ఆంధ్రప్రదేశ్ లో భారీ వరదలు గత రెండు వారాల నుంచి ప్రజలకు చుక్కలు చూపిస్తున్న సంగతి తెలిసిందే. ఇప్పుడు రాష్ట్రానికి చేసే సాయంపై కేంద్రం కూడా సీరియస్ గానే దృష్టి పెడుతోంది. అధిక వర్షాలు, వరదల కారణంగా జరిగిన నష్టాన్ని పరిశీలించి అంచనా వేసేందుకు రాష్ట్రానికి ప్రత్యేక కేంద్ర బృందం వచ్చింది. ఈ మేరకు అధికార యంత్రాంగం రూట్ మ్యాప్ సిద్దం చేసింది. ఇప్పటికే వరద నష్టంపై ప్రాథమిక నివేదిక రూపొందించారు. వరద పరిస్థితిని, జరిగిన నష్టానికి సంబంధించి తాడేపల్లి డిజాస్టర్ మేనేజ్మెంట్ కార్యాలయంలో కేంద్ర బృందానికి వివరిస్తన్నారు అధికారులు.
వివిధ శాఖల అధికారులతో కేంద్ర బృందం భేటీ.. శాఖల వారీగా జరిగిన నష్టాన్ని వివరించారు. భారీ వర్షాలు, వరదల వల్ల 7 జిల్లాలు ప్రభావితం అయ్యాయని అధికారులు కేంద్ర బృందం దృష్టికి తీసుకువెళ్ళారు. పశ్చిమ గోదావరి, ఏలూరు, కృష్ణా, ఎన్టీఆర్, గుంటూరు, బాపట్ల, పల్నాడు జిల్లాల్లో ప్రభావం ఉందని వివరించారు. బుడమేరు కారణంగా ముంపుకు గురైన విజయవాడ నగరం పరిస్థితిని వివరించారు. ఈ సందర్భంగా పలు ఫోటోలను కూడా చూపించారు. రాష్ట్ర ప్రభుత్వం చేపట్టిన వరద సహాయక, పునరావాస చర్యలను కేంద్ర బృందానికి వివరించారు.
Read Also : టిడిపి లోకి క్యూ కడుతున్న వైసీపీ నాయకులను నమ్మొచ్చా?
వరదలు, భారీ వర్షాల ధాటికి 32 వార్డులు, 2 గ్రామాలు, 161 సచివాలయాల పరిధిలో ప్రజానీకం ఇబ్బంది పడ్డారని, NDRF, SDRF, నేవీ సాయంతో సహాయక చర్యలు చేపట్టామని తెలిపారు. త్వరతగతిన విద్యుత్ పునరుద్దరించామని, పారిశుద్ధ్య పనులు చేపట్టామని కేంద్ర బృందానికి తెలిపారు. డ్రోన్లు, హెలికాప్టర్ ల ద్వారా బాధిత ప్రజలకు ఆహారం, త్రాగునీరు, పాల ప్యాకెట్స్, బిస్కెట్ ప్యాకెట్ లు పంపిణీ చేశామని పేర్కొన్నారు. భారీగా వ్యవసాయ, ఉద్యాన పంటలకు నష్టం వాటిల్లిందని, వరద ప్రభావిత ప్రాంతాల వీడియోలను సైతం చూపించారు. అలాగే ఏపీఎస్డిఎంఏ కార్యాలయంలో ఏర్పాటు చేసిన ఫొటో ఎగ్జిబిషన్ ను కేంద్ర అంతర్ మంత్రిత్వ శాఖల ప్రత్యేక బృందం(ఐఎంసీటీ) సభ్యులు పరిశీలిస్తారు. ఏపీ ని వరద ముంచెత్తినప్పటి నుంచి కేంద్ర బృందాలు ఒక్కొక్కటిగా పరిశీలనకు వచ్చి జరిగిన తమ నివేదికలు కేంద్రానికి ఇస్తున్నాయి. సాధారణంగా కాస్త నింపాదిగా జరిగే ఈ కార్యక్రమాలు ఇప్పుడు బాబు ఒత్తిడి కారణంగా వెంటవెంటనే జరుగుతున్నాయని రాజకీయ పరిశీలకులు అంచనా వేస్తున్నారు.