నేడు ఢిల్లీ వెళ్తున్న ఏపీ సిఎం చంద్రబాబు… పెద్ద ప్లాన్ తోనే ఢిల్లీ లో ల్యాండ్ అయ్యారా…? అంటే అవుననే సమాధానం వినపడుతోంది. ఈరోజు, రేపు ఢిల్లీలోనే ఉండనున్న సీఎం పలు కీలక సమావేశాలు నిర్వహించే సూచనలు కనపడుతున్నాయి. ఈ మధ్యాహ్నం 1.30 కి బేగంపేట్ ఎయిర్పోర్ట్ నుంచి ప్రత్యేక విమానం లో ఢిల్లీకి వెళ్లనున్నారు చంద్రబాబు. సాయంత్రం 4.30 కి ప్రధాని మోడీ తో భేటీ కానున్నారు. వరద ప్రభావిత ప్రాంతాల్లో తీవ్రంగా నష్టపోయిన నేపద్యంలో మరింత ఆర్థిక సాయం కోరడంతో పాటు… పలు కీలక అంశాలపై చర్చ జరగనుంది.
అమరావతి, పోలవరం కు నిధులు, ఇతర కీలక అంశాలకు సంబంధించి నివేదికలు కూడా సిద్దం చేసుకుని వెళ్తున్నారట ఢిల్లీ. రైల్వే శాఖా మంత్రి అశ్వనీ వైష్ణవ్ ను కలవనున్న సీఎం… రైల్వే జోన్ గురించి చర్చించే అవకాశం కనపడుతోంది. రైల్వే జోన్ శంకుస్థాపన, అమరావతికి రైల్వే కనెక్టివిటీ పై ముఖ్యమంత్రి చర్చిస్తారట. అమరావతికి రైల్వే స్టేషన్ పై ఈ సమావేశంలో చర్చ జరగనుంది. రేపు హోం మంత్రి అమిత్ షా, ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ తో పాటు మరికొందరు కేంద్ర మంత్రులను కలిసి రాష్ట్రానికి సంబందించిన కీలక ప్రాజెక్టుల గురించి చర్చిస్తారు.
ఇక చంద్రబాబు ఢిల్లీ పర్యటనలో పలువురు రాష్ట్ర మంత్రులు కూడా పాల్గొంటున్నారు. ముఖ్యమంత్రి చంద్రబాబుతో కలిసి ఆర్థిక శాఖా మంత్రి పయ్యావుల కేశవ్ వెళ్తున్నారు. ఇక నక్సల్స్ ప్రభావిత రాష్ట్రాల సమావేశంలో హోం మంత్రి అనిత పాల్గొంటారు. వైద్య ఆరోగ్యశాఖలోని పలు కేంద్ర ప్రాయోజిత పథకాల తో పాటు పలువురు కేంద్రమంత్రులను కలిసేందుకు ఈ ఉదయం వైద్య శాఖా మంత్రి సత్య కుమార్ ఢిల్లీ వెళ్ళారు. మంత్రులతో పాటు దేశ రాజధానికి పలువురు కార్యదర్శులు, ఉన్నతాధికారులు వెళ్ళడం ప్రాధాన్యత సంతరించుకుంది.