సినిమా టిక్కెట్ల రేట్లు ప్రస్తుతం ఎక్కువ ఉన్నాయా? నలుగురు సభ్యుల కుటుంబం మల్టీప్లెక్స్‌కు వెళ్ళి సినిమాను చూసే అవకాశం లేదా? ఈ విషయంలో నిర్మాతలు ఏమంటున్నారు? టాలీవుడ్‌లో ఈ చర్చ మళ్ళీ ఎందుకు జరుగుతోంది?
సినిమా సీజన్ వచ్చిందంటే చాలు… టిక్కెట్ల రేట్లపైనే చర్చ జరుగుతుంది. బడా హీరోల సినిమాలకు కొంతకాలంగా ఆయా ప్రభుత్వాలు టిక్కెట్ల రేట్లను పెంచుకునే అవకాశం ఇస్తున్నాయి. దీనితో పెద్ద సినిమాలు వచ్చినప్పుడల్లా టిక్కెట్ల రేట్ల పెంపుపై భిన్నాభిప్రాయాలు వ్యక్తమవుతూ వస్తున్నాయి. టిక్కెట్ల రేట్ల పెంపుతో సామాన్యులకు సినిమా దూరమవుతుందనే వాదన ఎప్పటి నుంచో ఉంది. అయితే పెద్ద సినిమాల ఖర్చు పెరిగినందున, నిర్మాతలు బతకాలంటే రేట్లు కూడా పెంచాలనే మరో వాదన కూడా ఉంది.
Also Read : భగవంత్ కేసరి రీమేక్ చేయాలంటున్న తమిళ స్టార్ హీరో
ఈ పరిణామాల మధ్య నిర్మాత సూర్యదేవర నాగవంశీ చేసిన వ్యాఖ్యలు టాలీవుడ్‌లో చర్చకు దారి తీశాయి. టిక్కెట్ల రేట్లు ఇప్పుడు పెద్దగా లేవని, రూ.1,500 ఖర్చుపెడితే కుటుంబంలో నలుగురు సభ్యులు ఎంచక్కా మూడు గంటలసేపు వినోదాన్ని ఎంజాయ్ చేయవచ్చని వ్యాఖ్యానించారు. నాగవంశీ ఇంతటితో ఆగిపోలేదు.. నలుగురు సభ్యులకు రూ.1,500తో ఎంటర్‌టైన్‌మెంట్ దొరికే ప్లేస్ ఏది ఉందని ప్రశ్నించారు. షాపింగ్ మాల్‌కు వెళ్తే ఇంతకంటే ఎక్కువవుతుందంటూ నాగవంశీ చెప్పుకొచ్చారు.
నాగవంశీ వ్యాఖ్యలపై పెద్ద చర్చే మొదలవ్వడంతో నిర్మాత ఎస్‌కేఎన్ స్పందించారు. ఇడ్లీ.. బజారులో బండి దగ్గర రూ.20కే దొరుకుతుంది. అదే ఇడ్లీకి స్టార్ హోటల్‌లో రూ.200 బిల్లు వేస్తారని, ఎక్కడ తినాలనేది వ్యక్తిగతమన్నారు. అందరితో మమేకమైన సినిమాను ఎలా చూడాలనేది ప్రేక్షకుల ఇష్టమన్నారు. తక్కువ ధరకే ఇవ్వు అనే హక్కు కూడా ప్రేక్షకులకు ఉందన్నారు. అలా అని పెంచిన రేట్ల డబ్బులన్నీ నిర్మాతకే వెళ్తున్నాయనేది కేవలం అపోహ మాత్రమే అని ఎస్‌కేఎన్ వివరించారు. మొత్తం మీద రాబోయే కాలంలో పెద్ద సినిమాలు విడుదలవుతున్న సమయంలో.. టిక్కెట్ల రేట్ల పెంపుపై పెద్ద రచ్చే జరుగుతోంది.