ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఇప్పుడు నూతన మద్యం పాలసీ దిశగా అడుగులు వేస్తోంది. రాష్ట్రంలో నూతన మద్యం పాలసీ కోసం మద్యం ప్రియులు ఎప్పటి నుంచో ఎదురు చూస్తున్నారు. గత సర్కార్ తీసుకొచ్చిన మద్యం పాలసీపై ఎన్నో విమర్శలు వచ్చాయి. పాపులర్ బ్రాండ్ లను వదిలి లోకల్ బ్రాండ్ లను తీసుకు రావడం పట్ల తీవ్ర ఆరోపణలు వచ్చాయి. అలాగే మద్యం ధరలు కూడా భారీగా పెంచడం పట్ల తీవ్ర విమర్శలు వచ్చాయి. ఇక నాణ్యమైన మద్యం అందించకుండా చీప్ క్వాలిటీ ఇచ్చారని విమర్శలు ఉన్నాయి.
మొన్నటి ఎన్నికల్లో వైసీపీ ఓడిపోయి టీడీపీ రావడంతో నూతన మద్యం పాలసీని తీసుకొస్తామని ప్రభుత్వం ప్రకటించింది. దీనిపై టిడిపి ప్రభుత్వం ఇప్పుడు కసరత్తు జరుపుతోంది. 2019కు ముందు చీప్ లిక్కర్ క్వార్టర్ రూ.70కు కూడా దొరికేది. వైసీపీ ప్రభుత్వంలో చీప్ లిక్కర్ క్వార్టర్ ధర రూ.150 దాటింది. ఇప్పుడు ఆ ధరలను తగ్గించాలని సర్కార్ భావిస్తుంది. అలాగే పాపులర్ మద్యం బ్రాండ్లను పూర్తిస్థాయిలో తీసుకొచ్చేందుకు సర్కార్ కసరత్తు చేస్తుంది. పేదలు తాగే తక్కువ రకం మద్యం ధరలు తగ్గించాలని నిర్ణయించిన సర్కార్ మీడియం, ప్రీమియం బ్రాండ్ల ధరలను సైతం తగ్గించే ప్లాన్ చేస్తుంది.
ఎన్‌డీపీఎల్ రూపంలో మీడియం, ప్రీమియం బ్రాండ్లు పొరుగు రాష్ట్రాల నుంచి ఏపీలోకి తీసుకు వస్తున్నారు. వీటిని అరికట్టేందుకు ధరలు తగ్గించే ప్లాన్ చేస్తున్నట్టుగా వార్తలు వస్తున్నాయి. ప్రైవేట్ మద్యం షాపుల విధానం వస్తే అన్ని కంపెనీలకు న్యాయం జరుగుతుందనే అభిప్రాయం వినపడుతుంది. అక్టోబరు 1 నాటికి కొత్త మద్యం పాలసీని అమల్లోకి తీసుకు రావాలని ప్రయత్నం చేస్తున్నట్టు మంత్రి కొల్లు రవీంద్ర పేర్కొన్నారు. సరిహద్దు రాష్ట్రాల నుంచి వచ్చే మద్యాన్ని కూడా కట్టడి చేసేందుకు చర్యలు చేపట్టనున్నారు. అన్నీ అనుకున్నట్లు జరిగితే మందు బాబులకు ఇక పండగే పండగ.