ఆంధ్రప్రదేశ్‌లో ప్రముఖ పుణ్యక్షేత్రమైన విజయవాడ దుర్గగుడి అవినీతికి కేరాఫ్ అడ్రస్‌గా మారింది. ముఖ్యంగా టెండర్ల కేటాయింపులు, కాంట్రాక్టర్లకు చెల్లింపుల వంటి అంశాల్లో విజయవాడలోని ఇంద్రకీలాద్రిపై కొలువుదీరిన కనకదుర్గమ్మ ఆలయంలో ఎప్పుడూ ఏదో ఒక వివాదం నడుస్తూనే ఉంటుంది. తాజాగా, సోషల్ మీడియాలో వీరి వివాదం వైరల్‌గా మారిపోయింది.
దుర్గామల్లేశ్వరస్వామి దేవస్థానంలో సెక్యూరిటీ టెండర్ వ్యవహారం వివాదాస్పదమైంది. ఫిబ్రవరిలో టెండర్లు పిలిచిన దేవస్థానం అధికారులు రెండు నెలల పాటు జాప్యం చేసి, బ్లాక్‌లిస్టులో ఉన్న సంస్థకు టెండర్లు కట్టబెట్టారన్న విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. దుర్గగుడిపై ఆయన చెప్పిందే వేదంగా మారిపోయింది. ఆయన మాట వినకుంటే అధికారులు, సిబ్బందిపై తప్పుడు ఫిర్యాదులు చేయిస్తారు. తన మాట కాదని ఎవరైనా టెండర్లు వేస్తే వారిని బెదిరిస్తారు. తాజాగా అన్నదాన విభాగంలో టెండర్లు జరిగాయి. ఎల్1గా వచ్చిన కాంట్రాక్టర్ మహేష్ బాబును పక్కన పెట్టేసి, ఎల్ 2గా ఉన్న రవి తనకు టెండర్ ఇవ్వాలంటూ అధికారులపై తీవ్ర స్థాయిలో ఒత్తిడి తెస్తున్నారన్న విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. దేవదాయ శాఖ కమిషనరేట్‌లో తన మాటకు తిరుగులేదని, తన దారికి అడ్డు వస్తే ఇబ్బందులు తప్పవని, కాంట్రాక్టు వదిలి వెళ్లిపోవాలని ఎల్ 1గా వచ్చిన మహేష్ బాబు అనే కాంట్రాక్టర్‌ను బెదిరిస్తున్నారని ఆ కాంట్రాక్టరే స్వయంగా ఆరోపిస్తున్నారు.
Also Read : పోలవరం ప్రాజెక్టు సురక్షితమేనా…?
శ్రీదుర్గా మల్లేశ్వరస్వామి దేవస్థాన ఉచిత అన్న దాన పథకంలో క్లీనింగ్ సర్వింగ్ కాంట్రాక్టును కొన్నేళ్లుగా రవి అనే కాంట్రాక్టర్ నిర్వహిస్తున్నారు. అధికారులను ప్రలోభ పెట్టడం లేదా బెదిరించడం ద్వారా… ఈయనే ఈ కాంట్రాక్టును దక్కించుకుంటున్నారే వార్తలు వెల్లువెత్తుతున్నాయి. సుమారు రెండేళ్ల క్రితం ఓ భక్తుడు ఇచ్చిన ఫిర్యాదు మేరకు దేవస్థానం ఉన్నతాధికారులు అంతర్గత విచారణ జరిపించి అన్నదాన విభాగంలో అక్రమాలు జరిగినట్లు