పదే పదే డిమాండ్ చేస్తున్నారు. అదే ఏపీ రాజధానిగా గెజిట్ నోటిఫికేషన్ విడుదల చేయాలని కోరుతున్నారు. అది కూడా ప్రధాని మోదీ అమరావతి పనులను తిరిగి ప్రారంభించే సమయంలోనే చేయాలని విజ్ఞప్తి చేస్తున్నారు. అలా గెజిట్ నోటిఫికేషన్ జారీ చేస్తే… భవిష్యత్తులో ఎన్ని ప్రభుత్వాలు మారినా.. తమకు ఎలాంటి ఇబ్బందులు ఉండవనేది రైతుల మాట. మరి ప్రధాని నరేంద్ర మోదీతో అమరావతి గెజిట్ నోటిఫికేషన్ ప్రకటనను చంద్రబాబు ఇప్పిస్తారా లేదా అనేది చూడాల్సి ఉంది.




