ఉత్తర అమెరికాలోని పెన్సిల్వేనియా రాష్ట్రం వెస్ట్ చెస్టర్ నగరంలో మార్చి 11న మిడ్ అట్లాంటిక్ తానా టీం అంతర్జాతీయ మహిళా దినోత్సవ వేడుకలు నిర్వహించారు. ఇందులో భాగంగా మహిళా సాధికారతకు పెద్దపీట వేసి, అవని నుంచి అంతరిక్షం వరకు అన్ని రంగాలలో పురుషులతో సరిసమానంగా రాణిస్తున్న మహిళామణులందరిలో సృజనాత్మకతను తట్టి లేపే పలు కార్యక్రమాలు జరిగాయి. 600 మందికి పైగా పెన్సిల్వేనియా, న్యూ జెర్సీ రాష్ట్రాల్లో ఉన్న పలు ప్రవాస తెలుగింటి ఆడపడుచులు ఈ వేడుకల్లో ఉత్సాహంగా పాల్గొన్నారు. ఆటపాటలు, నృత్య ప్రదర్శనలు, ఫ్యాషన్ షోలతో అలరించారు. మగువలు, చిన్నారులు ప్రదర్శించిన నృత్యాలు ప్రత్యేక ఆకర్షణగా నిలిచాయి.
సెలవుదినాన్ని సంబరమాశ్చర్యాలతో, ఆసాంతం ఆహ్లాద పరిచేలా వేడుక కనులవిందుగా నిర్వహించారని విచ్చేసిన మహిళలు వారి అనుభూతిని నిర్వాహకులతో పంచుకున్నారు. ఈ సందర్భంగా.. ఇంతమంది ఆదర్శ వనితలు ఒక చోటు చేరి, అటపాటలు, కేరింతలతో హోరేత్తించడం తమకు ఎంతోసంతృప్తినిచ్చిదని వేడుకకు విచ్చేసిన స్త్రీమూర్తులకు నిర్వాహకులు కృతజ్ఞతలు తెలియజేశారు. రస్నా బేబీ, సింహాద్రిఫేమ్ చిత్ర కధానాయిక అంకిత ఝవేరి రాకతో వేడుక మరింత శోభాయమానంగా మారింది.
ఫిలడెల్ఫియాలో నిర్వహించిన మహిళా దినోత్సవం వేడుకలు పురస్కరించుకుని తానా అధ్యక్షులు అంజయ్య చౌదరిలావు శుభాకాంక్షలు తెలిపారు. తానా 23వ మహాసభల సమన్వయకర్త రవి పొట్లూరి మాట్లాడుతూ.. సమాజ నిర్మాణంలో సగభాగమైన స్త్రీ సమానత్వమే మన ప్రగతికి మూలం.. విద్య, వైద్య, వ్యాపార, రాజకీయ, క్రీడ, ఆర్ధిక, అంతరిక్ష, టెక్నాలజీ వంటి పలు రంగాలలో మహిళలు ఎన్నో విజయాలు సాధిస్తున్నారు. రంగం ఏదైనా పురుషులతో సమానంగా ఉన్నతశిఖరాలు అందుకుంటున్నారని ప్రశంసించారు. ‘మహిళలు మీకు జోహార్లు’ అని వందనం చేశారు.