నిగ్గుతేల్చారు. దీనికి బాధ్యులను చేస్తూ అన్న ప్రసాద విభాగాన్ని పర్యవేక్షించే ఏఈవో అమృతరావు, సూపరింటెండెంట్ హేమ, గుమస్తా ప్రసాద్‌కు షోకాజ్ నోటీసులు జారీ చేశారు. అసలు సూత్రధారి అయిన కాంట్రాక్టరుపై మాత్రం ఎలాంటి చర్యలు తీసుకోలేదు. కేవలం 3వేల మంది అన్న ప్రసాదం స్వీకరిస్తుంటే… సదరు కాంట్రాక్టర్ మాత్రం అధికారులను ప్రలోభపెట్టి రికారుల్లో రెట్టింపు సంఖ్యలో భోజనాలు చేసినట్లు చూపుతున్నారని విచారణలో రుజువైంది. అంతే కాదు.. సదరు కాంట్రాక్టర్ తన వద్ద పనిచేసే సిబ్బందికి ఈఎస్ఐ, పీఎఫ్ కట్టకపోవడంతో వారు ఈ విషయాన్ని దుర్గ గుడి ఉన్నతాధికారులకు ఫిర్యాదు చేశారు. విచారణ జరిపిన అధికారులు వాస్తవమేనని నిర్ధారించి కాంట్రాక్టర్‌ను బ్లాక్ లిస్టులో పెట్టారు. బ్లాక్ లిస్టులో పెట్టాక కూడా హైదరాబాద్‌కు చెందిన సంస్థకు బినామీగా అవతారమెత్తిన సదరు కాంట్రాక్టర్ 2022లో మళ్లీ అన్నదానం టెండరు దక్కించుకున్నాడు.
ఈ ఏడాది నవంబరు 14తో కాంట్రాక్టు గడువు ముగియడంతో దుర్గగుడి అధికారులు మళ్లీ టెండర్ పిలిచారు. ఈ టెండర్లలో ఎల్ వన్‌గా ఎల్డీ ఏజెన్సీ నిలిచింది. ఇదే సమయంలో గతంలో కాంట్రాక్టు దక్షించుకున్న రవి వచ్చాడు. ఎలాగైనా టెండరు దప్పించుకోవాలనే ఉద్దేశంతో ఎల్ వన్‌గా వచ్చిన కాంట్రాక్టరుపై ఉన్నతాధికారులకు ఫిర్యాదులు చేయడంతో పాటు సదరు కాంట్రాక్టర్‌ను బెదిరిస్తున్నారనేది ప్రధాన ఆరోపణ. ఇంద్రకీలాద్రిపై ప్రతిసారి టెండర్ల వివాదం చెలరేగడంపై ఆలయ ఈవో కె ఎస్ రామారావు దేవాదాయ శాఖ కమిషనర్‌కు ఫిర్యాదు చేశారు. ప్రస్తుతం నవంబర్ 15వ తేదీ నుంచి దేవస్థానం తరఫు నుంచే అన్న ప్రసాదం నిర్వహిస్తున్నారు. టెండర్లు లేకుండా దేవస్థానమే భక్తులకు భోజనం పెట్టే విధంగా చర్యలు తీసుకుంటామని కమిషనర్‌కు ఈవో లేఖ రాశారు కూడా. శుక్ర, శని, ఆదివారాల్లో రోజుకు ఐదు వేల నుంచి ఆరు వేల మంది వరకు అన్న ప్రసాదం తింటారని, భక్తులకు రుచికరమైన భోజనం అందించేందుకు పూర్తిస్థాయిలో చర్యలు చేపడుతున్నట్లు ఈవో తెలిపారు.
Also Read : ఆ ఇద్దరికీ చంద్రబాబు ఇచ్చే పదవులేంటి…?
