ఏపీ ప్రజల జీవనాడిగా పేరుగాంచిన పోలవరం ప్రాజెక్టు నిర్వాసితులకు ఆర్‌అండ్‌ఆర్ కింద నష్టపరిహారం చెల్లింపు ఇప్పుడు తెలుగుదేశంలో అగ్గి రేపుతుంది. సంబంధిత మంత్రికి కూడా తెలియకుండా ఏకంగా రూ.830 కోట్లు నిర్వాసితుల అకౌంట్లలో జమచేయడం మంచిదే అయినప్పటికీ, కనీసం ఆ అంశాన్ని ప్రచారం చేసుకోవడంలో విఫలం అయ్యామని తెలుగుదేశం నేతలు ఆగ్రహంగా ఉన్నారు.
పోలవరం ప్రాజెక్టును పూర్తి చేయాలని తెలుగుదేశం అధినేత, సీఎం చంద్రబాబుతో పాటు, కూటమి ప్రభుత్వంలోని పక్షాలన్నీ కృతనిశ్చయంతో ఉన్నాయి. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత మళ్లీ పోలవరంపై దృష్టి సారించింది. కేంద్ర ప్రభుత్వం కూడా బడ్జెట్లో పోలవరం ప్రాజెక్టును తామే పూర్తి చేస్తామని ప్రకటించింది. పోలవరానికి కావాల్సిన నిధులను కూడా తామే విడుదల చేస్తామని కేంద్రం తెలిపింది. రాష్ట్ర ప్రభుత్వం, పోలవరం అథారిటీ కూడా నిధులు విడుదల చేయడం ప్రారంభించింది. ప్రాజెక్టు వల్ల ముంపునకు గురయ్యే గ్రామాలలో నిర్వాసితులకు ఆర్ అండ్ ఆర్ కింద పునరావాసం, నష్టపరిహారం కోసం ప్యాకేజీలను ప్రకటించారు. జగన్ ప్రభుత్వ హయాంలో పెంచి ఇస్తామన్న ప్యాకేజీలు ఇవ్వలేక పోయారు. అది ఉత్తుత్తిదే అని తేలిపోయింది.
Also Read: తురగా కిషోర్ బెండు తీస్తారా..?
2017లో చంద్రబాబు ప్రభుత్వం ఇచ్చిన నష్ట పరిహారం మినహా ఆ తర్వాత చిల్లి గవ్వ కూడా నిర్వాసితులకు అందలేదు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత వీటిపై దృష్టి పెట్టింది. అయితే అంతా బాగానే ఉంది కాని.. శుక్రవారం అకస్మాత్తుగా ఎవరికీ తెలియకుండా ఆర్థిక శాఖ అధికారులు నిర్వాసితుల ఖాతాల్లో రూ.830 కోట్లు జమ చేశారు. నిర్వాసితులకు నష్ట పరిహారం ఇవ్వడాన్ని అందరూ స్వాగతిస్తున్నప్పటికీ కనీసం ఈ కార్యక్రమానికి తగిన ప్రచారం లేకపోవడం పైనే ఇప్పుడు తెలుగుదేశం నేతలు విరుచుకుపడుతున్నారు. ప్రభుత్వంలో సమన్వయం లేదు అనడానికి ఇది ఒక ఉదాహరణ అని పార్టీలో ఒక సీనియర్ నేత ఆరోపించారు. శనివారం మీడియాలో వార్త చూసిన తర్వాత మంత్రి నారా లోకేష్ పేషీ ఈ అంశంపై ఆరా తీసింది.
వెంటనే జలవనరులశాఖ మంత్రి నిమ్మల రామానాయుడికి ఫోన్ చేసి అసలు ఏం జరుగుతుందని ప్రశ్నించింది. నిధులు విడుదల చేస్తున్న సమాచారాన్ని ముఖ్యమంత్రి కార్యాలయం, లోకేష్ కార్యాలయానికి ఎందుకు తెలియ చేయలేక పోయారని మంత్రి నిమ్మల రామానాయుడిని నిలదీశారు. శుక్రవారం రాత్రి తమ ఖాతాల్లో నష్ట పరిహారం డబ్బులు జమ అయ్యాయని, నిర్వాసితులు తమకు ఫోన్ చేసి చెప్పే వరకు ఆ విషయం తనకు తెలియదని, నిమ్మల రామానాయుడు.. లోకేష్ పేషీకి సమాచారం అందించారు. దీంతో లోకేష్ పేషీ అధికారులు మరింత షాక్ అయ్యారు. ముఖ్యమంత్రి కార్యాలయానికి ఒక ప్రత్యేక నోట్ కూడా పంపారు.
