గత అయిదేళ్లుగా ఒక్క అడుగు కూడా ముందుకు పడని అమరావతి పనులను మొదలుపెట్టేందుకు రాష్ట్ర ప్రభుత్వం సిద్దమవుతోంది. ఎన్ని ఇబ్బందులున్నా సరే అమరావతిని రాబోయే అయిదేళ్ళలో దాదాపుగా పూర్తి చేయాలని రాష్ట్ర ప్రభుత్వం కష్టపడుతోంది. ఇప్పటికే సగం నిర్మించిన భవనాలను పూర్తి చేసే ఆలోచన కూడా ప్రభుత్వం చేస్తోంది. వాటికి నాణ్యత పరీక్షలను కూడా అధికారులు నిర్వహిస్తున్నారు. త్వరలోనే అమరావతిలో చంద్రబాబు పూర్తి స్థాయి పర్యటనలకు సిద్దమవుతున్నారు.
అటు కేంద్రం నుంచి కూడా సహకారం ఉండటంతో చంద్రబాబు దూకుడు పెంచారు అనే చెప్పాలి. ఈ రోజు మధ్యాహ్నం సిఆర్డీఏ పై సిఎం చంద్రబాబు సమీక్ష చేస్తారు. సిఆర్డీఏ అధారిటీ సమావేశం జరగనుంది. రాజధాని లో ప్రస్తుత పనుల పై చర్చించనున్నారు. గతంలో వివిధ ప్రాజెక్ట్ ల కేటాయించిన భూములను అంశం పై చర్చ జరుగుతుంది. సమావేశానికి మంత్రి పొంగూరు నారాయణ, సి ఆర్ డి ఏ కమిషనర్ కాటమనేని భాస్కర్ ఇతర ఉన్నతాధికారులు హాజరు అవుతారు. అమరావతి లో నేలపాడు వద్ద హ్యాపీ నెస్ట్ ప్రాజెక్ట్ తిరిగి ప్రారంభించడం పై చర్చ జరుగుతుంది.
ఇక రాజధాని పనులకు సంబంధించి కేంద్ర ప్రభుత్వానికి వివరించే దిశగా చంద్రబాబు అడుగులు వేస్తున్నారు. త్వరలోనే ఢిల్లీ పర్యటనకు వెళ్లి ప్రధాన మంత్రిని, ఆర్ధిక మంత్రిని అమరావతి ఆహ్వానించాలని భావిస్తున్నారు. పనులు ఎక్కడ ఆగిపోయాయి, ఎక్కడ మొదలుపెట్టాలనే దానిపై వారికి చంద్రబాబు స్వయంగా వివరిస్తారు. కేంద్ర ప్రభుత్వం కూడా ఏపీ విషయంలో ప్రత్యేక శ్రద్ధ పెట్టడం, బడ్జెట్ లో భారీగా నిధులు కేటాయించడంతో చంద్రబాబు కేంద్ర ప్రభుత్వాన్ని అమరావతి తీసుకొచ్చే యోచన చేస్తున్నారు. ఈ సందర్భంగా పలు కేంద్ర ప్రభుత్వ సంస్థలను రాష్ట్రంలో ఏర్పాటు చేయించే విధంగా ప్రధాన మంత్రిని, ఆర్ధిక మంత్రిని ఒప్పించాలని చంద్రబాబు భావిస్తున్నారు.