దేశ రాజధాని ఢిల్లీలో ఎన్నికల ప్రచారం ఊపందుకుంది. ఇప్పటికే పథకాల ప్రకటనతో ఆప్ చీఫ్ అరవింద్ కేజ్రీవాల్ దూకుడు ప్రదర్శిస్తుండగా.. తాజాగా ప్రధాని మోదీ కూడా ప్రారంభోత్సవాలతో ఓటర్లను ఆకట్టుకునే ప్రయత్నం చేస్తున్నారు. ఇదే సమయంలో పరస్పరం ఆరోపణలు చేసుకున్నారు మోదీ, కేజ్రీవాల్.
దేశ రాజధాని ఢిల్లీలో అసెంబ్లీ ఎన్నికలు సమీపిస్తున్న వేళ రాజకీయ విమర్శలు ఊపందుకున్నాయి. ఇప్పటికే మాజీ ముఖ్యమంత్రి, ఆప్ చీఫ్ అరవింద్ కేజ్రీవాల్ ఎన్నికల ప్రచారం ప్రారంభించారు. అభ్యర్థుల ప్రకటనతో పాటు ఓటర్లను ఆకట్టుకునేందుకు పథకాలను కూడా ప్రకటిస్తున్నారు. దీంతో బీజేపీ అగ్రనేతలు కూడా ఢిల్లీని సొంతం చేసుకునేందుకు రంగంలోకి దిగారు. తాజాగా ప్రధాని నరేంద్ర మోదీ ఢిల్లీలో పర్యటించారు. పలు అభివృద్ధి కార్యక్రమాలు ప్రారంభించారు.
Also Read : టీడీపీలో సీనియర్లకు గుర్తింపు ఏదీ..?
ఢిల్లీ డెవలప్‌మెంట్ అథారిటీ ఆధ్వర్యంలో నిర్మించిన పలు నివాస సముదాయాలను మోదీ ప్రారంభించారు. అనంతరం అశోక్ విహార్ రామ్‌లీలా గ్రౌండ్స్‌లో ఏర్పాటు చేసిన బహిరంగ సభలో మోదీ పాల్గొన్నారు. ఆర్థిక సుస్థిరతకు భారత్ నిదర్శనంగా నిలిచిందని మోదీ సూచించారు. అలాగే 2025లో ప్రపంచ దేశాల్లో భారత్ స్థానం మరింత బలపడుతుందన్నారు మోదీ. ప్రపంచంలోనే అతిపెద్ద మ్యాన్యుఫ్యాక్చరింగ్ కేంద్రాల్లో ఒకటిగా భారత్ నిలుస్తుందని మోదీ ఆశాభావం వ్యక్తం చేశారు.
ఇదే సమయంలో ఢిల్లీ ప్రభుత్వంపైన, మాజీ సీఎం అరవింద్ కేజ్రీవాల్‌పైన మోదీ ఘాటు వ్యాఖ్యాలు చేశారు. దేశ రాజధానిలో 4 కోట్ల మంది ప్రజలకు నివాస గృహాలు కల్పించడం ద్వారా సొంతింటి కల సాకారం చేశామన్నారు. తన కోసం ఒక్క ఇల్లు కూడా కట్టుకోలేదని… కావాలంటే తాను కూడా శీష్ మహల్ కట్టగలనంటూ పరోక్షంగా కేజ్రీవాల్‌పై విమర్శలు చేశారు. అధికార పార్టీని విపత్తుగా ప్రస్తావించారు మోదీ. ప్రజలకు సౌకర్యాలు కల్పించడంలో ఆప్ సర్కార్ విఫలమైందని మోదీ విమర్శించారు.
Also Read : ఫినిష్ చేసేద్దాం.. నిర్మాతలకు పవన్ గుడ్ న్యూస్
ప్రధాని మోదీ వ్యాఖ్యలకు మాజీ సీఎం అరవింద్ కేజ్రీవాల్ ఘాటుగా బదులిచ్చారు. కేవలం తమను తిట్టడానికి మాత్రమే మోదీ సభ నిర్వహించారన్నారు కేజ్రీవాల్. పదేళ్లుగా ఆప్ సర్కార్ చేసిన అభివృద్ధి వివరించాలంటే కనీసం 3 గంటలు పడుతుందన్నారు. అన్ని రంగాల్లో ఢిల్లీని అభివృద్ధి చేశామన్నారు. కానీ కేంద్రంలో ఉన్న బీజేపీ సర్కార్ మాత్రం పదేళ్లల్లో ఢిల్లీ వాసుల కోసం ఏం చేయలేదన్నారు. పదేళ్లు పని చేసి ఉంటే.. ఇప్పుడు ఇన్ని మాటలు అనాల్సిన అవసరం లేదన్నారు.
పరస్పర ఆరోపణలతో ఢిల్లీ రాజకీయాలు వేడెక్కాయి. సొంతింటి కల సాకారం చేశామని ప్రధాని మోదీ చెప్పగా… పదేళ్లలో ఢిల్లీ వాసుల కోసం చేసిందేమి లేదన్నారు అరవింద్ కేజ్రీవాల్. మరోవైపు ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ ఢిల్లీ అధ్యక్షుడు వీరేంద్ర సచ్‌దేవ పోటీకి దూరంగా ఉంటున్నట్లు తెలుస్తోంది. ఈ ఏడాది ఫిబ్రవరిలో అసెంబ్లీ ఎన్నికలు జరగనున్నాయి. అభ్యర్థుల జాబితాను ఆప్ ఇప్పటికే ప్రకటించగా… బీజేపీ మాత్రం ఇప్పటి వరకు ఒక్క జాబితా కూడా విడుదల చేయలేదు. ఢిల్లీలో ఓటర్లకు బీజేపీ నగదు పంపిణీ చేస్తోందని కేజ్రీవాల్ ఆరోపిస్తున్నారు. ఈ విషయంపై ఆర్‌ఎస్‌ఎస్ అధ్యక్షుడు మోహన్ భగవత్‌కు లేఖ కూడా రాశారు.




