గన్నవరం టీడీపీ కార్యాలయంపై 2023, ఫిబ్రవరి 20న అప్పటి ఎమ్మెల్యే వల్లభనేని వంశీ మోహన్ అనుచరులు చేసిన దాడి ఇంకా టీడీపీ కార్యకర్తల కళ్ళ ముందే ఉంది. దాదాపు 5 గంటలు పాటు… పగబట్టి దాడి చేసినా సరే పోలీసులు కూడా అడ్డుకోలేదు అనే ఆరోపణలు బలంగా వినిపించాయి. ఇప్పుడు టీడీపీ అధికారంలోకి వచ్చే వరకు కూడా ఆ కేసు అసలు పట్టించుకోలేదు. టీడీపీ అధికారంలోకి రాకపోతే ఆ కేసు అసలు బయటకు తీసే పరిస్థితి కూడా ఉండదు. అక్కడ దాడి జరుగుతుంటే టీడీపీ కార్యకర్తలను అరెస్ట్ చేయడం ఆశ్చర్యానికి గురి చేసిన అంశం.
ఈ కేసు విషయంలో సిఎం హోదాలో ఉండి జగన్ కూడా స్పందించలేదు. అప్పట్లో విధ్వంసం సృష్టించిన వారిలో 20 మందిని పోలీసులు అదుపులోకి తీసుకోగా అప్పుడు కొందరికి బెయిల్ వచ్చేసింది. ఈ కేసులో నిందితుడిగా వంశీ పేరు ఉండటంతో అసలు ఆయన్ను అదుపులోకి తీసుకుంటారా లేదా అనేది ఆసక్తిగా మారింది. రెండు మూడు రోజుల నుంచి ఆయన్ను అదుపులోకి తీసుకునే అవకాశం ఉందనే ప్రచారం మనం చూస్తూనే ఉన్నాం. ప్రస్తుతం వంశీ అమెరికా పారిపోయారనే వార్తలు కూడా వస్తున్నాయి.
నిన్న మధ్యాహ్నం నుంచి ఆయన్ను దాదాపుగా అరెస్ట్ చేయవచ్చు అంటూ ప్రచారం గట్టిగానే సాగుతుంది. అయితే ఆయన సతీమణి హైదరాబాద్ నుంచి గన్నవరం వచ్చారు. ఆయన ఉన్నారనే అనుమానంతో పోలీసులు ఆ కారుని వెంటపడి పట్టుకునే ప్రయత్నం చేసారు. తీరా చూస్తే ఆయన లేరు. వంశీ ఇటీవల అమెరికా నుంచి తిరిగి వచ్చారని ప్రస్తుతం రాజస్థాన్ లేదా బెంగళూరులో ఉండే అవకాశం ఉందని రాజకీయ వర్గాలు అంటున్నాయి. లేదంటే ఆయన పంజాబ్ లోని మొహాలి లో ఉండవచ్చు అని సమాచారం.