మన దేశంలో నిషేధానికి గురైన ప్రముఖ షార్ట్ వీడియో యాప్ టిక్ టాక్.. ఇప్పుడు అమెరికాకు తలనొప్పిగా మారింది. అమెరికా యూజర్ల భద్రతపై ఇప్పుడు అమెరికా ప్రభుత్వం ఆందోళన వ్యక్తం చేస్తోంది. తాజాగా దీనిపై అమెరికా సుప్రీం కోర్ట్ కీలక తీరు వెల్లడించింది. టిక్ టాక్ మాతృ సంస్థ… బైట్ డాన్స్ తన అమెరికా కార్యకలాపాలను.. తమ దేశంలోని ఏదైనా సంస్థకు విక్రయించకపోతే.. జాతీయ భద్రతా సమస్యలను దృష్టిలో ఉంచుకుని.. జనవరి 19, 2025 నుండి అమలులోకి వచ్చే టిక్ టాక్ నిషేధాన్ని సుప్రీం కోర్టు సమర్థించింది.
Also Read : రాజకీయాల్లోకి పీవీ సునీల్.. బిజెపి ప్రోత్సాహంతో కూటమి ప్రయాణం
డేటా భద్రత గురించి 2019 ప్రారంభంలోనే అమెరికాలో ఆందోళనలు తలెత్తాయి. చైనా ప్రభుత్వం అమెరికా యూజర్ల డేటాను యాక్సెస్ చేసే అవకాశం ఉందని లేదా తప్పుడు సమాచారాన్ని వ్యాప్తి చేయడానికి యాప్ లోని కంటెంట్ ను తారుమారు చేసే అవకాశం ఉందనే ఆందోళనలు వ్యక్తమయ్యాయి. 2020లో యాప్‌ను నిషేధించడం లేదా బైట్ డాన్స్ తమ యూఎస్ కార్యకలాపాలను విక్రయించాలని అప్పటి అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్ డిమాండ్ చేసారు. జో బిడెన్ 2021లో అధికారం చేపట్టిన తర్వాత ఈ ప్రయత్నాలు నిలిచిపోయినప్పటికీ.. ఈ యాప్ గురించి ఆందోళనలు కొనసాగాయి.
Also Read : జనాభా పెరగాలి.. నేషనల్ మీడియాలో చంద్రబాబు కామెంట్స్ వైరల్..!
ఏప్రిల్ 2024లో, అమెరికా అధ్యక్షుడు బిడెన్ బైట్ డాన్స్ టిక్‌టాక్.. అమెరికా కార్యకలాపాలను ఏడాది లోపు విక్రయించాలని, లేదంటే.. దేశవ్యాప్తంగా నిషేధాన్ని ఎదుర్కోవాలని రూపొందించిన చట్టంపై సంతకం చేశారు. టిక్ టాక్, బైట్ డాన్స్ మాత్రం ఈ విషయంలో వెనక్కు తగ్గలేదు. ఈ విషయంలో కోర్టుకు వెళ్ళాయి. అయితే ఫెడరల్ అప్పీల్ కోర్టు.. డిసెంబర్ 2024లో ఈ చట్టాన్ని సమర్థించింది. సుప్రీం కోర్ట్ కు వెళ్ళగా అక్కడ కూడా షాక్ తగిలింది. బైట్ డాన్స్ కు జనవరి 19 వరకు అవకాశం ఇచ్చారు. అయినా సరే బైట్ డాన్స్ మాత్రం విక్రయించడానికి ఇష్టపడలేదు. తాజాగా తీర్పు సందర్భంగా జాతీయ భద్రతకు ముప్పు ఉందనే విషయాన్ని అమెరికా సుప్రీం కోర్ట్ కూడా స్పష్టం చేసింది. దీనితో టిక్ టాక్ అమెరికాలో ఉంటుందా, బ్యాన్ చేస్తారా అనేది స్పష్టత రావడం లేదు.