భవిష్యత్తును అంచనా వేసి అందుకు తగ్గట్టుగా పనిచేయడంలో టిడిపి అధినేత ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు ముందు వరుసలో ఉంటారు. చాలామంది ముఖ్యమంత్రులకు ప్రభుత్వ అధినేతలకు చంద్రబాబునాయుడు ఎన్నో సందర్భాల్లో ఆదర్శంగా నిలిచారు. ఈ మధ్య కాలంలో జనాభా పెరుగుదల విషయంలో చంద్రబాబు నాయుడు చేస్తున్న కామెంట్స్ జాతీయ స్థాయిలో వైరల్ అవుతున్నాయి. తాజాగా చంద్రబాబు జనాభా పెరుగుదలపై కీలక వ్యాఖ్యలు చేశారు. కనీసం ఇద్దరు పిల్లలు ఉంటేనే స్థానిక సంస్థల ఎన్నికల్లో పోటీకి అర్హత కల్పిస్తూ చట్టం తీసుకొస్తామని స్పష్టం చేశారు.
Also Read : రాజకీయాల్లోకి పీవీ సునీల్.. బిజెపి ప్రోత్సాహంతో కూటమి ప్రయాణం
ఇకపై ఏ పథకం అమలు చేయాలన్నా సరే కుటుంబ పరిమాణాన్ని ప్రామాణికంగా తీసుకుంటామని తెలిపారు. జనాభా ఒకప్పుడు భారంగా మారిందని ఇప్పుడు ఆస్తి అంటూ స్పష్టం చేశారు. ఇదివరకు జనాభా నియంత్రణకు ప్రోత్సాహకాలు ఇచ్చే వాళ్ళమని ఐదుగురు సభ్యులు ఉన్న కుటుంబానికి 25 కిలోల బియ్యం ఇచ్చే వాళ్ళమని కుటుంబ సభ్యుల సంఖ్య అంతకంటే ఎక్కువగా ఉన్నా సరే అంతకుమించి ఇచ్చేవాళ్లం కాదని తెలిపారు. ఇద్దరు కంటే ఎక్కువ మంది పిల్లలు ఉంటే ఎన్నికల్లో పోటీకి అనర్హులు చేస్తూ చట్టం తీసుకొచ్చామన్నారు.
అది అప్పటి పరిస్థితి… కానీ ఇప్పుడు జనాభా కావాలని ఇప్పుడు కనీసం ఇద్దరు పిల్లలు ఉంటేనే పోటీకి అర్హత కల్పిస్తామని స్పష్టం చేశారు. 2026లో రాష్ట్ర జనాభా 5.38 కోట్లు ఉంటుందని చంద్రబాబు అంచనా వేశారు 2031లో అది 5. 42 కోట్లకు చేరుతుందని 2036లో 5.44 కోట్లకు చేరుతుందని చంద్రబాబు వివరించారు. 2041లో జనాభా తగ్గుతూ 5.42 కోట్లకు పడిపోతుందని అక్కడినుంచి తగ్గుముఖం పడుతూ 2051 నాటికి 5.4 కోట్లకు చేరుతుందని చంద్రబాబు పేర్కొన్నారు. రాష్ట్రంలో 2026 లో ఒక జంటకు సగటున 1.51 మందికి జన్మిస్తే.. 2051 నాటికి టోటల్ ఫెర్టిలిటీ రేట్ 1.07 శాతానికి తగ్గిపోతుందని అంచనాలు చెబుతున్నాయన్నారు.
Also Read : కొల్లేరు ప్రక్షాళన సాధ్యమేనా..?
ఇది చాలా ప్రమాదకరమని… ఒక జంటకు సగటున ఇద్దరు పిల్లలు ఉండాల్సిందేనని స్పష్టం చేశారు. జనాభా అనే ఆస్తి కావాలన్నారు. సంపద సృష్టిస్తున్నామంటూ జనాభాను మర్చిపోతే ఆ సంపద ఎవరికి ఇవ్వాలో తెలియదు అన్నారు. భవిష్యత్తులో పెద్దపెద్ద విమానాశ్రయాలు విశాలమైన రహదారులు ఉంటాయని కానీ వాటిని ఉపయోగించుకునే మనుషులే ఉండరన్నారు. ఇప్పుడు ఈ కామెంట్స్ జాతీయ మీడియాలో వైరల్ అవుతున్నాయి. నేషనల్ మీం పేజెస్ కూడా ఈ కామెంట్స్ ను వైరల్ చేస్తున్నాయి. సాక్షాత్తు ఒక ముఖ్యమంత్రి కామెంట్స్ చేయడం.. అది కూడా చంద్రబాబు లాంటి నేత చేయడంతో అనలిస్టులు కూడా వాటిని షేర్ చేస్తున్నారు.