ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వానికి అన్ని రంగాల నుంచి మద్దతు లభిస్తోంది. నిన్నటి వరకు బాబోయ్ ఏపీ అని భయపడిన ప్రతి ఒక్కరు… ఇప్పుడు బిల్డ్ ఏపీ అని నినాదం చేస్తున్నారు. అదే సమయంలో సమాజిక చైతన్యం కలిగించేందుకు తమ వంతు కృషి చేస్తున్నారు. తాజాగా సోషల్ మీడియా వినియోగంపై ఏపీ సర్కార్ వినూత్న క్యాంపెయిన్ చేపట్టింది. “సోషల్ మీడియాను మన మంచి కోసం వాడుదాం.. చెడు పోస్ట్ చేయవద్దు.. అసత్య ప్రచారాలకు, దూషణలకు స్వస్థి పలుకుదాం” అంటూ ఏపీ సర్కార్ క్యాంపెయిన్ చేపట్టింది. దీనికి సంబంధించి ప్రత్యేక పోస్టర్ కూడా రూపొందించింది. ఏపీలో పలుచోట్ల ఈ పోస్టర్‌తో భారీ హోర్డింగ్‌ను సైతం ఏర్పాటు చేశారు. గాంధీ గారి మూడు కోతులతో పాటు నాలుగో కోతితో కలిపి ప్రత్యేక లోగో తయారు చేయించారు. ఓ చేతిలో మొబైల్ ఫోన్… మరో చేతిలో POST NO EVIL అనే స్లోగన్‌తో ఏపీ సర్కార్ ఈ పోస్ట్‌ను ప్రత్యేకంగా తయారు చేయించింది. ఈ పోస్ట్ ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.
Also Read : ఒక్క రోజే 2 వేల మందితో చంద్రబాబు.. కుటుంబానికి దూరంగా.. క్యాడర్ కు దగ్గరగా…!
ఏపీ సర్కార్ చేపట్టిన నో ఈవిల్ పోస్ట్‌కు భారీగా స్పందన వస్తోంది. సోషల్ మీడియాలో వచ్చే అసభ్య వ్యాఖ్యలు, ఫేక్ ప్రచారాలతో తీవ్ర ఇబ్బందులు పడిన స్టార్లు ఇప్పుడు తెరపైకి వస్తున్నారు. దయచేసి ఫేక్ ప్రచారం చేవద్దంటూ వీడియోలు రిలీజ్ చేశారు. మహిళలపై ఫేక్ ప్రచారం చేయడం ద్వారా వారు, వారి కుటుంబసభ్యులు ఎంతో మానసిక క్షోభకు గురవుతారంటూ సినీ హీరోలు నిఖిల్, అడవి శేషు, తేజ సజ్జాతో పాటు నటి శ్రీలీల కూడా వీడియో రిలీజ్ చేసింది. దయచేసి తప్పుడు పోస్టులు, కామెంట్లు చేవద్దని విజ్ఞప్తి చేశారు. ఏపీ సర్కార్ చేపట్టిన ఈ క్యాంపెయిన్‌ను ప్రతి ఒక్కరు ముందుకు తీసుకెళ్లాలంటూ పిలుపిచ్చారు. ప్రముఖ ఆధ్యాత్మిక ప్రవచన కర్త, ప్రభుత్వ సలహాదారు చాగంటి కోటేశ్వర్రావు కూడా ఈ విషయంపై స్పందించారు. మనం ఏది ఇస్తామో… అది తిరిగి మనకు వస్తుందన్నారు. ఈ రోజు తప్పుడు కామెంట్లు చేస్తే… అవే మనపై చేస్తారని హితవు పలికారు. అలా తప్పుడు వ్యాఖ్యలు మనపై వచ్చినప్పుడు ఎంత బాధ కలుగుతుందో… మనం చేసినప్పుడు కూడా అంతే బాధ ఎదుటి వారికి కూడా కలుగుతుందనే మాట గుర్తు పెట్టుకోవాలన్నారు. దీంతో ఈ వీడియోలు సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి.
Also Read : బీఆర్ఎస్ అధ్యక్షుడిగా కేటిఆర్..? కొత్త ఏడాది సంచలన మార్పులు…!
ఐదేళ్ల పాటు సోషల్ మీడియాను వైసీపీ నేతలు, కార్యకర్తలు ఇష్టం వచ్చినట్లు వాడారనేది వాస్తవం. అధికారంలో ఉన్న సమయంలో ప్రతిపక్షాలకు చెందిన నేతల కుటుంబ సభ్యులపై ఇష్టం వచ్చినట్లు వ్యాఖ్యలు చేశారు. చివరికి జగన్‌తో విభేదించిన సొంత చెల్లి షర్మిలపై కూడా అసభ్య పదాలతో రెచ్చిపోయారు. ఒకదశలో షర్మిల రాజశేఖర్ రెడ్డికి పుట్టలేదంటూ తల్లి విజయలక్ష్మిపై కూడా నోరు పారేసుకున్నారు. చంద్రబాబు, పవన్ కల్యాణ్, లోకేష్, పురందేశ్వరి… ఇలా చెప్పుకుంటూ పోతే ప్రతి ఒక్కరిపైనా, వారి కుటుంబ సభ్యులపైనా రెచ్చిపోయారు. దీంతో ఈ విషయాన్ని కూటమి ప్రభుత్వం సీరియస్‌గా తీసుకుంది. సోషల్ మీడియా సైకోలపై ఉక్కుపాదం మోపుతోంది. ఫేక్ న్యూస్, ట్రోలింగ్ చేసే వారిపై ఉక్కుపాదం మోపుతోంది. ఇప్పటికే వర్రా రవీందర్, ఇంటూరి రవికిరణ్ సహా దాదాపు 200 మందిపై కేసులు నమోదు చేశారు. దీంతో సోషల్ మీడియాలో ఫేక్ పోస్టులు పెట్టేందుకు కూడా భయపడుతున్నారు.