ఏపీ మాజీ ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి అక్రమాస్తుల కేసులో సుప్రీంకోర్టు సీరియస్ అయ్యింది. సీబీఐ దాఖలు చేసిన అఫిడవిట్‌లోని అంశాలు షాకింగ్ కలిగిస్తున్నాయని జస్టిస్ సంజీవ్ ఖన్నా పేర్కొన్నారు. ఏ కేసుల్లో లేని సమస్యలు వైఎస్ జగన్ అక్రమాస్తుల కేసుల్లో తలెత్తుతున్నాయని సుప్రీం కోర్ట్ ధర్మాసనం ఆగ్రహం వ్యక్తం చేసింది. ఉండి ఎమ్మెల్యే రఘురామ కృష్ణం రాజు దాఖలు చేసిన పిటీషన్ పై విచారణ జరిపిన సుప్రీం కోర్ట్ ధర్మాసనం ఈ సందర్భంగా ఆసక్తికర వ్యాఖ్యలు చేసింది. సీబీఐ దాఖలు చేసిన అఫిడవిట్ లోని అంశాలు షాకింగ్ గా ఉన్నాయని జస్టిస్ సంజీవ్ ఖన్నా వ్యాఖ్యానించారు. కేసులు ట్రయల్ ప్రారంభం కాకుండా… ఇన్ని కేసులు ఎలా ఫైల్ చేశారు అని ఆయన ఆశ్చర్యం వ్యక్తం చేసారు.
ఆరుగురు జడ్జిలు మారిపోయారు లేక రిటైర్ అయ్యారని… గత పదేళ్లుగా ఇదే పనిలో ఉన్నారని ధర్మాసనం దృష్టికి రఘురామ తరపు న్యాయవాది తీసుకొచ్చారు. కోర్టులో వచ్చిన ఆదేశాలు తప్పు అని, ఇంకో కోర్టులో ఇచ్చిన ఉత్తర్వులు తప్పు అంటూ కాలయాపన చేస్తున్నారని జస్టిస్ సంజీవ్ ఖన్నా అసహనం వ్యక్తం చేశారు. కోర్టుల ఉత్తర్వులు తప్పు అంటూ చేస్తున్న వ్యవహారానికి ట్రయల్‌కి సంబంధం లేదని జస్టిస్ ఖన్నా అసహనం వ్యక్తం చేశారు. డిశ్చార్జ్ పిటిషన్లు వేస్తున్నారని, సాధారణ కార్యకలాపాలకు ఇది అడ్డంకిగా మారుతోందని రఘురామ తరపు న్యాయవాది పేర్కొన్నారు. దీనిపై స్పందించిన సంజీవ్ ఖన్నా సుప్రీంకోర్టులో తాము కూడా అనేక పిటిషన్లు విచారించి డిశ్చార్జ్ చేస్తున్నామని… ఎప్పుడూ ఎలాంటి అడ్డంకి తమకు రావడం లేదు అన్నారు.
జగన్ అక్రమాస్తుల కేసు విచారణను వేగవంతం చేయాలని, విచారణ తెలంగాణ నుంచి మరో రాష్ట్రానికి బదిలీ చేయాలని రఘురామ తరఫు న్యాయవాది కోరారు. తెలంగాణ నుంచి డిశ్చార్జ్ పిటిషన్లు వేస్తున్నారని, కోర్టు సాధారణ కార్యకలాపాలకు ఇది అడ్డంకిగా మారుతోందని రఘురామ తరఫు న్యాయవాది ధర్మాసనం ఎదుట చెప్పారు. సిబిఐ తరపు వాదనలు వినిపించడానికి ఎఎస్‌జి రాజు అందుబాటులో లేరని ఇతర న్యాయవాదులు పేర్కొనగా ఎఎస్‌జి రాజును వెంటనే పిలిపించాలని ఆదేశించింది ధర్మాసనం. కాగా జగన్ కేసులను సిబిఐ కోర్ట్ లో రోజువారి విచారణ చేపడుతున్న సంగతి తెలిసిందే. ఇక విచారణ జరుగుతున్నా జగన్ మాత్రం కోర్ట్ కి హాజరు కావడం లేదు.