మహారాష్ట్రలో రాజకీయాలు ఆసక్తికరంగా మారిపోయాయి. ఎగ్జిట్ ఫలితాలు వచ్చినట్లుగానే మహారాష్ట్రలో ఎన్‌డీఏ నేతృత్వంలోని మహాయుతి కూటమి విజయం సాధించింది. 288 స్థానాలున్నా మహారాష్ట్రలో బీజేపీ కూటమి 224 స్థానాలను గెలుచుకుంది. కాంగ్రెస్ నేతృత్వంలోని మహ అగాఢీ కూటమి కేవలం 51 స్థానాలు మాత్రమే గెలుచుకుంది. దీంతో బీజేపీ నేతృత్వంలోని కూటమి ప్రభుత్వం ఏర్పాటు చేయనుంది. అయితే ఇక్కడే అసలు సమస్య ఎదురైంది. ఎన్నికల్లో బీజేపీ 129 స్థానాలు గెలవగా… సీఎం షిండే నేతృత్వంలోని శివసేన 55, ఎన్‌సీపీ అజిత్ పవార్ పార్టీ 40 స్థానాలో విజయం సాధించాయి. ఇక మహా అగాఢీ కూటమిలోని కాంగ్రెస్ 19, శివసేన ఠాక్రే 20, ఎన్‌సీపీ శరద్ పవార్ 12 స్థానాలతో సరిపెట్టుకున్నాయి. ఇంతవరకు బాగానే ఉన్నప్పటికీ… సీఎం కుర్చీ కోసం ఇప్పుడు మహాయుతి కూటమిలోని 3 పార్టీల నేతలు పట్టుబడుతున్నారు.
Also Read : రెడ్ బుక్ ప్రభావం… వారంతా సర్దేశారు..!
2019 ఎన్నికల్లో శివసేన, బీజేపీ కలిసి పోటీ చేసినప్పటికీ… కాంగ్రెస్, ఎన్‌సీపీతో కలిసి ఉద్ధవ్ ఠాక్రే ప్రభుత్వాన్ని ఏర్పాటు చేశారు. దీంతో శివసేనలోని కీలక నేత ఏక్‌నాథ్ షిండే బీజేపీతో చేతులు కలిపి ఠాక్రే ప్రభుత్వాన్ని కూల్చేశారు. దీంతో దాదాపు మూడేళ్లుగా షిండే సీఎం కుర్చీలోనే ఉన్నారు. అలాగే మాజీ సీఎం దేవేంద్ర ఫడ్నవీస్‌తో పాటు అజిత్ పవార్‌కు కూడా కీలక శాఖలు కేటాయించారు. అయితే ప్రస్తుతం బీజేపీ పూర్తి స్థాయి మెజారిటీ సాధించడంతో ఆ పార్టీ నేతలంతా ఫడ్నవీస్ ఇంట్లో భేటీ అయ్యారు. ఈసారి మాత్రం సీఎం కుర్చీ తమ పార్టీకే ఇవ్వాలని ఏకగ్రీవంగా తీర్మానం చేశారు. అలాగే సీఎంగా ఫడ్నవీస్ పేరును ముక్తకంఠంతో ప్రతిపాదించారు. దీంతో అటు సీఎం షిండే వర్గంతో పాటు అజిత్ పవార్ పార్టీ నేతలు కూడా అత్యవసరంగా సమావేశమయ్యారు.
Also Read : కంగారులను కంగారు పెట్టేసారు… చుక్కలు చూపించిన పేస్ త్రయం
సీఎంగా షిండే చేసిన అభివృద్ధి పనుల వల్లే మహా యుతి కూటమి గెలిచిందని… కాబట్టి షిండేను మాత్రమే సీఎంగా కొనసాగించాలని డిమాండ్ చేస్తున్నారు. మరోవైపు అజిత్ పవార్ పార్టీ నేతలు కూడా తమ డిమాండ్‌ను తెరపైకి తీసుకువచ్చారు. శరద్ పవార్ వంటి సీనియర్ నేతను కాదని వచ్చి మహా యుతితో జత కట్టిన అజిత్ పవార్‌కు ఈసారి తప్పనిసరిగా ముఖ్యమంత్రిగా అవకాశం ఇవ్వాలని డిమాండ్ చేస్తున్నారు. దీంతో సీఎం కుర్చీపై ఎవరు కూర్చుంటారనే విషయం ఇప్పుడు హాట్ టాపిక్‌గా మారింది. ఇదే సమయంలో ఎవరి వర్గం ఎమ్మెల్యేలతో ఆయా పార్టీల అగ్రనేతలు క్యాంపు రాజకీయాలు నిర్వహించేందుకు రెడీ అవుతున్నారు.