ఆంధ్రప్రదేశ్ లో తెలుగుదేశం పార్టీ అత్యంత ఇబ్బందికర పరిస్థితిలో ఉన్న సమయంలో.. అండగా నిలిచిన జిల్లాలు రెండే. ఒకటి ప్రకాశం, రెండు విశాఖ. ఈ రెండు జిల్లాల నుంచే తెలుగుదేశం పార్టీకి 2019 ఎన్నికల్లో ఎక్కువ సీట్లు వచ్చాయి. అలాగే గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నికల్లో సైతం ఇక్కడ కంచర్ల శ్రీకాంత్ ఘన విజయం సాధించారు. ఇక మొన్న జరిగిన ఎన్నికల్లో కూడా వైసీపీకి ప్రకాశం జిల్లా ప్రజలు గట్టి షాక్ ఇచ్చారు. అసలు గెలిచే అవకాశం లేదనుకున్న స్థానాల్లో కూడా టీడీపీ అభ్యర్ధులు విజయం సాధించడం ఆశ్చర్యం కలిగించింది.
దీనితో ఇప్పుడు ఉమ్మడి ప్రకాశం జిల్లాను అన్ని విధాలుగా అభివృద్ధి చేసే దిశగా సిఎం చంద్రబాబు అడుగులు వేస్తున్నారు. తాజాగా కేంద్ర ప్రభుత్వ బడ్జెట్ లో కూడా వెనుకబడిన జిల్లాగా భావించే ప్రకాశం జిల్లాకు నిధులు కేటాయించారు. ఇక దొనకొండలో విమానాశ్రయం కూడా ఏర్పాటు చేయాలని ప్రభుత్వం భావిస్తుంది. ఈ నేపధ్యంలో తాజాగా ఒక కీలక పరిణామం చోటు చేసుకుంది. దొనకొండలోని విమానాశ్రయంపై రాష్ట్ర ప్రభుత్వం దృష్టి సారించడంతో జిల్లా కలెక్టర్ శ్రీమతి ఎ. తమీమ్ అన్సారియా, మంగళవారం దొనకొండలోని విమానాశ్రయ ప్రదేశాన్ని పరిశీలించి వివరాలు అడిగి తెలుసుకున్నారు.
విమానాశ్రయానికి ఎన్ని ఎకరాల భూమి అవసరం ఉంది, ఎంత భూమిని ప్రతిపాదించారు, అందులో ఏమైనా ఆక్రమణలు ఉన్నాయా అని జిల్లా కలెక్టర్, రెవెన్యూ అధికారులను స్వయంగా అడిగి తెలుసుకుని భూ రికార్డులు కూడా పరిశీలించారు. విమానాశ్రయానికి ప్రతిపాదించిన భూములకు సంబంధించిన వివరాలను మ్యాప్స్ ద్వారా ఆర్డీఓ జాన్ ఇర్విన్, జిల్లా కలెక్టర్ కు స్పష్టంగా వివరించారు. దొనకొండ విమానాశ్రయ పూర్తి సమాచారంను క్లుపంగా నివేదికను సిద్ధంచేసి అందజేయాలని జిల్లా కలెక్టర్, ఆర్డీవో ను ఆదేశించారు. ఇప్పటికే అక్కడ పాత విమానాశ్రయానికి సంబంధించి రన్ వె సహా కొన్ని ఏర్పాట్లు ఉన్నాయి. దానిని పూర్తి స్థాయిలో అభివృద్ధి చేస్తే మాత్రం జిల్లా దిశ మారినట్టే.