పార్టీ నేతల వరుస రాజీనామాలతో ఉక్కిరిబిక్కిరి అవుతున్న ఫ్యాన్ పార్టీకి విశాఖలో కూడా త్వరలోనే భారీ షాక్ తప్పదా? ఇప్పటికే కొంతమంది వైసీపీ నేతలు కూటమి నేతలతో టచ్‌లోకి వెళ్లారా? వైసీపీకి చెందిన ఓ మాజీ మంత్రి త్వరలోనే ఆ పార్టీకి రాజీనామా చేయనున్నారా? సార్వత్రిక ఎన్నికల్లో వైసీపీ ఘోర పరాజయం తర్వాత ఒక్కొక్కరుగా ఫ్యాన్ పార్టీకి గుడ్ బై చెబుతున్నారు. ఎంపీలు, ఎమ్మెల్సీలు, మాజీ మంత్రులు ఇప్పటికే జగన్‌కు టాటా చెప్పేసి కూటమి పార్టీల్లో చేరిపోతున్నారు. కొందరు నేతలైతే.. జగన్ నియంతృత్వ వైఖరికి విసిగిపోయి పార్టీ ప్రాధమిక సభ్యత్వానికి రాజీనామా చేసి రాజకీయాలకు దూరంగా ఉంటున్నారు.
ఇక విశాఖను వైసీపీ కంచుకోటగా చేద్దామనుకున్న జగన్‌కు ఉత్తరాంధ్ర వాసులు షాక్ ఇవ్వడంతో… ఫ్యాన్ పార్టీ నేతలే వైసీపీకి గుడ్ బై చెప్పేందుకు సిద్ధమవుతున్నారు. వైసీపీ మాజీ మంత్రి అవంతి శ్రీనివాసరావు త్వరలోనే పార్టీ వీడుతారనే ప్రచారం జోరుగా నడుస్తోంది. ఇప్పటికే కూటమి నేతలతో టచ్‌లో ఉన్నారని… అయితే సానుకూలమైన సమాధానం రాలేదని తెలుస్తోంది. అందుకే రాజకీయ భవిష్యత్తుపై ఏం చేయాలో అవంతికి తెలియటం లేదంటున్నారు ఆయన ప్రధాన అనుచరులు. ప్రజారాజ్యం, కాంగ్రెస్, టీడీపీలో వరుసగా పదేళ్ల పాటు ప్రజా ప్రతినిధిగా అధికారం అనుభవించారు అవంతి.
అనకాపల్లి ఎంపీగా టీడీపీ తరఫున ఎంపికైన అవంతి… వ్యూహాత్మకంగా 2019 మార్చి నెలలో వైసీపీలో చేరారు. బలమైన భీమిలి నియోజకవర్గం నుంచి ఎమ్మెల్యేగా అవంతి ఎన్నికయ్యారు. చంద్రబాబుపై ఘాటు వ్యాఖ్యలు చేయడంతో తొలి విడతలోనే జగన్ క్యాబినెట్‌లో మంత్రి పదవి దక్కించుకున్నారు అవంతి. అయితే అంతటితో ఆగని అవంతి… అధినేత మెప్పు కోసం చంద్రబాబును, పవన్‌ను, లోకేశ్‌ను, బీజేపీ నేతలను ఇష్టం వచ్చినట్లు తిట్టేశారు. అలాగే పసలేని ఆరోపణలు, ఛాలెంజ్‌లు చేసి అభాసుపాలయ్యారు కూడా. అదే సమయంలో రాజకీయ గురువు గంటా శ్రీనివాసరావుపై బహిరంగంగానే విమర్శలు చేశారు.
Also Read : జమిలి ఎన్నికల పై బాబు సంచలన వ్యాఖ్యలు
ఇక మంత్రి పదవి పోయిన తర్వాత దూకుడు తగ్గించారు. అదే సమయంలో అవంతి ఫోన్ కాల్ విషయం పెద్ద దుమారం రేపింది. దీంతో ఎన్నికల సమయంలో భీమిలి నుంచి గంటా శ్రీనివాసరావు పేరును టీడీపీ ప్రకటించగానే గంటా వర్సెస్ అరగంట అంటూ సోషల్ మీడియాలో మోత మోగిపోయింది. వైసీపీ ఓటమి తర్వాత అవంతి పార్టీలో ఉండలేకపోతున్నారట. అందుకనే తనను పార్టీలో చేర్చుకోవాలని కూటమి పెద్దలతో మంతనాలు జరుపుతున్నట్లు తెలుస్తోంది. అయితే గతంలో దారుణంగా తిట్టడం వల్ల అవంతి రాకను కూటమి నేతలు తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారు.
దీంతో తన భవిష్యత్తు ఏమిటని అవంతి డైలమాలో ఉన్నారంటున్నారు అనుచరులు. టీడీపీలో ఎంపీగా పదవి అనుభవించినప్పుడు చంద్రబాబుపై పొగడ్తల వర్షం కురిపించిన అవంతి… జగన్ పంచన చేరిన తర్వాత నానా మాటాలు అనేశారు. అదే సమయంలో పవన్ కల్యాణ్‌పై కూడా మూడు పెళ్లిళ్ల పేరుతో ఘాటుగానే వ్యాఖ్యలు చేశారు. ఇప్పుడు పార్టీ ఓడిపోవడంతో పాటు కనీసం ప్రతిపక్ష హోదా కూడా దక్కకపోవడంతో పాటు ఐదేళ్ల పాలనలో చేసిన అక్రమాలను కూటమి ప్రభుత్వం ఒక్కొక్కటిగా బయటకు తీస్తోంది. దీంతో తనకు కూడా ఇబ్బందులు తప్పవని భావించిన అవంతి… ఇప్పుడు జెండా మార్చేందుకు శతవిధాలుగా పాట్లు పడుతున్నాడు.
ఇప్పటికే విశాఖలో వైసీపీ కార్యక్రమాలకు అవంతి దూరంగా ఉంటున్నాడు. కనీసం జగన్‌తో కలిసేందుకు కూడా సుముఖత చూపటం లేదు. జగన్ అనకాపల్లి పర్యటనకు కూడా అవంతి రాలేదు. దీంతో అవంతి తీరుపై ఫ్యాన్ పార్టీ కార్యకర్తలు దుమ్మెత్తి పోస్తున్నారు. కూటమి నుంచి ఆహ్వానం లేకపోతే… తన సహచర మంత్రి ఆళ్ల నాని బాటలోనే రాజకీయాలకు స్వస్తి చెప్పి సైలెంట్‌గా వ్యాపారాలు చూసుకుంటే ఎలా ఉంటుందని కూడా అవంతి ఆలోచిస్తున్నట్లు తెలుస్తోంది. వరుసగా 15 ఏళ్లు పదవులు అనుభవించిన అవంతి… ఇప్పుడు అధికారం లేకపోవడంతో ఢీలా పడినట్లు తెలుస్తోంది.
అయితే ఇంత చర్చ జరుగుతున్నా.. అవంతి మాత్రం నోరు విప్పడం లేదు… తన పై వస్తున్న వార్తలను ఖండించడం లేదు, సమర్ధించడం లేదు.. అసలు అవంతి మనస్సులో ఏముందో ఆయనే స్వయంగా చెబితే తప్ప ఈ ఊహాగానాలు ఆగేటట్లు లేవు.