తెలుగుదేశం పార్టీ అంటే క్రమశిక్షణకు మారుపేరు. కార్యకర్త మొదలు అధినేత వరకు ఎవరైనా సరే.. పార్టీ నిర్ణయానికి కట్టుబడి ఉండాల్సిందే. పార్టీ లైన్ దాటినట్లు తెలిస్తే.. ఎంతటి వారిపైన అయినా సరే చర్యలు తీసుకునేందుకు వెనుకడుగు వేసేది లేదు. ఈ విషయం పార్టీ వ్యవస్థాపక అధ్యక్షుడు ఎన్టీఆర్ ఎన్నోసార్లు రుజువు చేశారు. అదే సూత్రాన్ని చంద్రబాబు ఇప్పటికీ పాటిస్తున్నారు. పార్టీకి వ్యతిరేకంగా మాట్లాడినా.. ప్రభుత్వాన్ని ఇబ్బంది పెట్టాలని చూసినా సరే.. సొంత పార్టీ నేతలపై కఠిన చర్యలు తీసుకునేందుకు చంద్రబాబు ఎప్పుడు వెనుకడుగు వేయలేదు. ప్రజలే దేవుళ్లు, సమాజమే దేవాలయం అనేది తెలుగుదేశం పార్టీ సూత్రం. ఇందుకు ప్రతి ఒక్కరు కట్టుబడి ఉండాల్సిందే. అయితే తాజాగా ఓ మాజీ మంత్రి పార్టీని ఇరుకున పెట్టేలా చేసిన వ్యాఖ్యలు పెద్ద దుమారం రేపుతున్నాయి.
Also Read : విజయసాయి తర్వాత మిథున్ రెడ్డి.. వెంటాడుతున్న సిట్
మాజీ మంత్రి, ప్రస్తుత ఎమ్మెల్యే గంటా శ్రీనివాసరావుపై టీడీపీ అధినేత, ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఆగ్రహం వ్యక్తం చేసినట్లు తెలుస్తోంది. రాష్ట్రంలోనే అత్యధిక మెజారిటీతో గెలిచిన ఎమ్మెల్యే గంటా శ్రీనివాసరావు. అయితే ఆయన ఇటీవల సోషల్ మీడియాలో చేసిన పోస్ట్ పెద్ద దుమారం రేపుతోంది. ఇంకా చెప్పాలంటే ఇటు రాష్ట్ర ప్రభుత్వాన్ని, అటు కేంద్ర ప్రభుత్వాన్ని కూడా ఇరుకున పెట్టినట్లు అయ్యింది. రెండు రోజుల క్రితం విశాఖ నుంచి అమరావతికి వచ్చారు గంటా శ్రీనివాసరావు. అయితే ఆ సమయంలో నేరుగా విమానం లేకపోవడంతో విశాఖ నుంచి హైదరాబాద్ వెళ్లి.. అక్కడ నుంచి మరో విమానంలో గన్నవరం చేరుకున్నారు. దీనిపై సోషల్ మీడియా “ఎక్స్”లో గంటా శ్రీనివాసరావు పోస్ట్ చేశారు. తన ప్రయాణానికి సంబంధించిన టికెట్లను పోస్ట్ చేశారు. ఆంధ్ర టూ ఆంధ్ర వయా తెలంగాణ అంటూ వ్యంగ్యంగా పోస్ట్ చేశారు. విశాఖ – విజయవాడ మధ్య 2 విమానాలు రద్దు చేశారంటూ కేంద్ర విమానశాఖకు పరోక్షంగా చురకలంటించారు గంటా.
Also Read : ఏపీ పోలీస్ భేష్.. మొదటి స్థానంలో తెలంగాణా
ఆంధ్ర టూ ఆంధ్ర వయా తెలంగాణ, ప్రయాణీకుల దుస్థితి అంటూ గంటా శ్రీనివాసరావు చేసిన వ్యాఖ్యలపై పార్టీ అధిష్ఠానం సీరియస్ అయ్యినట్లు తెలుస్తోంది. కూటమి ప్రభుత్వ ప్రతిష్ఠను దెబ్బతీసేలా గంటా వ్యాఖ్యలున్నాయని ఆగ్రహం వ్యక్తం చేసినట్లు తెలుస్తోంది. పార్టీ సీనియర్ నేతలు ఇప్పటికే ఈ విషయంపై గంటాకు ఫోన్ చేసి క్లాస్ పీకినట్లు సమాచారం. గతంలో పార్టీ అధికారంలో ఉన్న సమయంలో ఐదేళ్లు మంత్రిగా వ్యవహరించిన గంటాకు ఏ విషయాలపై వ్యాఖ్యలు చేయాలో.. ఏ విషయాల గురించి విమర్శించాలో తెలియదా అని ప్రశ్నిస్తున్నారు. టీడీపీకే చెందిన రామ్మోహన్ నాయుడు ప్రస్తుతం కేంద్ర పౌర విమానయాన మంత్రిగా ఉన్నారు. సమస్యను ఆయన దృష్టికి నేరుగా తీసుకెళ్లకుండా.. ఇలా సోషల్ మీడియాలో పెట్టడం వల్ల పార్టీకి, ప్రభుత్వానికి చెడ్డపేరు వస్తుందని అసహనం వ్యక్తం చేసినట్లు తెలుస్తోంది. మరోసారి ఇలా చేయవద్దని కూడా వార్నింగ్ ఇచ్చినట్లు సమచారం. మరి గంటా తన తీరు మార్చుకుంటారా… లేక మంత్రిపదవి రాలేదనే అసహనంతో ఇలాగే వ్యవహరిస్తారా.. వేచి చూడాల్సి ఉంది.




