వైసీపీ అధినేత వైఎస్ జగన్ మోహన రెడ్డికి ఏమైంది. అసలు ఎందుకు మార్చారు.. మళ్లీ వాళ్లనే తిరిగి ఎందుకు పంపుతున్నారు.. ఇప్పుడు ఇదే ప్రశ్న వైసీపీ నేతలను కూడా కలవరపరుస్తోంది. 2019 ఎన్నికల్లో 151 స్థానాల్లో గెలిచింది వైసీపీ. అయితే ఆ గెలుపు కేవలం తన వల్లే వచ్చింది అనేది తొలి నుంచి జగన్‌లో ఉన్న భావన. తన పాదయాత్ర వల్లే వైసీపీ గెలిచిందని… అంతే తప్ప స్థానిక నేతల ప్రభావం కేవలం 20 శాతం లోపే అనేది జగన్ మాట కూడా. అందుకే 2024 ఎన్నికల్లో తనకు ఇష్టం వచ్చినట్లు వ్యవహరించారు జగన్. తన ప్రభుత్వం అమలు చేసిన సంక్షేమ పథకాలను చూసే ప్రజలు ఓట్లు వేస్తారు తప్ప… స్థానిక నేతలను చూసి కాదని బలంగా నమ్మాడు జగన్.
Also read : ఆ తప్పంతా జగన్ దే.. బాలినేని సంచలన ఆరోపణలు
అందుకే పట్టభద్రుల నియోజకవర్గం ఎమ్మెల్సీ ఎన్నికల్లో వైసీపీ ఓడినప్పటికీ.. తమ ఓటర్లు వేరే ఉన్నారని నాటి ప్రభుత్వ ప్రధాన సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి ధీమా వ్యక్తం చేశారు. గత ఎన్నికల్లో ఐ ప్యాక్ టీమ్ సర్వే రిపోర్టు వేదం అన్నట్లుగా భావించిన జగన్… నియోజకవర్గాలకు సిట్టింగ్‌లకు బదులుగా కొత్త వారిని నియమించారు. కొంతమంది సీనియర్ నేతలను సైతం పక్క నియోజకవర్గాలకు బదిలీ చేశాడు జగన్. దీంతో ఎన్నికల్లో వైసీపీ ఘోరంగా ఓడింది. గెలుపు కాదు కదా… చివరికి ప్రతిపక్ష హోదా లైన్ కూడా రాక ముందే బొక్కబోర్లా పడింది. మా ఓటర్లు వేరే ఉన్నారని గొప్పగా చెప్పిన సజ్జల… ఓడిన తర్వాత మాత్రం ఈవీఎం ట్యాపంరింగ్ అంటూ కవరింగ్ మాటలు చెప్పారు.
అంతే తప్ప అది రుజువు చేయలేకపోయారు. ఇక ఓటమి తర్వాత ఇప్పటికే జగన్ నిర్ణయాలను వ్యతిరేకిస్తూ సీనియర్ నేతలు చాలా మంది పార్టీకి గుడ్ బై చెప్పేశారు. అయితే జగన్ ఇప్పుడు తీసుకుంటున్న నిర్ణయాలపై పార్టీ నేతలే విమర్శలు చేస్తున్నారు. చేతులు కాలిన తర్వాత ఆకులు పట్టుకున్నట్లుగా ఉన్నాయంటున్నారు. ఎన్నికల్లో కేవలం ఐ ప్యాక్ టీమ్ సూచనలు మాత్రమే పరిగణనలోకి తీసుకున్న జగన్… ఇప్పుడు పార్టీ అగ్రనేతల సూచనలతో కొన్ని మార్పులు చేర్పులు చేస్తున్నారు. ఎన్నికల ముందు సిట్టింగ్‌ల నియోజకవర్గాలు మార్చిన జగన్… ఇప్పుడు మళ్లీ వారికి పాత నియోజకవర్గాలే కేటాయిస్తున్నారు. మాజీ మంత్రి విడదల రజినీని తిరిగి చిలకలూరిపేట పంపారు.
Also read : రాంగోపాల్ వర్మ అరెస్ట్ కి సర్వం సిద్దం
అలాగే అద్దంకి నియోజకవర్గం ఇంఛార్జ్ బాధ్యతల నుంచి హనిమిరెడ్డిని తప్పించి కరణం బలరాంకు కేటాయించారు. గిద్దలూరు నియోజకవర్గం ఇంచార్జిగా మళ్లీ అన్నా రాంబాబును నియమించారు. నరసరావుపేట ఎంపీ అభ్యర్థిగా పోటీ చేసి ఓడిన అనిల్ కుమార్ యాదవ్‌ను తిరిగి నెల్లూరు సిటీకి పంపారు. పాయకరావుపేటలో పోటి చేసి మంత్రి అనిత చేతిలో ఓడిన కంబాల జోగులుకు తిరిగి రాజాం బాధ్యతలే అప్పగించారు. జగన్ తీసుకుంటున్న తలతిక్క నిర్ణయాలతో సొంత పార్టీ నేతలే కాస్త కంగారు పడుతున్నారు. ఎన్నికలకు ముందు ఎందుకు మార్చారు… ఇప్పుడు మళ్లీ పాత స్థానాలకు ఎందుకు పంపుతున్నారని విమర్శిస్తున్నారు. కేవలం ఐ ప్యాక్ మాటలు వినటం వల్లే అభ్యర్థులను మార్చిన జగన్… సరిదిద్దుకోలేని తప్పు చేశాడని కొందరు నేతలు వ్యాఖ్యానిస్తుంటే… అసలు ఇప్పుడు మార్పులు చేర్పులు చేయాల్సిన అవసరం ఏమిటనేది మరి కొందరి మాట.