ఢిల్లీ పర్యటనకు వెళ్తున్నారు తెలంగాణా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి. ఈ పర్యటనలో భాగంగా ఆయన మరోసారి కేంద్ర మంత్రులను కలిసే అవకాశం కనపడుతోంది. ఏపీ సిఎం చంద్రబాబుతో కూడా ఢిల్లీలో రేవంత్ భేటీ అయ్యే అవకాశం ఉందని అంచనా వేస్తున్నారు. నక్సల్స్ ప్రభావిత రాష్ట్రాల సిఎంలతో కేంద్ర హోం శాఖ సమావేశం నిర్వహిస్తోంది. ఛత్తీస్గఢ్ లో మావోలను ఏరివేసే కార్యక్రమం చివరి దశకు చేరుకున్న నేపధ్యంలో రేవంత్ ఏ అభిప్రాయాలు చెప్తారు అనేది ఆసక్తిగా మారింది. మావోయిస్ట్ లు చత్తీస్ఘడ్ నుంచి తెలంగాణా వైపు వస్తుండటంతో కేంద్ర బలగాలను దించాలని రేవంత్ కోరతారని సమాచారం.
ఇక హోం శాఖ ఆధ్వర్యంలో జరిగే సమావేశం అనంతరం కాంగ్రెస్ పెద్దలను కలవనున్న సీఎం… మంత్రి వర్గ విస్తరణపై చర్చించే సూచనలు స్పష్టంగా కనపడుతున్నాయి. దసరాకు మంత్రివర్గ విస్తరణ జరుగుతుందనే ప్రచారం జరుగుతోంది. తెలంగాణ క్యాబినెట్లో ఆరుగురు మంత్రులకు అవకాశం ఉంది. హర్యానా ఎన్నికలు కూడా ముగియడంతో మంత్రివర్గ విస్తరణకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చే అవకాశం ఉంది. ఇప్పటికే కేబినెట్ లో ప్రాతినిధ్యం లేని నిజామాబాద్ , ఆదిలాబాద్ , హైదరాబాద్ , రంగారెడ్డి జిల్లాల నుంచి కొందరిని తీసుకోనున్నారు.
విస్తరణ తో పాటు శాఖల మార్పు కూడా ఉండే అవకాశం ఉందని, ముఖ్యంగా జల వనరుల శాఖను మారుస్తారని తెలుస్తోంది. అలాగే హోం శాఖ విషయంలో కూడా మార్పులు ఉండవచ్చు అని సమాచారం. కార్పోరేషన్ల భర్తీ పై కూడా క్లారిటీ వచ్చే అవకాశం ఉంది. మునుగోడు ఎమ్మెల్యే రాజగోపాల్ రెడ్డికి, మండవ వెంకటేశ్వరరావుకు మంత్రి వర్గంలో ఛాన్స్ లభించే అవకాశం ఉంది. అలాగే బల్మూరి వెంకట్ ను కూడా రేవంత్ కేబినేట్ లోకి తీసుకునే సూచనలు కనపడుతున్నాయి. రంగారెడ్డి జిల్లాకు చెందిన తీగల కృష్ణారెడ్డి కూడా కేబినేట్ లోకి వచ్చే సూచనలు ఉన్నాయి.