ఏ మాటకు ఆ మాట… వైసీపీ అధికారంలో ఉన్న సమయంలో వైఎస్ జగన్ కంటే సజ్జల రామకృష్ణా రెడ్డినే చాలా మంది మంత్రులు, ఎమ్మెల్యేలు ముఖ్యమంత్రిగా భావించే వారు. మరి ఆయనకు ప్రభుత్వంపై అంత పట్టు ఎలా చిక్కిందో తెలియదు గాని సజ్జల మాత్రం చాలా జాగ్రత్తగా వ్యూహాలు అమలు చేయడం, అన్ని శాఖలపై పట్టు పెంచుకోవడం వంటివి చేసారు. ఇక వైసీపీ నేతలకు ఏదైనా సమస్యలు ఉంటే వాటికి పరిష్కారం చూపే బాధ్యత కూడా సజ్జల రామకృష్ణా రెడ్డి తీసుకోవడం అప్పట్లో సంచలనం అయింది.
ఉదాహరణకు దువ్వాడ శ్రీనివాస్, దివ్వెల మాధురి వ్యవహారం ఇక్కడి వరకు రావడం వెనుక సజ్జల కృషి ఉందనే వార్తలు కూడా వచ్చాయి. అలాంటి సజ్జల ఇప్పుడు వైసీపీలో ఏకాకి అయిపోయారు. జగన్ సపోర్ట్ మినహా ఆయనకు వైసీపీ నేతల నుంచి పెద్దగా మద్దతు లభించడం లేదు. ఒకప్పుడు ఆయన చెప్తే మీడియా ముందుకు వచ్చి పరిధికి మించి ఎక్కువ మాట్లాడే నేతలు… ఇప్పుడు ఆయనను విచారణకు పిలిచినా… ఆయనపై లుక్ అవుట్ నోటీసులు జారీ చేసినా ఎవరూ కూడా స్పందించే ప్రయత్నం చేయడం లేదు.
చివరకు ఎవరి నుంచి మద్దతు రాకపోవడంతో ఆయనే మీడియా సమావేశం ఏర్పాటు చేసి నేను చేసినవి అన్నీ పుణ్యాలు, ఇప్పుడు చంద్రబాబు సర్కార్ పాపాలు చేస్తుంది, వ్యవస్థలు నాశనం, పోలీసులు వ్యవస్థ భ్రష్టు అంటూ ఏవేవో మాట్లాడి… చివరకు చంద్రబాబు పొగరు అని మీడియా సమావేశం ముగించారు. ఇక వైసీపీ సోషల్ మీడియాను కనుసైగతో శాసించిన సజ్జల, ఆయన పుత్ర రత్నం… ఇప్పుడు వైసీపీ సోషల్ మీడియా నుంచి కూడా కనీస మద్దతు తెచ్చుకోలేకపోయింది. అసలు సజ్జల వలనే 11 సీట్లు అనే భావనలో ఉన్న వైసీపీ క్యాడర్… ఆయనకు మద్దతు ఇవ్వడం కష్టమే.