Also Read: చంద్రబాబు వ్యాఖ్యలపై కేడర్ అసంతృప్తి..!
ఇంటర్మీడియట్ విద్యార్థులకు మధ్యాహ్నం భోజనం పెడుతూ పెద్ద ఎత్తున తాము ప్రచారం చేస్తున్నామని, అన్ని జిల్లాల్లో, నియోజకవర్గాలలో ఈ కార్యక్రమాన్ని ప్రారంభించామని, కానీ రూ.830 కోట్లు నిర్వాసితులకు విడుదల చేసే సమయంలో కనీసం సంబంధిత మంత్రికి కూడా తెలియజేయకుండా అధికారులు విడుదల చేయడంపై లోకేష్ సీరియస్ అయ్యారు. జగన్ ప్రభుత్వంలో ఈ మొత్తం సొమ్ము సిద్ధంగా ఉన్నప్పటికీ నాలుగు విడుతలుగా విడుదల చేసి విపరీతమైన ప్రచారం చేసుకునేవారని, ఇక్కడ నిర్వాసితులకు ఇంత డబ్బు ఇచ్చి కనీసం తెలియచేయకపోవడంపై మండిపడ్డారు. నిర్వాసితుల అకౌంట్లో డబ్బులు జమ అయిన తర్వాత తాపీగా ఆర్థిక మంత్రి పయ్యావుల కేశవ్ మీడియా ముందుకు వచ్చి విషయాన్ని వెల్లడించారు.
పోలవరం నిర్వాసితుల కష్టాలను సీఎం స్వయంగా చూశారని, అందువల్లే ఎన్ని ఆర్థిక కష్టాలు ఉన్నా, నష్ట పరిహారం విడుదల చేశామన్నారు. జగన్ ప్రభుత్వ హయాంలో చేయని పనులు తాము అధికారంలోకి వచ్చిన వెంటనే చేస్తున్నామని, అందువల్లే వెంటనే నష్ట పరిహారం విడుదల చేశామని చెప్పారు. 9 వేల మంది పోలవరం నిర్వాసితులకు దాదాపు రూ.వెయ్యి కోట్లు ఇచ్చినట్లు కేశవ్ వివరించారు. ఈ వ్యవహారం హైదరాబాద్‌లో ఉన్న ముఖ్యమంత్రి చంద్రబాబు వరకూ చేరింది. జరిగిన పరిణామాలను నిశితంగా గమనించిన ముఖ్యమంత్రి… అధికారులు ఇలా చేయడం పై ఆగ్రహం వ్యక్తం చేసినట్లు తెలిసింది.
Also Read: సజ్జలపై పవన్ గురి.. అడ్డంగా దొరికాడా..?
రాష్ట్రంలో ఎవరు పరిపాలన చేస్తున్నారో అర్థం కావడం లేదని, ఆర్థిక శాఖలో అధికారులు ఇష్టారాజ్యంగా వ్యవహరిస్తున్నారని ఒక సీనియర్ నేత ఆవేదన వ్యక్తం చేశారు. నిధులు లేవని చెబుతున్న అధికారులు.. ఇష్టం వచ్చినట్లుగా ఎలా విడుదల చేస్తారని ప్రశ్నిస్తున్నారు. ముఖ్యమంత్రిని కూడా నిధులు లేవనే ట్రాప్‌లోకి తీసుకు వెళుతున్నారని మండిపడుతున్నారు. ఇచ్చిన హామీలను కూడా నెరవేర్చకపోతే వైసీపీకి ఎదురైన పరాభవమే మనకూ ఎదురవుతుందని, అధికారులను నమ్మి పొలిటికల్ గవర్నెన్స్ విస్మరిస్తే దెబ్బ తినడం ఖాయమని మరో ఎమ్మెల్యే వ్యాఖ్యానించారు.