దాదాపు మూడేళ్లుగా ఇంద్రకీలాద్రిపై సెక్యూరిటీ బాధ్యతలు నిర్వహిస్తున్న మ్యాక్స్ సంస్థ కాంట్రాక్టు గడువు ముగిసింది. దీంతో దుర్గగుడి అధికారులు ఫిబ్రవరిలోనే సెక్యూరిటీ టెండర్లు ఆహ్వానించారు. ప్రధాన ఆలయం, ఉపాలయాలు, కొండ దిగువన టోల్ గేటు, ప్రసాదం పోటు, క్యాష్ కౌంటర్లు, ఈవో కార్యాలయం, పార్కింగ్, అన్న ప్రసాదం తదితర ప్రాంతాల్లో అవసరమైన సెక్యూరిటీ గార్డులు, సూపర్ వైజర్లను ఏర్పాటుచేసి పటిష్టమైన భద్రత కల్పించేందుకు ప్రైవేట్ సెక్యూరిటీ సంస్థల నుంచి టెండర్లు ఆహ్వానించారు. ఈ ప్రక్రియలో పాల్గొన్న ఎజైల్, మ్యాక్స్, ర్యాపిడ్ సెక్యూరిటీ సంస్థలు ఒకేలా బిడ్ అమౌంట్‌ను కోట్ చేశాయి. దీంతో టెండరును ఖరారు చేసే విషయంలో మరో వివాదం చోటుచేసుకుంది. ఈ విషయాన్ని అప్పటి దుర్గగుడి ఈవో భ్రమరాంబ లేఖ ద్వారా దేవదాయ శాఖ కమిషనర్ దృష్టికి తీసుకెళ్లారు. నిబంధనల ప్రకారం జీఎస్టీ టర్నోవర్ ఎక్కువ ఉన్న సంస్థకు టెండరు ఖరారు చేయాలని కమిషనర్ ఆదేశించారు. దీంతో దుర్గగుడి అధికారులు ఒకే రేటు కోట్ చేసిన మూడు సంస్థలకు చెందిన టర్నోవర్ వివరాలను సేకరించారు. హైదరాబాద్‌కు చెందిన ఎజైల్ సెక్యూరిటీ ఫోర్స్ ప్రైవేట్ లిమిటెడ్ సంస్థకు ఎక్కువ టర్నోవర్ ఉన్నట్టు కమిషనర్‌కు నివేదించారు. దాదాపు మూడు నెలలుగా ఈ ప్రక్రియ కమిషనర్ కార్యాలయంలో పెండింగ్‌లో ఉండిపోయింది. దీంతో మ్యాక్స్ సెక్యూరిటీ సంస్థ, అంతకుముందు కొండపై సెక్యూరిటీ బాధ్యతలు నిర్వహించిన ఎజైల్ సెక్యూరిటీ సంస్థ టెండర్ కోసం పోటీ పడ్డాయి. ఫలానా సంస్థకే టెండర్ కట్టబెట్టాలంటూ అధికారులపై తీవ్రస్థాయిలో రాజకీయ ఒత్తిళ్లు వచ్చాయి. ఈ నేపథ్యంలోనే నిబంధనల ప్రకారం సెక్యూరిటీ టెండరును ఖరారు చేయకుండా కమిషనర్ కార్యాలయంలోని ఓ ఉన్నతాధికారి చక్రం తిప్పుతున్నారంటూ ఆరోపణలు వెల్లువెత్తాయి. దీనిపై పత్రికల్లో కథనాలు వెలువడటంతో దేవదాయ శాఖ కమిషనర్ స్పందించారు. జీఎస్టీ టర్నోవర్ ఎక్కువ ఉన్న ఎజైల్ సంస్థకు టెండరు ఖరారు చేస్తూ ఉత్తర్వులు జారీ చేశారు. కమిషనర్ ఉత్తర్వులివ్వడమే ఆలస్యం.. అదే రోజు ఈవో భ్రమరాంబ ఎజైల్ సంస్థకు వర్క్ ఆర్డర్ ఇచ్చేయడం, మరుసటి రోజు ఉదయం నుంచే ఆలయంలో సెక్యూరిటీ బాధ్యతలను చేపట్టడం చకచకా జరిగిపోయాయి. రాత్రికిరాత్రే అమ్మవారి ఆలయంలో సెక్యూరిటీ యాజమాన్యం మారిపోవడంతో ఇంద్రకీలాద్రి వర్గాలు సైతం ఆశ్చర్యానికి గురయ్యాయి.
