ఆంధ్రప్రదేశ్ లో వైసీపీ ప్రభుత్వాన్ని చూసుకుని కాలర్ ఎగరేసిన వారికి బొమ్మ కనపడుతోంది. ముఖ్యంగా పోసాని కృష్ణ మురళి, శ్రీరెడ్డికి చుక్కలు చూపించడానికి పోలీసులు సిద్దమయ్యారు. పోసాని కృష్ణమురళి, సినీ నటి శ్రీరెడ్డిపై పలు పోలీసు స్టేషన్లలో కేసులు నమోదు చేసారు పోలీసులు. టీటీడీ ఛైర్మన్ బీఆర్ నాయుడుపై అసభ్యకరమైన వ్యాఖ్యలు చేసిన పోసాని కృష్ణమురళిపై పార్వతీపురం మన్యం జిల్లా పాలకొండ టీడీపీ నాయకులు పోలీసు స్టేషన్‌లో ఫిర్యాదు చేయగా… కేసు నమోదు చేసారు. టీటీడీ ఛైర్మన్‌ను అభ్యంతకర పదజాలంతో దూషించిన పోసానిపై కఠిన చర్యలు తీసుకోవాలని కోరారు.
Also Read : కౌరవ సభ కాదు.. గౌరవ సభ అని నిరూపించిన అయ్యన్న
అలాగే కర్నూలు త్రీ టౌన్ పోలీస్ స్టేషన్ లో కూడా టీటీడీ ఛైర్మన్ బీఆర్ నాయుడిపై చేసిన వ్యాఖ్యలపై ఫిర్యాదు అందగా పోలీసులు కేసులు నమోదు చేసారు. శ్రీకాకుళం జిల్లా పార్లమెంట్ పార్టీ టీడీపీ అధ్యక్షుడు కలమట వెంకటరమణమూర్తి ఫిర్యాదు మేరకు… మరో కేసు నమోదు అయింది. మంత్రి నారా లోకేశ్, టీడీపీ నాయకులపై దుర్భాషలాడిన నేపథ్యంలో పోసానిపై పాతపట్నంలో కేసు నమోదు చేసారు. ఇక శ్రీరెడ్డిపై కూడా పలు స్టేషన్లలో కేసులు నమోదు చేసారు. కృష్ణా జిల్లా గుడివాడ పోలీసు స్టేషన్‌లో… టీడీపీ నేతల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసారు.
Also Read : మదనపల్లి ఫైల్స్ ఘటనలో పెద్దిరెడ్డికి బిగుస్తున్న ఉచ్చు..!
చంద్రబాబు, పవన్, అనితలపై సామాజిక మాధ్యమాల్లో అసభ్యకర రీతిలో పోస్టులు పెట్టారని మచిలీపట్నం టీడీపీ సోషల్ మీడియా కన్వీనర్ అసిలేటి నిర్మల ఫిర్యాదు చేయగా కేసు నమోదు అయింది. అనకాపల్లిలో కూడా శ్రీరెడ్డిపై మరో కేసు నమోదు అయింది. తెలుగు మహిళ ఉపాధ్యక్షురాలు కొణతాల రత్నకుమారి ఫిర్యాదు మేరకు అనకాపల్లి పట్టణ పోలీసు స్టేషన్‌లో కేసు నమోదు అయింది. విశాఖ టూ టౌన్ పోలీస్ స్టేషన్ లో… సీఎం చంద్రబాబు సతీమణి నారా భువనేశ్వరి, డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్, హోంమంత్రి వంగలపూడి అనితపై అనుచిత వ్యాఖ్యలు చేసారనే కారణంతో కేసు నమోదు చేసారు.