రాష్ట్రంలో మహిళలు, అమ్మాయిలపై జరుగుతున్న అత్యాచార ఘటనలు, దాడులపై ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ తీవ్ర స్థాయిలో స్పందించారు. కాకినాడ జిల్లా పర్యటనలో ఉన్న ఆయన ఓ వైపు పోలీసులను, మరో వైపు హోం మంత్రి అనిత తీరుని తప్పుబడుతూ వ్యాఖ్యలు చేసారు. పవన్ కళ్యాణ్ ను అరెస్ట్ చేయడానికి వేగంగా స్పందించే పోలీసులు ఆడపిల్లలపై అఘాయిత్యాలు చేస్తుంటే ఏం చేస్తున్నారని నిలదీశారు. సమాజంలో బాధ్యత లేకుండా నోటికొచ్చినట్లు మాట్లాడతాం అంటే కుదరదు అని వైసీపీ నేతలను హెచ్చరించారు.
గత ప్రభుత్వం మాదిరి పోలీసులు అలసత్వంగా ఉండొద్దు అని హెచ్చరించారు పవన్. ఈ సందర్భంగా హోం శాఖపై కీలక వ్యాఖ్యలు చేసారు. హోమ్ శాఖ మంత్రి అనిత గారికి విజ్ఞప్తి… ఇష్టమొచ్చినట్లు రౌడిల్లా వైసీపీ వ్యక్తులు వ్యవహరిస్తుంటే మీరు ఏం చేస్తున్నారు? అని నిలదీశారు. చర్యలు తీసుకోరా? ఆడబిడ్డలను బెదిరిస్తూ, అవమానిస్తుంటే అరెస్టు చేయరా? అంటూ తీవ్ర స్థాయిలో స్పందించారు. మీరు బాధ్యతగా వ్యవహరించండి, బలంగా పనిచేసి చట్టపరంగా వ్యవహరించండి అని హితవు పలికారు పవన్ కళ్యాణ్.
Also Read : వాళ్లను చూసైనా నేర్చుకోవాలి కదా జగన్ రెడ్డి..!
నేను పంచాయతీరాజ్ శాఖ మంత్రిని, హోమ్ శాఖ మంత్రిని కాదు. పరిస్థితులు చెయ్యి దాటితే నేను హోమ్ శాఖ తీసుకుంటాను, నేను హోమ్ తీసుకుంటే ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి శ్రీ యోగి ఆదిత్యనాథ్ తరహాలో వ్యవరిస్తానని ఆయన సంచలన వ్యాఖ్యలు చేసారు. డీజీపీ గారు గత ప్రభుత్వం లా వ్యవహరించకూడదు, బాధ్యత తీసుకోండి, పాత పద్ధతులు పాటిస్తాం అంటే చూస్తూ ఊరుకోను అని పవన్ ఘాటు వ్యాఖ్యలు చేసారు. ప్రజలు ఇచ్చిన పదవి ఇది, వారికి రక్షణ కల్పించాలన్నారు పవన్.
ఇది స్థిరమైన ప్రభుత్వం, వ్యక్తులు చేసే తప్పులపై చర్యలు ఉంటాయి, కూటమిని ఎవరు చెడగొట్టలేరు అని స్పష్టం చేసారు. నేను, సీఎం చంద్రబాబు నాయుడు గారు చాలా క్లారిటీగా ఉన్నాం, ఈ పొత్తు స్థిరమైనది, కొంతమంది వ్యక్తులు చేసే ప్రయత్నాలు మమ్మల్ని ఏం చేయలేవు, వ్యక్తులు చేసే తప్పులను కులానికి ఆపాదించకండి అంటూ స్పష్టం చేసారు. టీడీపీ, జనసేన నేతలు వ్యక్తిగత ప్రయోజనాల కోసం ప్రయత్నాలు చేయవద్దని పవన్ హెచ్చరించారు.