విజయవాడలోని ఇంద్రకీలాద్రిపై కొలువుదీరిన కనకదుర్గమ్మ తల్లి ఆలయంలో రోజురోజుకీ కమర్షియాలిటీ పెరుగుతుంది. సాధారణంగా గుడికి వెళ్లే భక్తులు కొబ్బరికాయలు కొనుక్కుని తీసుకెళ్లడం సహజం. అయితే ఆ కొబ్బరికాయలు కొనడానికే కాదు.. కొట్టడానికి కూడా డబ్బులు చెల్లించాల్సిందే. ఇప్పుడు దుర్గగుడిలో చెలరేగిన వివాదం ఇదే. చేతిలో రూ.20 పెట్టు.. కొబ్బరికాయ కొట్టు. ఇదీ అక్కడి కొబ్బరికాయల కాంట్రాక్టర్ సిబ్బంది తీరు. నిత్యం రద్దీగా ఉండే ఆలయాల్లో భక్తులు స్వామి, అమ్మవార్లకు సమర్పించే కొబ్బరికాయలను కాంట్రాక్టర్లు వేలం పాడుకుంటారు. అలా దుర్గగుడిలో వారానికి లక్షా ఎనిమిది వేల రూపాయలకు టెండర్ పాడుకున్న ఆ కాంట్రాక్టర్.. అమ్మవారికి తెచ్చిన కొబ్బరికాయలు కొట్టాలంటే రూ.20 ఇవ్వాల్సిందేనని డిమాండ్ చేస్తుండటం వివాదానికి దారి తీసింది. ఈ వ్యవహారంపై గుడిలోని అధికారులకు ఫిర్యాదు చేసినా పట్టించుకోవడం లేదని ఆరోపణలు వస్తున్నాయి. ఈ వార్త సోషల్ మీడియాలో వైరల్ కావడంతో.. నెటిజన్లు సైతం ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. కొబ్బరికాయ కొట్టడానికి డబ్బులు ఎందుకు చెల్లించాలి…? అంటూ ఫైర్ అవుతున్నారు. అసలు కొబ్బరికాయలు కొట్టేందుకు అక్కడ సిబ్బంది ఉండాల్సిన పనేముంది. భక్తులే స్వయంగా కొట్టుకుంటారు కదా.
కొన్నిచోట్ల కొబ్బరికాయలు కొట్టేందుకు సిబ్బంది ఉన్నా.. ఎంతోకంత చిల్లర అడుగుతారు కానీ.. ఇలా రూ.20 ఇవ్వాలని డిమాండ్ చేయడమేంటని ప్రశ్నిస్తున్నారు.
Also Read : ప్రభుత్వానికి కొత్త చిక్కుగా సరస్వతి వ్యవహారం…!
అంతేకాదు గతంలో ఫోటోల కాన్సెప్ట్ అంశంపై కూడా వివాదం కొనసాగింది. ఈ అంశం కోర్టులో ఉండగానే అధికారులు టెండర్ నోటిఫికేషన్ ఇవ్వడం గొడవకు పునాదులు పడ్డాయి. సెక్యూరిటీ టెండర్ల మాదిరిగా నిబంధనలకు విరుద్ధంగా.. చీరల టెండర్లు, శానిటరీ టెండర్లు, లైటింగ్ టెండర్లు ప్రతి ఒక్కటి వివాదస్పదంగా మారాయి. ఇలా చెప్పుకుంటూ పోతే ఆలయంలో వివాదాలు ఎన్నో. అసలు అమ్మవారి ఆలయంలో టెండర్ల విధానం తీసేసి దేవస్థానమే వాటి బాధ్యతలను తీసుకొని ఉద్యోగస్తులను నియమిస్తే వివాదాలు తగ్గుతాయని భక్తులు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు.