నేడు ఎన్టీఆర్ భవన్ లో సీఎం చంద్రబాబు అధ్యక్షతన కీలక సమావేశం జరుగుతోంది. ఎన్టీఆర్ భవన్ లో సీఎం చంద్రబాబు అధ్యక్షతన టీడీపీ ప్రజాప్రతినిధులు భేటీ కానున్నారు. ఈ సమావేశంలో టీడీపీ ఎమ్మెల్యేలు, ఎంపీలు, ఎమ్మెల్సీలు పాల్గొంటారు. ఎన్డీయే ప్రభుత్వ విజయాలు, సభ్యత్వ నమోదు సహా ఎనిమిది అంశాలపై చర్చ జరగనుంది. టీడీపీ సభ్యత్వ నమోదు, పంచాయతీరాజ్ వ్యవస్థల అంశాలపై సీఎం చర్చిస్తారు. పల్లె పండుగ, సూపర్ సిక్స్ పాలసీలపై సీఎం చంద్రబాబు చర్చిస్తారు.
క్షేత్రస్థాయిలో సమస్యల్ని ఎంపీలు, ఎమ్మెల్యేల నుంచి తెలుసుకోనున్న చంద్రబాబు పలు కీలక సూచనలు చేయనున్నారు. అయితే ఈ సమావేశంలో చంద్రబాబు ఏ అంశాలు మాట్లాడతారో అనే ఆందోళన పార్టీ నేతల్లో ఉంది. ముఖ్యంగా ఇసుక, మద్యం, గంజాయి విషయంలో చంద్రబాబు సీరియస్ గా ఉన్నారు. గంజాయి అక్రమ రవాణా విషయంలో గత ప్రభుత్వంలో కొందరు ఎమ్మెల్యేలు సహకరించారు అనే భావన ప్రజల్లో బలంగా ఉంది. ఈ నేపధ్యంలో చంద్రబాబు… టీడీపీ నేతలకు వార్నింగ్ ఇవ్వనున్నట్టు సమాచారం.
Also read : సజ్జలకు హ్యాండిచ్చిన వైసీపీ సోషల్ మీడియా..!
నియోజకవర్గాల్లో గంజాయి విషయంలో ప్రజలకు అవగాహన కల్పించే బాధ్యతను ఎమ్మెల్యేలకు ఇవ్వనున్నారు చంద్రబాబు. అలాగే ఇసుక అక్రమ రవాణా విషయంలో గాని, మద్యం వ్యాపారంలో జోక్యం చేసుకోవడం గాని ఎమ్మెల్యేలు చేయకూడదు. చేస్తే మాత్రం ఖచ్చితంగా కఠిన చర్యలు ఉంటాయని ఇప్పటికే హెచ్చరించారు. అలాగే కొందరు ఎమ్మెల్యేలు భూ దందాలు చేస్తున్నారనే ఆరోపణ కూడా ఉంది. ఈ నేపధ్యంలోనే చంద్రబాబు కఠినంగా ముందుకు వెళ్ళే అవకాశం ఉంది. కొందరు ఎమ్మెల్యేల విషయంలో నివేదిక కూడా సిద్దం చేసినట్లు తెలుస్తోంది. అలాగే జనసేన నేతల గురించి కూడా అడిగే అవకాశం ఉంది. ఇక నియోజకవర్గాల్లో పెత్తనం చెలాయించే నేతలను కట్టడి చేయడానికి కూడా చంద్రబాబు పలు సూచనలు చేయనున్నారు.